Elon Musk Teases X.com: ట్విటర్‌కు పోటీగా X.com తెస్తానన్న ఎలన్ మస్క్! ఓపెన్ చేస్తే ఏమొస్తుందో తెలుసా?
Elon Musk: ట్విటర్ కొనుగోలు ప్రక్రియ రద్దైతే సొంతంగా ఒక సోషల్ మీడియా వేదికను సృష్టిస్తానని టెస్లా అధినేత ఎలన్ మస్క్ అంటున్నారు. తన సోషల్ మీడియా వెబ్‌సైట్ యూఆర్‌ఎల్ X.com అని సూచించారు.
Elon Musk: ట్విటర్ కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగకపోతే తనే సొంతంగా ఒక సోషల్ మీడియా వేదికను సృష్టిస్తానని టెస్లా అధినేత ఎలన్ మస్క్ అంటున్నారు. తన సోషల్ మీడియా వెబ్‌సైట్ యూఆర్‌ఎల్ X.com అని పరోక్షంగా సూచించారు. చాన్నాళ్ల తర్వాత ఆయన ట్విటర్లో ఫాలోవర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
'ఒకవేళ ట్విటర్ ఒప్పందం రద్దైతే సొంత సోషల్ మీడియా వేదికను రూపొందించాలని ఎప్పుడైనా ఆలోచించారా?' అని ఓ ట్విటర్ యూజర్ ట్వీట్ చేయగా 'X.com' అని మస్క్ బదులిచ్చారు. ఈ డొమైన్‌ను 1999లో ఆయన స్థాపించారు. ఆ తర్వాత పేపాల్‌లో విలీనం చేశారు. 2017లో మళ్లీ వారి నుంచి దక్కించుకున్నారు. కొన్నాళ్లకు సైట్‌ను పునరుద్ధరించానని చెప్పారు. ఇప్పుడు ఓపెన్ చేస్తే కేవలం 'X' అని మాత్రమే కనిపిస్తోంది. అయితే దీని గురించి మస్క్ ఎక్కువగా వివరించలేదు.
ఎలన్ మస్క్ టెస్లా షేర్లను తిరిగి కొనుగోలు చేయడం గురించి ఎక్కువగా సంభాషించారు. 'ఒకవేళ ట్విటర్ డీల్ కుదరకపోతే, ఈక్విటీ భాగస్వాములు ముందుకు రాకపోతే టెస్లా స్టాక్ విక్రయాన్ని ఆపేస్తాను' అని మస్క్ చెప్పారు. ట్విటర్ కొనుగోలు ఆగిపోతే మళ్లీ టెస్లా స్టాక్ కొంటానని పేర్కొన్నారు.
— Elon Musk (@elonmusk) August 10, 2022
Elon Musk Terminates Twitter Deal: ట్విటర్ కొనుగోలు ఒప్పందంలో చెప్పిన దానికంటే భిన్నంగా వాస్తవ పరిస్థితులు ఉన్నాయంటూ కొంతకాలంగా ఎలన్ మస్క్ ఆరోపణలు గుప్పించారు. నకిలీ అకౌంట్లు 5 శాతం కంటే తక్కువ ఉన్నాయని ట్విట్టర్ చెబుతున్నా... అది తప్పని వాదించారు. అసలైన లెక్కలు సమర్పించేంత వరకు ట్విట్టర్ డీల్ నిలిపిస్తున్నానని చెప్పారు.
ట్విట్టర్ ఛైర్మన్ ఏమన్నారంటే..
ఎలన్ మస్క్‌తో ట్విట్టర్ డీల్ రద్దయిందని ట్విట్టర్ ఛైర్మన్ బ్రెట్ టేలర్ గతంలో ట్వీట్ చేశారు. దాన్ని ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ రీట్వీట్ చేశారు. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న కుబేరుడు ఎలన్ మస్క్ పై అగ్రిమెంట్ ప్రకారం లీగల్ యాక్షన్ ఉంటుందని టేలర్ తెలిపారు. ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఎలన్ మస్క్ కొంతకాలం కిందట అంగీకరించారు. ఎడిట్ ఆప్షన్ అంటూ ట్విట్టర్‌లో పెద్ద దుమారమే రేపారు. కానీ అగ్రిమెంట్ ప్రకారం ట్విట్టర్ ను ఎలన్ మస్క్ కొనుగోలు చేయని పక్షంలో 1 బిలియన్ డాలర్ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.
ట్విట్టర్ కొనుగోలుకు సంబంధించి ఎలన్ మస్క్‌కు ఇచ్చిన గడువు ముగిసిందని ఆ కంపెనీ తెలిపింది. షరతులకు లోబడి మస్క్ కొనుగోలును పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పుడు ఈ కొనుగోలు జరగాలంటే ట్విట్టర్ స్టాక్ హోల్డర్ల ఆమోదం మళ్లీ తీసుకోవాలి. హెచ్ఎస్ చట్టం నిబంధనల మేరకు భారీ ట్రాన్సాక్షన్స్ పైన ఫెడరల్ ట్రేడ్ కమిషన్, యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ యాంట్రీట్రస్ట్ డివిజన్లు రివ్యూ చేయాలి. రివ్యూ అనంతరం ట్విట్టర్ కొనుగోలు ఉంటుంది.
ఇప్పుడు చెప్పినట్లుగా 44 బిలియన్ డాలర్లు కట్టి కొనకపోతే కోర్టుకెళ్లి మరీ కొనిపిస్తామని ట్విట్టర్ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఒప్పందంలో ఎవరు వెనక్కి తగ్గినా బిలియన్ డాలర్లు పరిహారం ఇవ్వాలన్న నిబంధన ఉంది. అంటే మన రూపాయిల్లో దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల కోట్లు. మూడున్నర లక్షల కోట్లు పెట్టి కొని ట్విట్టర్‌ను నెత్తి మీద పెట్టుకోవడం కన్నా ఏడున్నర వేల కోట్లతో ఈ గండం నుంచి బయటపడితే బెటర్ అని మస్క్ అనుకుంటే ఆ మొత్తం కట్టేసి బయటపడే అవకాశం ఉంది. లేకపోతే మొత్తం కొనుగోలుకు సిద్ధపడాలి. మరి మస్క్ ఏం చేస్తారో !