Retail Loans: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? మరేం పర్లేదు, మీకూ లోన్ వస్తుందిలా!
మంచి స్కోర్ ఉన్న వాళ్లు లోన్ల కోసం వెళితే బ్యాంకులు రెడ్ కార్పెట్ పరుస్తాయి.
Retail Loans: క్రెడిట్ హిస్టరీ లేదా క్రెడిట్ స్కోర్ (Credit Score) ప్రాధాన్యత మీద ఇప్పుడు అందరికీ అవగాహన పెరిగింది. క్రెడిట్ స్కోర్ తగ్గితే బ్యాంకు సహా ఏ ఆర్థిక సంస్థలోనూ అప్పు పుట్టదన్న విషయం అవగతమైంది. మంచి స్కోర్ ఉన్న వాళ్లు లోన్ల కోసం వెళితే బ్యాంకులు రెడ్ కార్పెట్ పరుస్తాయి.
క్రెడిట్ స్కోర్ అంటే?
క్రెడిట్ స్కోర్‌ను మన ఆర్థిక క్రమశిక్షణకు ఆధార్ కార్డ్‌గా చెప్పుకోవచ్చు. బ్యాంకులు, NBFCలు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే వ్యక్తిగత రుణాలు, హౌస్ లోన్లు, బంగారం మీద తీసుకునే అప్పులు, క్రెడిట్ కార్డ్ ఔట్‌స్టాండింగ్, 'బయ్ నౌ పే లేటర్' వంటి వాటిని తిరిగి సరిగా చెల్లిస్తున్నామో లేదో చెప్పే ఒక నంబరే క్రెడిట్ స్కోర్. ఇది 300-900 మధ్య ఉంటుంది. తీసుకున్న రుణాల మీద చేసే చెల్లింపుల ఆధారంగా ఈ 300-900 మధ్య ఒక నంబర్‌ను క్రెడిట్ స్కోర్‌గా మీకు కేటాయిస్తారు.
సబ్‌ప్రైమ్ బారోవర్ (Subprime Borrower)
క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్న వాళ్లను క్రెడిట్ రిస్క్ ఉన్న వాళ్లు లేదా సబ్ ప్రైమ్ బారోవర్లుగా ఆర్థిక సంస్థలు వర్గీకరించాయి. లోన్లు లేదా EMIలు సకాలంలో చెల్లించని వాళ్లు, ఫైన్లు కట్టిన వాళ్లు, దివాలా చరిత్ర ఉన్న వాళ్లు, తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించే సామర్థ్యం & ఆసక్తి తక్కువ ఉన్న వాళ్లను సబ్ ప్రైమ్ బారోయర్లుగా చూస్తున్నాయి. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ప్రకారం క్రెడిట్ స్కోర్ 300- 680 మధ్య ఉన్న వాళ్లను ఈ కేటగిరీ కింద జమ చేశాయి. ఈ కేటగిరీలో ఉన్న వారికి రుణాల మంజూరు కాస్త కష్టమైన విషయమే.
మారిన పరిస్థితి
ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగు పడింది. క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్లకు కూడా కొన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు లోన్లు ఇస్తున్నాయి. సిబిల్ నివేదిక ప్రకారం, మొత్తం రిటైల్ లోన్లలో (పర్సనల్, కార్, హోమ్ లోన్ల వంటివి) 32 శాతం వాటా సబ్‌ప్రైమ్ బారోవర్లదే. 2019లో 28 శాతం నుంచి ఇది మెరుగు పడింది.
బ్యాంకులతో పోలిస్తే... నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు), న్యూ ఏజ్ డిజిటల్ యాప్‌లు క్రెడిట్ స్కోర్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. గతం గతః అంటున్నాయి. మీ మీద నమ్మకంతో లోన్ ఇస్తాం, బుద్దిగా తిరిగి చెల్లించడని చెబుతున్నాయి. కాబట్టి, క్రెడిట్ రిస్క్ ఉన్న వాళ్లు లేదా సబ్‌ప్రైమ్ బారోయర్లు లోన్ల కోసం వీటిని ఆశ్రయించవచ్చు. అయితే, ఇక్కడో విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీరు క్రెడిట్ రిస్క్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి, మీకు ఇచ్చే అప్పు మీద వసూలు చేసే వడ్డీ కూడా ఎక్కువగా ఉంటుంది. సబ్‌ప్రైమ్ విభాగంలో ఉన్న వాళ్లకు - మిగిలిన వాళ్లకు మధ్య క్రెడిట్ స్కోర్ వ్యత్యాసం కేవలం 100 నుంచి 150 పాయింట్లే ఉంటుంది. చెల్లించాల్సిన వడ్డీ రేటు మాత్రం 2 నుంచి 5 శాతం వరకు అధికంగా ఉంటుంది.
లోన్ యాప్‌లతో జాగ్రత్త
ఈ మధ్య కాలంలో లోన్ యాప్‌లు, ముఖ్యంగా చైనా యాప్‌లు చెలరేగి పోతున్నాయి. అప్పులు ఇస్తామంటూ వెంటబడుతున్నాయి. అప్పు తీసుకున్న వాళ్లు అసలు, వడ్డీ చెల్లించినా.. ఇంకా బాకీ ఉన్నారంటూ నానా రకాలు వేధిస్తున్నాయి. కొన్ని యాప్‌లైతే మరీ తెగించి, రుణగ్రహీత ఫోటోలను అశ్లీలంగా మార్చి, మరింత డబ్బు కోసం బెదిరిస్తున్నాయి. కాబట్టి, ఇలాంటి మోసపూరిత యాప్‌లతో జాగ్రత్తగా ఉండండి. డబ్బు మీకు ఎంత అత్యవసరమైనా; రెండు, మూడు సార్లు తనిఖీ చేసుకున్న తర్వాతే డిజిటల్ లోన్ యాప్‌ల నుంచి రుణాలు తీసుకోవాలి.