Tax Calculator : కొత్త, పాత పన్ను విధానాల్లో ఏది బెటర్? ట్యాక్స్ కాలిక్యులేటర్ తో ఇలా చెక్ చేసుకోండి!
Tax Calculator : ఆదాయపు పన్ను విభాగం... చెల్లింపుదారులకు కొత్త, పాత పన్ను విధానాలపై అవగాహన కల్పించేందుకు, ఏ విధానం లాభదాయకమో లెక్కలు వేసుకోడానికి పన్ను కాలిక్యులేటర్ అందుబాటులోకి తెచ్చింది.
Tax Calculator : కొత్త, పాత ఆదాయపు పన్ను విధానాలపై అవగాహన కల్పించేందుకు ఆదాయపు పన్ను ట్యాక్స్ కాలిక్యులేటర్ ప్రారంభించింది. పన్ను చెల్లింపుదారులకు సహాయపడేందుకు ఆదాయపు పన్ను విభాగం తన పోర్టల్ లో ట్యాక్స్ కానిక్యులేటర్ అందుబాటులోకి ఉంచింది. ఇందులో ఏ పన్ను విధానంలో ఎంత పన్ను వర్తిస్తుందో సులభంగా తెలుసుకోవచ్చు. "సెక్షన్ 115BAC ప్రకారం వ్యక్తిగత/ HUF/ AOP/ BOI/ ఆర్టిఫిషియల్ జురిడికల్ పర్సన్ (AJP) కోసం పాత పన్ను విధానంలో కొత్త పన్ను విధానాన్ని తనిఖీ చేసేందుకు ట్యాక్స్ కాలిక్యులేటర్ లో తనిఖీ చేయవచ్చు. ఈ విషయాలన్ని ఆదాయపు పన్ను విభాగం ఓ ట్వీట్‌లో తెలిపింది.
Tax Calculator is now live!
— Income Tax India (@IncomeTaxIndia) February 20, 2023
A dedicated tax calculator to check Old Tax Regime vis-à-vis New Tax Regime for Individual/HUF/AOP/BOI/Artificial Juridical Person(AJP) as per Section 115BAC can now be accessed on the IT Dept website.
Pl check the link below:https://t.co/dy04iY4oj5 pic.twitter.com/JF4VfmXQw4
ట్యాక్స్ కాలిక్యులేటర్
కేంద్ర బడ్జెట్ 2023-24లో కొత్త పన్ను విధానంలో ప్రతిపాదించిన సవరణల ఆధారంగా పన్ను చెల్లింపుదారులు తమ పన్ను చెల్లింపులు పాత, కొత్త విధానాలు నిర్ణయించుకోవడంలో ట్యాక్స్ కాలిక్యులేటర్ సహాయం చేస్తుంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి ముందుగానే పన్ను విధానం ఎంపిక గురించి చెల్లింపుదారులకు తెలియజేయడానికి కాలిక్యులేటర్ అందుబాటులో ఉంచామని ఆదాయపు పన్ను విభాగం తెలిపింది.
కొత్త పన్ను విధానంలో
కొత్త పన్ను విధానంలో రాయితీలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఈ విధంగా చేస్తున్నట్లు ప్రకటించింది ఆదాయపు పన్ను విభాగం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 కేంద్ర బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు వివిధ రాయితీ ప్రకటించారు. నూతన పన్ను విధానంలో శ్లాబ్‌ల సంఖ్యను ఐదుకు తగ్గించడం, పన్ను మినహాయింపు పరిమితిని రూ.3 లక్షలకు పెంచడం, ఆదాయపు పన్ను రాయితీ పరిమితిని రూ.7 లక్షలకు పెంచడం చేశారు. స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కొత్త పన్ను విధానానికి కూడా విస్తరించారు. పాత ఆదాయపు పన్ను విధానం అలాగే కొనసాగుతుంది. కొత్త పన్ను విధానంలో మినహాయింపులతో పన్నుచెల్లింపుదారులు ఆ విధానం వైపు మళ్లే అవకాశం ఉంది.
ఇలా చెక్ చేసుకోండి
ట్యాక్స్ కాలిక్యులేటర్ కోసం ఇన్ కమ్ ట్యాక్స్ వెబ్ సైట్ కు వెళ్లాలి. ‘క్విక్ లింక్స్’లో ‘ఇన్‌కమ్ ట్యాక్స్ కాలిక్యులేటర్’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా నేరుగా కాలిక్యులేటర్ పేజీకి వెళ్తుంది. ఇక్కడ 1. బేసిక్ కాలిక్యులేటర్, 2. అడ్వాన్స్‌డ్ కాలిక్యులేటర్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఈ రెండింటి ద్వారా పన్ను ఎంత వర్తిస్తుందో కాలిక్యులేట్ చేయవచ్చు.
బేసిక్ కాలిక్యులేటర్
ఇందులో పన్ను చెల్లింపు సంవత్సరం, చెల్లింపుదారుడి కేటగిరీ (వ్యక్తిగత, హెచ్‌యూఎఫ్, ఎల్‌ఎల్‌పీ), వయస్సు(60 ఏళ్ల లోపు, సీనియర్ సిటిజన్, సూపర్ సీనియర్ సిటిజన్), నివాసం స్థితి ఆప్షన్ పూర్తిచేసి, మీ వార్షిక ఆదాయం, ఇతర మినహాయింపులు తెలియజేయాలి. అనంతరం మీకు పాత, కొత్త పన్ను విధానాల్లో ఎంత పన్ను చెల్లించాలో నేరుగా తెలియజేస్తుంది. ఏ విధానం ప్రయోజనకరమో కూడా స్పష్టంగా తెలుస్తుంది.
అడ్వాన్స్‌డ్ కాలిక్యులేటర్
అడ్వాన్స్‌డ్ కాలిక్యులేటర్ చెల్లింపుదారులు కట్టాల్సిన పన్నుపై స్పష్టత ఇస్తుంది. ఈ విధానంలో ముందుగా పాత, కొత్త పన్ను విధానాల్లో ఒకటి ఎంచుకోవాలి. ఆ తర్వాత అసెస్‌మెంట్ ఇయర్, పన్ను చెల్లింపుదారుని కేటగిరి, వయసు, నివాస స్థితి ఎంచుకోవాలి. ఒకవేళ మీ వయసు 30 ఏళ్లు, జీతం ద్వారా ఆదాయం పొందుతున్న ఉద్యోగి అయితే పన్ను చెల్లింపుదారుని కేటగిరీలో ఇండివిడ్యువల్, వయసు 60 ఏళ్ల లోపు వంటి ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలు పూర్తిచేయాలి. ముందుగా మీకు జీతం ద్వారా వచ్చే ఆదాయం పూర్తిచేయాలి. ఒకవేళ ఇంటి ద్వారా ఆదాయం, మూలధన ఆదాయం, ఇతర మార్గాల ద్వారా ఆదాయం వస్తుంటే ఆయా కేటగిరీలో ‘ప్రొవైడ్ ఇనకమ్ డీటెయిల్స్’ పై క్లిక్ చేసి పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత పన్ను ఆదా పెట్టుబడులు, ఇతర మినహాయింపులకు సంబంధించిన వివరాలు డిడక్షన్ కింద ప్రొవైడ్ ఇన్‌కమ్ డీటెయిల్స్ పై క్లిక్ చేసి ఇవ్వాలి. కొత్త పన్ను విధానంలో డిడక్షన్లు ఉండవు కాబట్టి మొత్తాన్ని ఎంటర్ చేసే అవకాశం ఉండదు. పాత పన్ను విధానంలో మాత్రం మినహాయింపులు ఉంటాయి. వాటిని ఎంటర్ చేయవచ్చు. ఇంకా మినహాయింపులు ఉంటే ఎంటర్ డిడక్షన్, ‘యాడ్ డిడక్షన్’ లో నమోదు చేయాలి. ఆ తర్వాత లెక్కించుపై క్లిక్ చేయాలి.