GST New Slabs: ఏయే వస్తువులు ఇప్పుడు కొనవద్దు, సెప్టెంబర్ 22 వరకు వేచి ఉంటే బెటర్.. పూర్తి జాబితా
New GST Rates | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం రాత్రి జీఎస్టీ స్లాబ్స్ మార్చినట్లు తెలిపారు. చాలా వస్తువులు, ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించినట్లు ప్రకటించారు.

GST 2.0 New Rates: అమెరికా 50 శాతం టారిఫ్ కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. GST కౌన్సిల్ బుధవారం దేశ పన్ను విధానంలో కొన్ని పెద్ద మార్పులు చేసింది. దీని ప్రకారం, 12 శాతం, 28 శాతం GST స్లాబ్‌లను తొలగించి, 5 శాతం, 18 శాతం కలిగిన రెండు స్లాబ్‌లను ఉంచారు. ఆరోగ్యానికి హాని కలిగించే వాటితో పాటు కొన్ని లగ్జరీ వస్తువులపై 40 శాతం పన్ను విధిస్తామని ప్రకటించారు. కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వస్తాయి. ఇప్పటివరకూ 12 శాతం లేదా 28 శాతం GST పడే వస్తువులలో చాలా వరకు ఇప్పుడు తక్కువ పన్ను స్లాబ్ కిందకు వస్తాయి. దాంతో అవి చౌకగా లభిస్తాయి. ఈ క్రమంలో ఏ వస్తువులను ఇప్పుడు కొనడం లాభదాయకం, సెప్టెంబర్ 22 వరకు ఏ వస్తువులను కొనుగోలు చేయకుండా చూడాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ వస్తువులను కొనుగోలు చేయడానికి వేచి ఉండండి
ఎలక్ట్రానిక్ ఐటమ్స్
ఎయిర్ కండిషనర్లు, LED, LCD టీవీలు వంటి 32 అంగుళాల కంటే పెద్ద టెలివిజన్లు, మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషింగ్ మెషీన్‌లపై GSTని 28 శాతం నుంచి 18 శాతానికి కేంద్రం తగ్గించింది. కనుక వీటిని సెప్టెంబర్ 22 తరువాత చౌకగా కొనవచ్చు.
వ్యవసాయ సంబంధిత వస్తువులు
ఎరువులపై ఇప్పుడు ఉన్న జీఎస్టీ 12-18 శాతం బదులుగా 5 శాతం పన్ను పడుతుంది. ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలపై కూడా GSTని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ట్రాక్టర్ల కొనుగోలుపై ఇప్పుడు 12 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. బయో ఫర్టిలైజర్స్, సూక్ష్మ పోషకాలు, బిందు సేద్యం, స్ప్రింక్లర్లు, వ్యవసాయం, కోత నూర్పిడి కోసం ఉపయోగించే యంత్రాలపై GSTని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. దీనివల్ల ఈ వస్తువులను కొనేందుకు కొన్ని రోజులు వేచిచూస్తే ప్రయోజనం ఉంటుంది.
ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులు
థర్మామీటర్లు, ఆరోగ్య బీమా పాలసీ, జీవిత బీమా పాలసీల (Term Insurance) ప్రీమియంపై GSTని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. మెడికల్ ఆక్సిజన్, డయాగ్నస్టిక్ కిట్లు, రియేజెంట్లు, గ్లూకోమీటర్లు, టెస్ట్ స్ట్రిప్స్, కరెక్టివ్ కళ్లద్దాలపై 12 శాతం ఉన్న GSTని 5 శాతానికి మార్చారు.
ఎడ్యుకేషన్ సంబంధిత వస్తువులు
పెన్సిల్‌లు, షార్పనర్‌లు, మ్యాప్‌లు, చార్ట్‌లు, గ్లోబ్‌లు, క్రేయాన్‌లు, పాస్టెల్‌లు, పుస్తకాలు, నోట్‌బుక్‌లు, రబ్బరు వంటి ఎడ్యుకేషన్ సంబంధించిన వస్తువులపై జీఎస్టీ తొలగించారు. ఇంతకు ముందు వీటిపై 12 శాతం పన్ను విధించేవారు.
చౌకగా ఆటోమొబైల్ ఉత్పత్తులు
పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్ కార్లు, LPG, CNG కార్లు (1200 సీసీతో పాటు 400 mm కంటే ఎక్కువ సామర్థ్యం లేనివి) వాటిపై GSTని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తామని ప్రకటించారు. సెప్టెంబర్ 22 తరువాత నుంచి ఈ రేంజ్ కార్ల ధరలు దిగొస్తున్నాయి.
వీటి ధరలు కూడా తగ్గుతాయి
పునరుత్పాదక శక్తికి సంబంధించిన ఐటమ్స్, నిర్మాణ సామగ్రి, ఆట వస్తువులు, బొమ్మలు, తోలు ఉత్పత్తులు, చెక్క వస్తువులు, హస్తకళలకు సంబంధించిన వాటిపై జీఎస్టీ తగ్గించారు. 12 శాతం నుండి 5 శాతం GST స్లాబ్‌లోకి తీసుకొచ్చింది కేంద్రం.
ఈ వస్తువులు మరింత ఖరీదైనవి
మత్తు సంబంధితమైనవి, ఆరోగ్యానికి హానికారకమైనవి.. కొన్ని రకాల డ్రింక్స్ ధరలు భారీగా పెరగనున్నాయి. వీటిని ఏకంగా 40 శాతం జీఎస్టీ స్లాబ్ లోకి తీసుకొచ్చారు. సిగరెట్లు, గుట్కా, పొగాకు ఉత్పత్తులు, నమలడానికి ఉపయోగించే పొగాకు, జర్దాతో పాటు లగ్జరీ కార్లు, సూపర్ లగ్జరీ వస్తువులు సెప్టెంబర్ 22 నుంచి మరింత ఖరీదుగా మారుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్, చక్కెర కలిపిన పానీయాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్, వ్యక్తిగత ఉపయోగం కోసం విమానాలు (ఛార్టెడ్ ఫ్లైట్స్), కాసినోలు, ఆన్‌లైన్ గేమింగ్ వంటివి త్వరలో మరింత ఖర్చుతో కూడుకోనున్నాయి.






















