ITR Filing: ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు - అందుబాటులోకి ITR-1, ITR-4 ఫారాలు
ITR-1 & ITR-4 ద్వారా ఆదాయ పన్ను వివరాలను సమర్పించే పన్ను చెల్లింపుదార్ల కోసం ఎక్సెల్ యుటిలిటీ అందుబాటులో ఉంది
Income Tax Return Filing For FY23: 2022-23 ఆర్థిక సంవత్సరం లేదా 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి (AY 2023-24) ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITR) ఆఫ్‌లైన్‌లో దాఖలు చేయవచ్చు. ఇందుకోసం... ITR-1 & ITR-4 ఫారాలను ఆదాయపు పన్ను విభాగం జారీ చేసింది. ఆన్‌లైన్ ఐటీఆర్ ఫారాలు ఇంకా విడుదల కాలేదు. ITR-1 & ITR-4 కిందకు వచ్చే పన్ను చెల్లింపుదార్లు ఇప్పుడు ఆఫ్‌లైన్ ద్వారా రిటర్న్‌లను సమర్పించవచ్చు.
ఈ సమాచారాన్ని ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో ఉంచింది ఆదాయ పన్ను విభాగం (Income Tax Department). 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి ITR-1 & ITR-4 ద్వారా ఆదాయ పన్ను వివరాలను సమర్పించే పన్ను చెల్లింపుదార్ల కోసం ఎక్సెల్ యుటిలిటీ అందుబాటులో ఉందని తెలిపింది.
ITR-1 ఎవరికి వర్తిస్తుంది?
వార్షిక ఆదాయం రూ. 50 లక్షల వరకు ఉన్న పన్ను చెల్లింపుదార్లు ITR-1 ఫారం ద్వారా ఆదాయ వివరాలు సమర్పించాలి. జీతం ఆదాయం, ఇంటి ఆస్తి, వడ్డీ, రూ. 5 వేల వరకు వ్యవసాయ ఆదాయం వంటి ఆదాయ వనరులు ఇందులోకి వస్తాయి.
ITR-4 ఎవరికి వర్తిస్తుంది?
వ్యాపారం, వృత్తి ద్వారా ఏడాదికి రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు, HUFలు (హిందు అవిభక్త కుటుంబాలు), సంస్థలు (LLPలు మినహా) ITR-4 ఫారం ద్వారా ఆదాయపు పన్ను వివరాలను దాఖలు చేయవచ్చు. ఈ ఆదాయం 44AD, 44DA, 44AE కింద వ్యాపారం లేదా ఏదైనా వృత్తి ద్వారా వచ్చి ఉండాలి. వ్యవసాయ ఆదాయం రూ. 5000 కు మించకూడదు.
రిటర్న్‌ను ఆఫ్‌లైన్‌లో ఎలా సమర్పించాలి?
ITR-1 & ITR-4 ద్వారా ఆఫ్‌లైన్‌లో రిటర్న్‌లను ఫైల్ చేయాలనుకునే పన్ను చెల్లింపుదార్లు, ముందుగా ఇన్‌కమ్ టాక్స్ అధికారిక వెబ్‌సైట్ నుంచి సంబంధిత ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత, ఆ ఫారాన్ని పూరించి ఈ-ఫైలింగ్ ద్వారా అప్‌లోడ్ చేయాలి.
రిటర్న్‌ల ఫైలింగ్‌కు ఎప్పటి వరకు గడువుంది?
ఆన్‌లైన్ ఆదాయపు పన్ను రిటర్న్ ఫారాన్ని ఆదాయపు పన్ను విభాగం వెబ్‌సైట్‌లో నేరుగా ఈ-ఫైలింగ్‌లోనే పూరించవచ్చు. దీనిని త్వరలో విడుదల చేస్తారు. జీతం తీసుకునే వ్యక్తులు ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేయాలంటే, సంబంధిత కంపెనీ జారీ చేసే ఫారం-16 అవసరం. ఫారం-16 జారీకి కంపెనీలకు చివరి గడువు జూన్ 15. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయ వివరాలు సమర్పించడానికి జులై 31 వరకు (ITR Filing last date 2023) అవకాశం ఉంది.
ఈ సంవత్సరం ప్రారంభంలోనే, అంటే ఫిబ్రవరి రెండో వారంలోనే CBDT 2022-23 ఆర్థిక సంవత్సరం లేదా 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి కొత్త ఆదాయపు పన్ను దాఖలు ఫారాన్ని నోటిఫై చేసింది. CBDT ఎప్పుడూ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఇన్‌కంటాక్స్ రిటర్న్ ఫామ్‌ను నోటిఫై చేస్తుంది, ఈసారి అంతకంటే ముందే నోటిఫై చేసింది.