Direct Tax: ఖజానాకు కాసుల కళ, రూ.18.90 లక్షల కోట్లకు చేరిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు
వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదార్ల నుంచి రూ. 2.39 లక్షల కోట్లు రాగా, కార్పొరేట్ కంపెనీల నుంచి రూ. 6.73 లక్షల కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో అందాయి.
Direct Tax Collection For 2023-24: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఖజానాలోకి నిధులతో కళకళలాడుతోంది. ముందస్తు పన్ను (Advance Tax) వసూళ్లు పెరగడం వల్ల, 2023-24 ఆర్థిక సంవత్సరంలో మార్చి 17 వరకు, నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు (Net direct tax collection) 19.88 శాతం పెరిగి రూ. 18.90 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్' (CBDT), ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 17 వరకు మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ. 18,90,259 కోట్లుగా ఉన్నాయని, ఇందులో రూ. 9,14,469 కోట్ల కార్పొరేట్ పన్ను (Corporate Income Tax - CIT) కాగా, రూ.9,72,224 కోట్లు వ్యక్తిగత ఆదాయపు పన్ను (Individual Income Tax) ఉన్నాయని వెల్లడించింది. వ్యక్తిగత ఆదాయపు పన్నులో 'సెక్యూరిటీల లావాదేవీల పన్ను'ను (Security Transaction Tax - STT) కూడా చేర్చింది.
22.31 శాతం పెరిగిన అడ్యాన్స్ టాక్స్ చెల్లింపులు
ఈ ఏడాది మార్చి 17వ తేదీ వరకు చూస్తే.. ముందస్తు పన్ను వసూళ్లు రూ. 9.11 లక్షల కోట్లు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఇదే కాలంతో పోలిస్తే ఇది 22.31 శాతం ఎక్కువ. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదార్ల నుంచి రూ. 2.39 లక్షల కోట్లు రాగా, కార్పొరేట్ కంపెనీల నుంచి రూ. 6.73 లక్షల కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో అందాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 17 వరకు దాదాపు రూ. 3.37 లక్షల కోట్ల విలువైన రిఫండ్స్ (Tax Refund) జారీ అయ్యాయి.
మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లు 18.74 శాతం ఎక్కువ
రిఫండ్ జారీ చేయకముందు, ప్రత్యక్ష పన్ను వసూళ్లు స్థూలంగా (Gross Direct Tax Collection) రూ. 22.27 లక్షల కోట్లు వచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 18.74 శాతం ఎక్కువ.
ప్రభుత్వ అంచనా కంటే ఎక్కువ పన్ను వసూళ్లు
2023-24 ఆర్థిక సంవత్సరంలో మార్చి 17 వరకు, నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 18,90,259 కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ సంఖ్య రూ. 15,76,776 కోట్లుగా ఉందని CBDT తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరం కంటే ఇది 19.88 శాతం ఎక్కువ. ప్రత్యక్ష పన్నుల వసూళ్ల విషయంలో సవరించిన అంచనా (RE) ప్రకారం, 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 19.45 లక్షల కోట్లు వసూలవుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో వృద్ధిపై మార్కెట్ నిపుణులు సంతోషంగా ఉన్నారు. పన్ను ఆదాయంలో దాదాపు 20 శాతం పెరుగుదల.. ప్రజలు & కంపెనీల ఆదాయాలు పెరగడం, పన్ను విధానంలో తీసుకొస్తున్న సంస్కరణల వేగానికి నిదర్శనమని డెలాయిట్ ఇండియా భాగస్వామి సుమిత్ సింఘానియా చెప్పారు. ముందస్తు పన్ను వసూళ్లు పెరగడం వల్ల వివిధ వర్గాల పన్ను చెల్లింపుదార్లలో పన్ను కట్టాలన్న ఆలోచన పెరుగుతోందనడానికి గుర్తు అని అన్నారు.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి