Foreign Portfolio Investors: ప్రైమరీ మార్కెట్ అంటే పడిచస్తున్న FPIలు - రూ.4.4 లక్షల కోట్ల పెట్టుబడులు
దాదాపు మూడింట రెండు వంతుల డబ్బును ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల ద్వారానే దేశంలోకి తీసుకొచ్చారు.
Foreign Portfolio Investors: ఆసియాలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశ మార్కెట్ మీద విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) తెగ ప్రేమ కురిపిస్తున్నారు. ముఖ్యంగా, ఇండియన్ ప్రైమరీ మార్కెట్ (IPOs) అంటే పడి చస్తున్నారు.
ఆకర్షణీయమైన ప్రైమరీ మార్కెట్
FPIల దృష్టితో చూస్తే, భారత దశ ప్రైమరీ మార్కెట్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. గత పదేళ్ల కాలంలో, FPIలు ఇండియన్ ఈక్విటీల్లో 70 బిలియన్ డాలర్ల (రూ. 4.4 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టారు. ఇందులో, దాదాపు మూడింట రెండు వంతుల డబ్బును ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (Initial Public Offering - IPO) ద్వారానే దేశంలోకి తీసుకొచ్చారు. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ (Qualified Institutional Buyer - QIB) రూపంలో ఈ పెట్టుబడులు పెట్టారు.
NSDL డేటా ప్రకారం... 2022లో, ఎఫ్‌పీఐలు ప్రైమరీ రూట్‌లో 3 బిలియన్ డాలర్ల (రూ. 24,000 కోట్లు) పెట్టుబడి పెట్టారు. సెకండరీ మార్కెట్‌లో 19.5 బిలియన్ డాలర్ల (రూ. 1.46 లక్షల కోట్లు) విలువైన ఈక్విటీలను అమ్మేశారు.
సాధారణంగా, ప్రైమరీ మార్కెట్ మార్గం ఆకర్షణీయంగా ఉంటుంది. ఎందుకంటే, IPOకు వచ్చిన కంపెనీలు, IPO షేర్ ధరలో లిస్టెడ్ పీర్స్‌కు వాల్యుయేషన్ సౌకర్యాన్ని అందిస్తాయి. అంటే... IPO కోసం నిర్ణయించిన షేర్ ధరలో దాదాపు 10 శాతం 35 శాతం వరకు డిస్కౌంట్లకు షేర్లను ఆఫర్ చేస్తాయి. దీనివల్ల, ఆకర్షణీయ ధర వద్ద ముందస్తుగానే ఆయా కంపెనీల షేర్లను కొనుగోలు చేయడానికి సంస్థాగత పెట్టుబడిదార్లకు అవకాశం ఉంటుంది. ఇంకా, ప్రైమరీ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడం వల్ల, దాదాపు వ్యయ ప్రభావం లేకుండానే గణనీయమైన వాటాను దక్కించుకోవచ్చు. అందుకే, విదేశీ పెట్టుబడి సంస్థలు IPOల మీద తెగ ప్రేమ కురిపిస్తున్నాయి.
నెట్ బయ్యర్స్
గత ఐదేళ్ల కాలంలో... FPIలు ప్రాథమిక (ప్రైమరీ) మార్కెట్ మార్గంలో 30 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టారు. స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా 10 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మారు. ఫైనల్‌గా... నికరంగా 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో నికర కొనుగోలుదార్లుగా (Net Buyers) నిలిచారు.
2022లో, స్టాక్ మార్కెట్లలో లిస్టయిన 39 కంపెనీల్లో, 19 సంస్థలు మూడు అంకెలకు పైగా రాబడిని ఇచ్చాయి, వీటిలో FPIలు అతి భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ఉదాహరణకు... సింగపూర్ ప్రభుత్వం & సింగపూర్ మానిటరీ అథారిటీ అదానీ విల్మార్ యాంకర్ రౌండ్‌లో (IPO ప్రారంభ తేదీకి ఒకరోజు ముందు నిర్వహించే పెద్ద ఇన్వెస్టర్ల రౌండ్) పాల్గొన్నాయి. ఇవి రెండూ వరుసగా 39% & 8.6% స్టేక్ కొన్నాయి. లిస్టింగ్ తర్వాత అదానీ విల్మార్ (Adani Wilmar) స్టాక్ 160% లాభపడింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.