Income Tax Vs. Creamy layer: ₹8 లక్షలు సంపాదించినా పేదలే అయితే, ₹2.50 లక్షల ఆదాయం మీద పన్ను ఎందుకు? లాజిక్ మిస్సైందా?
రూ. 8 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారిని కేంద్ర ప్రభుత్వం పేదలుగా పరిగణిస్తుంది.
Income Tax Vs. Creamy layer: జనరల్ లేదా OBC కేటగిరీ అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్రయోజనాన్ని పొందేందుకు, వార్షిక ఆదాయ పరిమితిని రూ. 8 లక్షలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది, దీనిని క్రీమీ లేయర్ (Creamy layer) అని కూడా అంటారు. OBC లేదా జనరల్ కేటగిరీలో, వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ. 8 లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాలు మాత్రమే ఈ రిజర్వేషన్ ప్రయోజనం పొందుతాయి. అంటే, రూ. 8 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారిని కేంద్ర ప్రభుత్వం పేదలుగా పరిగణిస్తుంది. ఈ నేపథ్యంలో... రాజ్యసభ MP పి.భట్టాచార్య అడిగిన ఒక ప్రశ్న కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది.
8 లక్షలు సంపాదించే వాళ్లు పేదలైతే, 2.50 లక్షలపై పన్ను ఎందుకు?
రూ. 8 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారిని పేదలుగా కేంద్ర ప్రభుత్వం పరిగణనించినప్పుడు, రూ. 2.50 లక్షలు సంపాదించే వారిని పన్ను చెల్లించమని ఎలా అడుగుతారని MP పి.భట్టాచార్య ప్రశ్నించారు. ఈ వివక్ష ఎందుకని కేంద్ర ఆర్థిక శాఖను అడిగారు.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకునేందుకు, ఆర్థికంగా వెనుకబడిన సాధారణ వర్గాల (EWS) కోసం కుటుంబ వార్షిక ఆదాయాన్ని రూ. 8 లక్షలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ రూ. 8 లక్షల పరిమితి అన్ని మూలాల నుంచి, అందరు కుటుంబ సభ్యుల వార్షిక ఆదాయాన్ని చేర్చడం ద్వారా వచ్చిందని వెల్లడించారు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం... కుటుంబం మొత్తానికీ కాకుండా, కేవలం ఒక వ్యక్తి ఆదాయం మీద ప్రాథమిక ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి రూ. 2.50 లక్షలు వర్తిస్తుందని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కుటుంబాల మొత్తం ఆదాయంలో వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కలుపుతామని కేంద్ర మంత్రి చెప్పారు. ఆదాయపు పన్ను చట్టంలో మాత్రం వ్యవసాయ ఆదాయం మీద పూర్తిగా పన్ను మినహాయింపు లభిస్తుందని వివరించారు.
రూ.5 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 87A ప్రకారం... రూ. 5 లక్షల వరకు సంపాదిస్తున్న వారికి 100% పన్ను మినహాయింపు ఇచ్చామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు. అంటే రూ. 5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఆదాయపు పన్ను చట్టం కింద లభించే ప్రోత్సాహకాలు, తగ్గింపులను సద్వినియోగం చేసుకోవచ్చని, తద్వారా, తమపై పడే పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు.
రూ.8 లక్షలు సంపాదించే వారికి కూడా అనేక మినహాయింపులు
ఏటా రూ. 8 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తి కూడా ఆదాయపు పన్ను చట్టం కింద అనేక మినహాయింపులు తీసుకోవడం ద్వారా పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చని పంకజ్ చౌధరి తెలిపారు. ఆదాయంపై ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని, ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తులను నిర్ణయించే ఆదాయ పరిమితిని పోల్చడం సరి కాదని దీనిని బట్టి స్పష్టం అవుతోందని చెప్పారు.