IDBI Bank Privatisation: అమ్మకానికి ఐడీబీఐ బ్యాంక్, బిడ్లకు ఆహ్వానం
ఈ లావాదేవీ పూర్తయితే, ఈ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వానికి 15 శాతం వాటా, 19 శాతం వాటా మిగులుతుంది.
IDBI Bank Privatisation: కొన్ని నెలలుగా కొనసాగుతున్న సీరియల్‌కు తాత్కాలికంగా తెర పడింది. ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank) ప్రైవేటీకరణ ప్రక్రియను ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ బ్యాంకులో 60.72 శాతం వాటాను విక్రయించడానికి పెట్టుబడిదారుల నుంచి శుక్రవారం బిడ్‌లను ఆహ్వానించింది.
ఈ బ్యాంకులో తమకు ఉన్న 94.72 శాతం వాటాలో 60.72 శాతం వాటాను విక్రయిస్తామని కేంద్ర ప్రభుత్వం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ప్రకటించాయి. ఈ వాటా కొనుగోలు చేయాలనుకునే వాళ్లు ఈ ఏడాది డిసెంబరు 16వ తేదీ లోపు బిడ్లు (Expression of Interest - EoI) దాఖలు చేయాలి.
నియంత్రణ బదిలీ
ప్రస్తుతం, ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీకి 49.24 శాతం (529.41 కోట్ల షేర్లు), కేంద్ర ప్రభుత్వానికి 45.48 శాతం (488.99 కోట్ల షేర్లు) వాటాలున్నాయి. ఇందులో ఎల్‌ఐసీ 30.24 శాతం, కేంద్ర ప్రభుత్వం 30.48 శాతం వాటాలను అమ్మకానికి పెట్టాయి. రెండూ కలిపి 60.72 శాతం స్టేక్‌ను విక్రయించబోతున్నాయి. ఈ లావాదేవీ పూర్తయితే, ఈ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వానికి 15 శాతం వాటా, 19 శాతం వాటా మిగులుతుంది. ఈ రెండింటి బలం 94.72 శాతం నుంచి 34 శాతానికి దిగి వస్తుంది. ఫలితంగా ఐడీబీఐ బ్యాంక్ మీద ఇవి రెండూ యాజమాన్య నియంత్రణ కోల్పోతాయి.
ప్రభుత్వ విభాగమైన దీపమ్ (Department of Investment and Public Asset Management) బిడ్లను ఆహ్వానించింది. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ మొత్తాన్ని ఈ విభాగమే చూసుకుంటుంది.
బిడ్స్ ఎవరు దాఖలు చేస్తారు?
ఒక పెద్ద బ్యాంకులో మెజారిటీ వాటాను సొంతం చేసుకోవడం అంత ఆషామాషీ కాదు. కనీసం రూ.22,500 కోట్ల నికర సంపద కలిగిన ఇన్వెస్టర్లు మాత్రమే బిడ్లు దాఖలు చేయాలి. గత అయిదు ఆర్థిక సంవత్సరాల్లో మూడేళ్లు నికర లాభాన్ని కళ్లజూసి ఉండాలి. కన్సార్షియంగా (కొన్ని సంస్థలు కలిసి ఒక బృందంగా) బిడ్ వేయాలంటే.. అందులో గరిష్టంగా నలుగురు సభ్యులు ఉండాలి. సక్సెస్‌ఫుల్ బిడ్డర్, కొనుగోలు తేదీ నుంచి ఐదేళ్ల వరకు కనీసం 40 శాతం మూలధనాన్ని తప్పనిసరిగా లాక్- ఇన్ చేయాల్సి ఉంటుంది. అంటే, 40 శాతం వాటాను ఐదేళ్ల వరకు అమ్మడానికి వీల్లేదు. ఆర్‌బీఐ నిర్వహించే "ఫిట్ అండ్ ప్రాపర్" ప్రక్రియను కూడా బిడ్డర్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ప్రైవేటీకరణ కోసం బిడ్లను ఆహ్వానించిన విషయం తెలియడంతో, శుక్రవారం నాటి వీక్ మార్కెట్‌లోనూ ఐడీబీఐ బ్యాంక్ షేర్లు కోలుకున్నాయి. గురువారం నాటి ముగింపుతో పోలిస్తే ఒక్కో షేరు ధర 0.71 శాతం పెరిగి రూ.42.70 వద్ద ముగిసింది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 60.72 శాతం వాటా విలువ రూ.27,800 కోట్లకుపైగా ఉంటుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.