Business News: యుద్ధం దెబ్బకు టాప్-10 కంపెనీలకు రూ.3.3 లక్షల కోట్లు లాస్!
Equity markets: గత వారంలో భారత టాప్-10 కంపెనీ మార్కెట్ విలువ రూ.3,33,307 కోట్లు తగ్గిపోయింది. 2022, ఫిబ్రవరి చివరకు ఈక్విటీ మార్కెట్ల విలువ రూ.2,49,97,053 కోట్లుగా ఉంది.
Equity Market Capitalization: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia Ukrain War) దెబ్బకు గత వారం స్టాక్ మార్కెట్లు (Stock Market) విలవిల్లాడాయి. సూచీలు ఒక్కరోజులోనే ఐదు శాతం వరకు పతనమయ్యాయి. దాంతో గత వారంలో భారత టాప్-10 కంపెనీ మార్కెట్ విలువ రూ.3,33,307 కోట్లు తగ్గిపోయింది. 2022, ఫిబ్రవరి చివరకు ఈక్విటీ మార్కెట్ల విలువ రూ.2,49,97,053 కోట్లుగా ఉంది. 2021, జులైలో బీఎస్‌ఈ నమోదిత కంపెనీల అతి తక్కువ మార్కెట్ విలువ రూ.2,35,49,748 కావడం గమనార్హం. ఇక జనవరిలో ఈక్విటీ మార్కెట్ల విలువ రూ.2,64,41,207 కోట్లుగా ఉండేది.
గత వారం రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) మార్కెట్ విలువ రూ.94,828 కోట్లు పతనమై రూ.15,45,044కు తగ్గిపోయింది. ఇక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఏకంగా 1,01,760 కోట్లు నష్టపోయింది. మార్కెట్ విలువ రూ.13,01,955 కోట్లకు చేరుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (HDFC Bank) మార్కెట్ విలువ రూ.31,597 కోట్లు నష్టపోయి రూ.8,06,931 కోట్లకు తగ్గింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) గతవారం రూ.5,501 కోట్ల మేర నష్టపోవడంతో మార్కెట్ విలువ రూ.7,12,443 కోట్లుగా ఉంది.
ఇక ఐసీఐసీఐ బ్యాంకు (ICICI Bank) రూ.13,240 కోట్లు నష్టపోవడంతో మార్కెట్ విలువ రూ.5,07,414 కోట్లకు తగ్గిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) మార్కెట్ విలువ రూ.6,929 కోట్లు పతనమై రూ.4,35,233 కోట్లకు తగ్గిపోయింది. హిందుస్థాన్ యునీలివర్ (HUL) తన విలువలో రూ.33,234 కోట్లు నష్టపోయింది. మార్కెట్ విలువ రూ.5,09,990గా ఉంది. ఎస్‌బీఐ (SBI) మార్కెట్ విలువ రూ.29,094 కోట్ల మేర తగ్గి రూ.4,30,924 కోట్లకు చేరుకుంది. బజాజ్ ఫైనాన్స్ (Bajaj Finance) రూ.3,802 కోట్లు తగ్గిపోయి రూ.4,20,653 కోట్లకు పరిమితమైంది. భారతీ ఎయిర్‌టెల్ (Bharati Airtel) రూ.13,318 కోట్లు నష్టపోయి మార్కెట్ విలువ రూ.3,78,098 కోట్లకు తగ్గిపోయింది.
మరోవైపు క్రిప్టో మార్కెట్లోనూ జోష్ లేదు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 0.58 శాతం పెరిగి రూ.30.92 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.55.91 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 0.51 శాతం పెరిగి రూ.2,18,665 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.25.08 లక్షల కోట్లుగా ఉంది.
బైనాన్స్ కాయిన్ 0.31 శాతం పెరిగి రూ.29,789, టెథెర్ 0.03 శాతం పెరిగి రూ.79.39, కర్డానో 0.33 శాతం తగ్గి రూ.70.45, యూఎస్‌డీ కాయిన్ 0.07 శాతం పెరిగి 79.35, రిపుల్ 2.20 శాతం తగ్గి రూ.59.29 వద్ద కొనసాగుతున్నాయి. క్వాంట్‌స్టాంప్, వేవ్స్, క్వార్క్‌చైన్, ఫైల్‌కాయిన్, డియా, స్వైప్, ఈవోస్ 3 నుంచి 20 శాతం వరకు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అయిలెఫ్, గోలెమ్, క్రోమియా, ఎల్‌రాండ్, మేకర్, సాండ్‌బాక్స్, గాలా 2 నుంచి 6 శాతం వరకు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత టాప్-10 కంపెనీల్లో ముందు వరుసలో ఉంది. ఆ తర్వాత టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యునీలివర్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి.