FPIs: పారిపోతున్న ఎఫ్‌పీఐలు మన దగ్గర్నుంచి పట్టుకెళ్లిన మొత్తం ₹2,313 కోట్లు
జనవరితో పోలిస్తే ఎఫ్‌పీఐల అమ్మకాల్లో వేగం తగ్గింది, ఆ నెలలో మొత్తం రూ. 28,852 కోట్లు వెనక్కి తీసుకున్నారు.
Foreign Portfolio Investors: కొన్ని నెలల క్రితం వరకు, గ్లోబల్ మార్కెట్లతో డీకప్లింగ్ అయి, ప్రపంచ అస్థిరతతో సంబంధం లేకుండా పెరిగిన ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు ఇప్పుడు మళ్లీ పాత రోజులకు తిరిగి వచ్చాయి. గ్లోబల్ మార్కెట్ల తాళానికి తగ్గట్లు తైతక్కలాడుతున్నాయి.
ఇప్పుడు, ప్రపంచ మార్కెట్లలో ఒడుదొడుకుల ప్రభావం భారత మార్కెట్లలోనూ కనిపిస్తోంది. 2022లో ఇన్వెస్టర్లను దారుణంగా ముంచేసిన మార్కెట్లు ఈ సంవత్సరం ప్రారంభం నుంచీ అదే పంథా కొనసాగిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు). దేశీయ స్టాక్ మార్కెట్లలోని వాళ్ల షేర్లను అమ్మేసి, టన్నుల కొద్దీ డబ్బులను వెనక్కు తీసుకుంటున్నారు.
విదేశీ పెట్టుబడిదార్లు ఎంత డబ్బు ఉపసంహరించుకున్నారు?
ఈ నెల (ఫిబ్రవరి 2023) ప్రారంభం నుంచి 24వ తేదీ వరకు, భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ. 2,313 కోట్లను (నెట్ సేల్స్) విదేశీ పెట్టుబడిదార్లు ఉపసంహరించుకున్నారు. అయితే, జనవరితో పోలిస్తే ఎఫ్‌పీఐల అమ్మకాల్లో వేగం తగ్గింది, ఆ నెలలో మొత్తం రూ. 28,852 కోట్లు వెనక్కి తీసుకున్నారు.
ఫిబ్రవరిలో అమ్మినవి - కొన్నవి
డేటా ప్రకారం... FPIల పోర్ట్‌ఫోలియోలో స్పష్టమైన మార్పు కనిపించింది. విదేశీ మదుపుదార్లు జనవరిలో విక్రయించిన ఫైనాన్షియల్ షేర్లను, ఫిబ్రవరి మొదటి అర్ధభాగంలో తిరిగి ఎక్కువగా కొన్నారు. అలాగే, ఫిబ్రవరి ప్రథమార్ధంలో క్యాపిటల్ గూడ్స్, ఐటీ, హెల్త్‌కేర్ స్టాక్స్‌లో పెట్టుబడులు కుమ్మరించారు. ఇదే కాలంలో చమురు & గ్యాస్, మెటల్స్, పవర్ షేర్లను విపరీతంగా విక్రయించారు.
ఫిబ్రవరి 1 - 24వ తేదీ మధ్య కాలంలో, బాండ్ మార్కెట్‌లో ఎఫ్‌పీఐలు రూ. 2,819 కోట్లు పెట్టుబడి పెట్టారు.
గతేడాది లెక్కలు
డిపాజిటరీ డేటా ప్రకారం, 2022 డిసెంబర్ నెలలో, ఎఫ్‌పీఐలు భారత స్టాక్స్‌లో రూ. 11,119 కోట్లు, నవంబర్‌లో రూ. 36,238 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. మొత్తం 2022లో, మన మార్కెట్ల నుంచి 16.5 బిలియన్ డాలర్లు లేదా దాదాపు రూ. 1.21 లక్షల కోట్ల నికరంగా ఓవర్‌సీస్ ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. దీంతో, 2022లో మన మార్కెట్ల పనితీరు పరమ చెత్తగా మారింది. ఒక ఏడాది కాలంలో విదేశీ మదుపుదార్లు వెనక్కు తీసుకున్న రికార్డ్ స్థాయి మొత్తాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. 2022 సంవత్సరానికి ముందు, FPI వరుసగా మూడు సంవత్సరాలు భారతీయ మార్కెట్లో నికర పెట్టుబడిదార్లుగా ఉన్నారు.
యుఎస్‌లో నిరుత్సాహపరిచిన ఎకనమిక్ డేటా కారణంగా ఎఫ్‌పీఐలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వడ్డీ రేట్ల పెంపును US సెంట్రల్ బ్యాంక్ కొనసాగించే అవకాశాలు కనిపిస్తుండడం, చైనా సహా కొన్ని స్టాక్ మార్కెట్ల చౌకగా మారడంతో మన మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు అటువైపు తరలిపోతున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.