HDFC Q3 Results: హెచ్‌డీఎఫ్‌సీ అదుర్స్! 13% పన్నేతర లాభం - నేడు షేర్లు ట్రేడయ్యాయో చూడండి!
HDFC Q3 Results: హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ అంచనాలను అందుకుంది. 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన ఫలితాలనే విడుదల చేసింది. స్టాండలోన్ ప్రాతిపదికన రూ.3,691 కోట్ల నికర లాభం నమోదు చేసింది.
HDFC Q3 Results:
హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ అంచనాలను అందుకుంది. 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన ఫలితాలనే విడుదల చేసింది. స్టాండలోన్ ప్రాతిపదికన రూ.3,691 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలోని రూ.2,260 కోట్లతో పోలిస్తే 13 శాతం పెరిగింది.
నిర్వాహక ఆదాయం 29 శాతం పెరిగి రూ.15,230 కోట్లుగా ఉంది. రంగాల వారీగా చూస్తే.. వార్షిక ప్రాతిపదికన వడ్డీ ఆదాయం 30 శాతం పెరిగి రూ.14,457 కోట్లుగా ఉంది. 2021 డిసెంబర్లో ఇది రూ.11,055 కోట్లు కావడం గమనార్హం.
డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ డివిడెండ్ ఆదాయం రెట్టింపైంది. రూ.482 కోట్లు ఆర్జించింది. ఈ క్వార్టర్లో నికర వడ్డీ ఆదాయం (NII) రూ.4,840 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయంలోని రూ.4,284 కోట్లతో పోలిస్తే 13 శాతం వృద్ధి నమోదు చేసింది.
2022-23 ఆర్థిక ఏడాదిలోని మొదటి తొమ్మిది నెలల్లో వ్యక్తిగత రుణాల ఆమోదం 21 శాతం, రుణాల విడుదల 23 శాతం పెరిగాయి. 'గృహ రుణాల డిమాండ్ మెరుగ్గా ఉంది. మధ్య ఆదాయ, అధిక విలువైన ఆస్తుల విభాగాల్లో వృద్ధి కనిపిస్తోంది' అని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.
కంపెనీ మొత్తం ఆస్తుల్లో వ్యక్తిగత రుణాలు 82 శాతంగా ఉన్నాయి. వ్యక్తిగత రుణాల పుస్తకం వృద్ధి 18 శాతంగా ఉంది. మొత్తం ఆస్తుల విలువలో రుణాల పుస్తకం విలువ 13 శాతంగా ఉంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు రూ.8,892 కోట్ల రుణాలు కేటాయించింది. చివరి 12 నెలల్లో విక్రయించిన రుణాల మొత్తం రూ.35,937 కోట్లుగా ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో వ్యక్తిగత రుణాల వసూళ్లు 99 శాతంగా ఉన్నాయి. ఆస్తుల నాణ్యతలో మెరుగుదల కనిపిస్తోందని కంపెనీ తెలిపింది. స్థూల నిరర్ధక రుణాలు వ్యక్తిగత విభాగంలో 0.86 శాతం, వ్యక్తిగత ఏతర విభాగంలో 3.89 శాతంగా ఉన్నాయి.
గురువారం హెచ్‌డీఎఫ్‌సీ షేరు రూ.21.85 నష్టపోయి రూ.1605 వద్ద ముగిసింది. ఉదయం రూ.1608 వద్ద మొదలై రూ.1588 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. రూ.1624 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.