ICC World Cup Cricket 2023: విమాన ప్రయాణాల్లో సరికొత్త రికార్డ్, ఏవియేషన్ ఇండస్ట్రీని నిలబెట్టిన క్రికెట్
సాధారణ రోజుల్లో రూ.4 వేలు రూ.6 వేల వరకు ఉండే ఫ్లైట్ టిక్కెట్, ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రూ.45 వేలకు వరకు వెళ్లింది.
![ICC World Cup Cricket 2023: విమాన ప్రయాణాల్లో సరికొత్త రికార్డ్, ఏవియేషన్ ఇండస్ట్రీని నిలబెట్టిన క్రికెట్ ICC World Cup Cricket 2023 Final Match Cricket gave boost to aviation industry and breaks record ICC World Cup Cricket 2023: విమాన ప్రయాణాల్లో సరికొత్త రికార్డ్, ఏవియేషన్ ఇండస్ట్రీని నిలబెట్టిన క్రికెట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/20/ad91c002c310cf41de34373989b052fa1700456012859545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ICC World Cup Cricket 2023 Final Match: దీపావళి పండుగ కూడా సాధించలేని రికార్డ్‌ను క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సాధించింది. వరల్డ్ కప్ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను (ఆదివారం, 19 నవంబర్ 2023) ప్రత్యక్షంగా చూడడానికి, మన దేశంలో ఒక్క రోజులో విమానాల్లో ప్రయాణించిన వ్యక్తుల సంఖ్య సరికొత్త శిఖరానికి చేరింది. మ్యాచ్‌కు ముందు రోజు (శనివారం, 18 నవంబర్ 2023), దేశవ్యాప్తంగా సుమారు 4.6 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు, ఇది ఇప్పటివరకు రికార్డ్ నంబర్. ఈ ఏడాది దీపావళి (Divali 2023) సందర్భంగా ప్రయాణికుల సంఖ్య (flight passengers number) పెరిగింది. కానీ, భారత్ ప్రపంచకప్ ఫైనల్ చేరడంతో అహ్మదాబాద్ చేరుకోవాలనే ఉత్సాహం ప్రజల్లో కనిపించింది, సరికొత్త రికార్డును సృష్టించింది.
అసాధారణంగా పెరిగిన విమాన టిక్కెట్ల రేటు
భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పుణ్యమాని, ఛార్జీలను అతి భారీగా పెంచిన విమానయాన సంస్థలు చాలా డబ్బు సంపాదించాయి. దేశంలోని వివిధ విమానాశ్రయాల నుంచి అహ్మదాబాద్ చేరడానికి సాధారణ రోజుల్లో రూ.4 వేలు రూ.6 వేల వరకు ఉండే ఫ్లైట్ టిక్కెట్, ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రూ.45 వేలకు వరకు వెళ్లింది.
ఈ పండుగ సీజన్‌లో, ఒక్క రోజులో దేశీయ విమానాల్లో ప్రయాణించిన వాళ్ల సంఖ్య (domestic flight passengers number) ఎప్పుడూ 4 లక్షలకు చేరుకోలేదు. దీనికి విమానయాన సంస్థలే కారణం. పెరుగుతున్న డిమాండ్‌కు ఆశపడి చాలా ఏవియేషన్ కంపెనీలు దీపావళికి ఒక నెల ముందు నుంచి విమాన ఛార్జీలను పెంచాయి. అంత ఎక్కువ డబ్బు పెట్టలేక పెద్ద సంఖ్యలో ప్రజలు రైల్లో ఏసీ క్లాస్ టిక్కెట్లకు మారారు. దీంతో, పండుగ సమయంలోనూ ఎయిర్ పాసెంజర్స్ సంఖ్య ఆశించినంతగా పెరగలేదు. కానీ, వరల్డ్ కప్ ఫైనల్ కోసం విమానాల వైపు మళ్లిన జనం, ఒక్కో విమాన టిక్కెట్ మీద రూ.20 వేల నుంచి రూ.45 వేల వరకు ఖర్చు చేశారు.
సింధియా, అదానీ ఆనందం
భారత విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, నవంబర్ 18న భారతీయ విమానయాన పరిశ్రమ చరిత్ర సృష్టించిందని సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ రోజున 4,56,748 మంది ప్రయాణికులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తాము తీసుకెళ్లామని వెల్లడించారు. శనివారం నాడు, ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి కూడా రికార్డ్ స్థాయిలో ప్రయాణించారు. శనివారం ఒక్కరోజులోనే 1.61 లక్షల మంది ప్రయాణికులు ముంబై విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇది తమకు చారిత్రాత్మకమైన అవకాశం అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఎక్స్‌లో తెలిపారు.
పండుగ సీజన్, వరల్డ్ కప్ క్రికెట్‌ను దృష్టిలో పెట్టుకుని... విమానయాన సంస్థలు సెప్టెంబర్ చివరి వారం నుంచే అడ్వాన్స్ బుకింగ్ ఛార్జీలను పెంచడం ప్రారంభించాయి. ఈ నిర్ణయం తొలిరోజుల్లో బెడిసికొట్టి రైల్వేలు లాభపడ్డాయి. కానీ, దీపావళి, ఛత్ పూజ, క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాక ప్రజలు ఎయిర్‌లైన్స్ పర్సు నింపారు.
ఈ రోజు (సోమవారం), అహ్మదాబాద్ నుంచి ముంబైకి విమాన టిక్కెట్లు రూ.18,000 నుంచి రూ.28,000 వరకు ఉన్నాయి. అహ్మదాబాద్ నుంచి దిల్లీకి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పలుకుతున్నాయి.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)