Gold: రికార్డ్ స్థాయికి బంగారం, ₹60 వేలు దాటే ఛాన్స్ - ట్రేడింగ్ ప్లాన్ ఇదిగో!
బంగారం వచ్చే వారం $2,000 మార్కును అధిగమించి $2,030కి చేరుకునే అవకాశం ఉంది.
MCX Gold Futures: 10 గ్రాముల MCX గోల్డ్ ఫ్యూచర్స్ శుక్రవారం ఇంట్రాడేలో (రూ. 59,461) జీవితకాల గరిష్టాలను తాకింది, రూ. 59,420 వద్ద ముగిసింది. ఏప్రిల్ ఫ్యూచర్స్, గురువారం ముగింపు ధర నుంచి ఏకంగా రూ. 1,414 లేదా 2.44% పెరిగింది. మే నెల సిల్వర్ ఫ్యూచర్స్ కూడా 3% పైగా ర్యాలీ చేసి, కిలోకు రూ. 2,118 లాభంతో రూ. 68,649 వద్ద సెటిలైంది.
అమెరికా, యూరప్‌లో బ్యాంకింగ్ సంక్షోభాలు తగ్గుముఖం పట్టకపోవడంతో బులియన్‌లో బుల్లిష్ ట్రెండ్స్ వచ్చే వారం కూడా కొనసాగే అవకాశం ఉంది. MCXలో, ఎల్లో మెటల్ ఫ్యూచర్స్ (గోల్డ్) వచ్చే వారం రూ. 60,000 మార్క్‌ను అధిగమించవచ్చని కమొడిటీ & కరెన్సీ ఎక్స్‌పర్ట్ అనుజ్ గుప్తా చెబుతున్నారు. బంగారం, వెండి ఫ్యూచర్స్‌లో బయ్ స్ట్రాటెజీని సిఫార్సు చేశారు. IIFL సెక్యూరిటీస్‌లో కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ (VP) అనుజ్ గుప్తా.
గోల్డ్ ట్రేడింగ్ స్ట్రాటెజీ
MCX ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్‌ను రూ. 58,650 స్టాప్‌లాస్‌తో రూ. 59,200 వద్ద కొనుగోలు చేయమని, ప్రైస్ టార్గెట్‌ను రూ. 60,200 గా పెట్టుకోమని గుప్తా సూచించారు.
బంగారం వచ్చే వారం $2,000 మార్కును అధిగమించి $2,030కి చేరుకునే అవకాశం ఉందని గుప్తా అంచనా వేశారు. వెండి విషయానికొస్తే, $23 -$24 రేంజ్ కనిపిస్తోందన్నారు.
లాభపరంగా, అన్ని ఇతర అసెట్ క్లాస్‌లను MCX గోల్డ్ అధిగమించింది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు (YTD) రూ. 4,366 లేదా దాదాపు 8% లాభపడింది. ఒక్క మార్చి నెలలోనే రూ. 3,628 లేదా 6.51% రిటర్న్ ఇచ్చింది.
వెండి ఫ్యూచర్స్ కూడా ఈ నెలలో ఇప్పటి వరకు (MTD) 6% పెరిగాయి, ఈ ఏడాదిలో చూసిన నష్టాలను చాలా వరకు కవర్ చేశాయి. YTD ప్రాతిపదికన వెండి రూ. 912 తగ్గింది, అయితే MTD రూ. 3,878 పెరిగింది.
సిల్వర్ ట్రేడింగ్ స్ట్రాటెజీ
రూ. 65,500 స్టాప్ లాస్ & రూ. 70,000 ప్రైస్ టార్గెట్‌తో మే నెల సిల్వర్ ఫ్యూచర్స్‌ను రూ. 67,000 వద్ద కొనవచ్చని అనుజ్ గుప్తా సిఫార్సు చేశారు.
రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం... బ్యాంకింగ్ సంక్షోభాల కారణంగా, శుక్రవారం, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం 2% పైగా పెరిగింది. గత మూడు సంవత్సరాల్లో, బులియన్‌కు ఇదే అతి పెద్ద వారంవారీ పెరుగుదల.
ఈ వారం విలువైన లోహాల ధరల్లో అస్థిరత ఏర్పడే అవకాశం ఉందని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ కమోడిటీ రీసెర్చ్ ఎనలిస్ట్ నిర్పేంద్ర యాదవ్ వెల్లడించారు. యాదవ్ చెబుతున్న ప్రకారం... MCX గోల్డ్ ఫ్యూచర్స్, రెసిస్టెన్స్ లెవల్స్ రూ. 59,000ని ఇప్పటికే బ్రేక్ చేశాయి. వెండి రూ. 69,000 అడ్డంకి దగ్గర ట్రేడవుతోంది.
యూఎస్ ఫెడ్ హాకిష్ వైఖరితో పాటు, ప్రస్తుతం ప్రపంచ దేశాలను భయపెడుతున్న బ్యాంకింగ్ రంగం సంక్షోభం కూడా బంగారం ధర పెరుగుదలకు కారణంగా నిలిచింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.