EPFO: ఈపీఎఫ్‌వో చట్ట సవరణతో అధిక పింఛన్ రూల్స్‌లో అత్యంత కీలక మార్పు
2022 నవంబర్ 4వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశానికి అనుగుణంగా కేంద్ర కార్మిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
EPFO: అధిక పింఛను పథకం అనేక అవాంతరాలతో గత ఆరు నెలలుగా వార్తల్లో నలుగుతూనే ఉంది. తాజాగా, EPFO చట్టాన్ని సవరిస్తూ కేంద్ర కార్మిక శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. కంపెనీ యాజమాన్యాలు ఇప్పటి వరకు చెల్లించిన 12 శాతం వాటా నుంచే మరో 1.16 శాతం మొత్తాన్ని ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌లోకి (EPS) మళ్లించేలా నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రూల్ 2014 సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వస్తుంది. 2022 నవంబర్ 4వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశానికి అనుగుణంగా కేంద్ర కార్మిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
కార్మిక శాఖ కొత్త నిబంధన ఫలితంగా చందాదార్లపై అదనపు భారం తగ్గుతుంది. అయితే... వేతనం రూ. 15,000 మించిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. రూ. 15,000, అంతకంటే తక్కువ వేతనం ఉన్నవాళ్లకు పాత నిబంధనే అమల్లో ఉంటుంది.
అదనపు 1.16 శాతం చందాపై రగడ
అధిక పింఛను కోసం యాజమాన్యాలతో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులంతా, రూ. 15 వేలకు పైబడిన జీతంపై తమ చందా నుంచి అదనంగా 1.16 శాతం చొప్పున చెల్లించాలని EPFO గతంలో నిర్దేశించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన చందాదార్లు, సుప్రీంకోర్టుకు ఎక్కారు. ఉద్యోగుల వేతనం నుంచి అదనంగా తీసుకోవడం రూల్స్‌కు విరుద్ధమని తీర్పు చెప్పింది. EPFO నిర్ణయాన్ని ఆరు నెలలపాటు నిలిపివేస్తూ ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో వెనక్కు తగ్గిన కార్మిక శాఖ, 1.16 శాతం మొత్తాన్ని ఉద్యోగి వాటా నుంచి కాకుండా, కంపెనీ యాజమాన్యం జమ చేసే మొత్తం నుంచి తీసుకోవడానికి నిర్ణయించింది, ఆ ప్రకారమే తాజా ప్రకటన జారీ చేసింది.
మారిన వాటాలు ఎలా ఉంటాయి?
పాత నిబంధన ప్రకారం... తన జీతం నుంచి EPFO చందా రూపంలో ఉద్యోగి 12 శాతాన్ని చెల్లిస్తాడు. కంపెనీ యాజమాన్యం కూడా అంతే 12 శాతం మొత్తాన్ని తన వంతుగా జమ చేస్తుంది. కంపెనీ చెల్లించే ఈ 12 శాతంలో... 8.33 శాతం EPSలోకి వెళ్తుంది, మిగిలిన 3.67 శాతం EPFలోకి వెళ్తుంది. వేతనం రూ. 15,000 మించిన వారి కోసం EPFO తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం... యాజమాన్యం చెల్లించే 12 శాతం నుంచే అదనంగా 1.16 శాతం మొత్తాన్ని EPSలోకి మళ్లిస్తారు. అంటే, కంపెనీ యాజమాన్యం చెల్లించే 12 శాతం వాటాలో EPSలోకి (8.33 శాతం బదులు) 9.49 శాతం వెళ్తుంది, EPFలోకి (3.67 శాతం బదులు) 2.51 శాతం వెళ్తుంది.
కొత్త నిబంధన ప్రకారం.. EPFలో జమ అయ్యే మొత్తంలో కంపెనీ వాటా తగ్గుతున్నా, ఉద్యోగిపై అదనపు భారం కూడా ఉండదు. అంటే, అధిక పెన్షన్‌ను ఎంచుకున్నప్పటికీ టేక్ హోమ్ జీతం లేదా ఇన్ హ్యాండ్ జీతంపై ఎటువంటి ప్రభావం ఉండదు.
కొత్త నిబంధనతో కొన్ని నష్టాలు
మారిన నిబంధన ప్రకారం కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అధిక పెన్షన్ ఆప్షన్ తీసుకున్నవాళ్లకు కంపెనీ ద్వారా PFలో డిపాజిట్ అయ్యే మొత్తం తక్కువగా ఉంటుంది, ఇది PF ఫండ్‌పై ప్రభావం చూపుతుంది. ఉద్యోగులు PFపై చక్రవడ్డీ ప్రయోజనం పొందుతారు. ఇప్పుడు PFలో కొంత భాగం EPSకు వెళుతుంది కాబట్టి, చక్రవడ్డీ ప్రయోజనం కూడా తగ్గుతుంది. అదేవిధంగా, పదవీ విరమణ చేసినప్పుడు లేదా ఉద్యోగాన్ని విడిచిపెట్టినప్పుడు PF రూపంలో పొందే మొత్తం ఫండ్ కూడా తగ్గుతుంది.
అధిక పింఛను కింద ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదార్లు సమర్పించిన దరఖాస్తులు ఇప్పటికే కంపెనీ యాజమాన్యాల లాగిన్‌లోకి వచ్చాయి. 1.16 శాతం మొత్తం జమపై EPFO క్లారిటీ ఇవ్వడంతో, ఈ దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం అవుతుంది. దరఖాస్తుల ప్రక్రియలో ఏదైనా పొరపాటు చేస్తే, దానిని సరి చేసుకునేందుకు ‘డిలీట్ అప్లికేషన్’ ఆప్షన్‌ను అందుబాటులోకి వచ్చింది. వివరాలు తప్పుగా ఉన్న దరఖాస్తును డిలీట్ చేసి, సరైన వివరాలతో కొత్తగా ఆప్షన్ ఇచ్చేందుకు అవకాశం వచ్చింది.
అధిక పెన్షన్‌ను ఎంచుకోవడానికి గడువు ఈ నెల 3వ తేదీతో ముగియాల్సి ఉండగా, EPFO దీని పెంచింది. చందాదార్లు ఇప్పుడు 26 జూన్ 2023 వరకు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.