IBM Hiring: మనుషులకు బదులు AIకి ఉద్యోగాలు - 7,800 ఖాళీల భర్తీకి IBM ప్లాన్స్
ఐదేళ్ల వ్యవధిలో 30% ఉద్యోగాలు AI & ఆటోమేషన్ ద్వారా సులభంగా భర్తీ అవుతాయి
IBM Hiring: కృత్రిమ మేథ (Artificial Intelligence - AI) విస్త్రతంగా అభివృద్ధి చెందితే, మనుషుల స్థానాన్ని అవి భర్తీ చేస్తాయని, ఉద్యోగాలు ఊడతాయన్న అనుమానాలు ఇకపై అనుమానాలు కావు, పచ్చి నిజాలు. ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజ సంస్థ ఒకటి, తన కంపెనీలో కొత్త ఉద్యోగ నియామాకాలను నిలిపేస్తోంది, పాత ఉద్యోగుల స్థానాన్ని కృత్రిమ మేథతో భర్తీ చేయబోతోంది. ఆ కంపెనీ పేరు ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (International Business Machines Corporation - IBM). రాబోయే సంవత్సరాల్లో 7,800 ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో (AI to replace human jobs) భర్తీ చేయడానికి ప్లాన్ వేసింది.
వచ్చే ఐదేళ్లలో 30% ఉద్యోగాలు హుష్ కాకి
కంపెనీ బ్యాక్ ఆఫీస్ వర్క్‌లో రిక్రూట్‌మెంట్ తగ్గిందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరవింద్ కృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కొన్ని విభాగాల్లో ఇప్పటికే నియామకాలను నిలిపేశామన్నారు. "ఐదేళ్ల వ్యవధిలో 30% ఉద్యోగాలు AI & ఆటోమేషన్ ద్వారా సులభంగా భర్తీ అవుతాయి" అని కృష్ణ వెల్లడించారు. దీంతో, దాదాపు 7,800 మంది మనుషులు ఉద్యోగాలు కోల్పోతారని అంచనా. దాదాపు 26,000 మంది సిబ్బంది నాన్-కస్టమర్ ఫేసింగ్ విభాగాల్లో ఉన్నారని, మానవ వనరులు (HR) వంటి బ్యాక్ ఆఫీస్ ఉద్యోగాలు ప్రభావితం కావచ్చని కృష్ణ చెప్పారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా ప్రకటించిన అతి పెద్ద వర్క్‌ఫోర్స్ స్ట్రాటెజీల్లో IBM ప్రణాళిక ఒకటి. కస్టమర్ సేవలను స్వయంచాలకం (ఆటోమేషన్) చేయడం, టెక్ట్స్ రాయడం, కోడ్‌ను జెనరేట్ చేయడం వంటి ఎన్నో ఊహలకు AI టూల్స్ సామర్థ్యం తలుపులు తెరిచింది. అయితే.. ఉద్యోగాల భర్తీలో చిచ్చు పెట్టే AI సామర్థ్యంపై చాలా మంది ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం, IBMలో దాదాపు 2,60,000 మంది ఉద్యోగులు ఉన్నారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కస్టమర్-ఫేసింగ్ ఉద్యోగాల కోసం నియామకాన్ని కొనసాగిస్తోంది. ఏడాది క్రితంతో పోలిస్తే ఈరోజు టాలెంట్‌ను వెతుక్కోవడం చాలా తేలికని కృష్ణ చెప్పారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ కంపెనీ ఉద్యోగాల కోతలను ప్రకటించింది, తొలగింపులు పూర్తయిన తర్వాత ఈ సంఖ్య దాదాపు 5,000 మంది కార్మికులకు చేరవచ్చు. అయితే, మొదటి త్రైమాసికంలో సుమారు 7,000 మందిని కొత్తగా తీసుకువచ్చి IBM వర్క్‌ఫోర్స్‌కు జోడించామని కృష్ణ వివరించారు.
AI ఏ పనులు చేయగలదు?
ఉద్యోగ ధృవీకరణ లేఖలు ఇవ్వడం లేదా ఉద్యోగుల మధ్య బదిలీలు వంటి HR విభాగం చేసే పనులు ఇకపై పూర్తిగా ఆటోమేటెడ్ అవుతాయని IBM CEO చెప్పారు. వర్క్‌ఫోర్స్ కంపోజిషన్, ఉత్పాదకత మూల్యాంకనం వంటి కొన్ని పనుల కోసం, వచ్చే దశాబ్దంలో మనుషులను నియమించే అవసరం ఉండకపోచ్చని కూడా ఐబీఎం సీఈవో వెల్లడించారు.
ఆర్మోంక్, న్యూయార్క్ ఆధారిత IBM దాని ఇటీవలి త్రైమాసికంలో వ్యయ నిర్వహణ కారణంగా, ముందుగా ప్రకటించిన ఉద్యోగ కోతలతో సహా లాభాల అంచనాలలో అగ్రస్థానంలో నిలిచింది. కొత్త ఉత్పాదకత మరియు సమర్థత దశలు 2024 చివరి నాటికి సంవత్సరానికి $2 బిలియన్ల పొదుపును పెంచుతాయని అంచనా వేస్తున్నట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జేమ్స్ కవనాగ్ ఆదాయపు రోజున తెలిపారు.