India Economic Growth GDP: మొన్న ప్రపంచ బ్యాంక్, ఇప్పుడు IMF -భారత వృద్ధి రేటు అంచనాలు పెంపు
2023-24 లేదా FY23లో దేశ ఆర్థిక వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదవుతుందని లెక్క కట్టింది.
India Economic Growth GDP: భారతదేశ ఆర్థికాభివృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund - IMF) వెల్లడించింది. 2023-24 లేదా FY23లో దేశ ఆర్థిక వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదవుతుందని లెక్క కట్టింది. అయితే... ముడి చమురు ధరల్లో పెరుగుదల, బలహీనమైన బాహ్య (విదేశాల నుంచి) డిమాండ్, కఠినమైన ద్రవ్య విధానం (వడ్డీ రేట్ల పెంపు) కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో (FY23-24) భారత దేశ ఆర్థిక వృద్ధిలో వేగం తగ్గుతుందని IMF పేర్కొంది. FY23-24లో భారత వృద్ధి రేటు 6.1 శాతానికి పరిమితం కావచ్చని వెల్లడించింది.
అంతర్జాతీయ పరిణామాల ప్రభావమే ఎక్కువ
వచ్చే రెండేళ్లలో భారత్‌లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెబుతోంది. అయినప్పటికీ, ప్రపంచ దేశాలను ఇప్పటికీ వణికిస్తున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ల కారణంగా వాణిజ్యం, ఆర్థిక అభివృద్ధి రెండూ ప్రభావితం అవుతాయని హెచ్చరించింది. IMF నివేదిక ప్రకారం... ఉక్రెయిన్‌లో యుద్ధం, రష్యా మీద యూరోపియన్ యూనియన్ (EU) విధించిన ఆంక్షలు, పెరుగుతున్న వస్తువుల ధరలు, ఆర్థిక మాంద్యం ఆందోళనలు, తగ్గిన విదేశీ డిమాండ్, ప్రపంచ వ్యాప్తంగా విశ్వాసం సన్నగిల్లడం వంటి అనేక స్థూల కారణాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. భారదేశ అంతర్గత అంశాల కంటే, అంతర్జాతీయ మందగమనం వంటి బాహ్య పరిణామాలే భారత ఆర్థిక వ్యవస్థ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి వివరించింది.
గతంతో పోలిస్తే అంచనా పెంపు
2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు 6 శాతంగా ఉంటుందని ఏడాది మధ్యకాలంలో IMF అంచనా వేసింది. దానితో పోలిస్తే, తాజా అంచనా చాలా ఎక్కువ. ప్రభుత్వ మూలధన వ్యయంలో పెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పనకు భారీ కేటాయింపులు, ప్రైవేట్ డిమాండ్ కారణంగా 2022-23లో GDP వృద్ధి రేటు 7 శాతంగా ఉండవచ్చని భారత అధికారులు విశ్వసిస్తున్నట్లు తన నివేదికలో IMF తెలిపింది.
ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను IMF ప్రశంసించినప్పటికీ... ముడి చమురు, వస్తువుల ధరల పెరుగుదల కారణంగా సాధారణ ప్రజానీకం మీద, ఆర్థిక వ్యవస్థ మీద ఒత్తిడి కొనసాగుతుందని IMF హెచ్చరించింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును ఈ ఏడాదిలో ఐదు సార్లు పెంచింది. రెపో రేటును 4 శాతం నుంచి 6.25 శాతానికి తీసుకు వెళ్లింది. ఆగస్టు 2018 తర్వాత మళ్లీ ఇదే అత్యధిక స్థాయి రెపో రేటు.
2022-23లో ద్రవ్యోల్బణం 6.9 శాతం ఉంటుందని IMF అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఆహార వస్తువుల ధరల్లో తగ్గుదల, కఠినమైన ద్రవ్య విధానం కారణంగా... వచ్చే ఏడాది నాటికి, ద్రవ్యోల్బణం RBI టాలరెన్స్ బ్యాండ్‌లో (2-6 శాతం మధ్య) చేరవచ్చని అభిప్రాయపడింది. నవంబర్ 2022లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.88 శాతానికి తగ్గింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత GDP వృద్ధి అంచనాను 6.9 శాతానికి ప్రపంచ బ్యాంక్ కూడా పెంచింది. ప్రపంచ ప్రతికూల పరిణామాల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని ఈ నెల ప్రారంభంలో ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.