Elon Musk Visits Twitter HQ: సింక్ చేత బట్టి ట్విట్టర్ ఆఫీస్‌లో తిరిగిన ఎలాన్ మస్క్ - దీని అర్ధమేంటో ఊహించగలరా?
వివాదాన్ని కోర్టు బయటే సెటిల్ చేసుకోవచ్చన్న న్యాయస్థానం సూచన మేరకు వేగంగా పావులు కదుపుతున్నారు. శుక్రవారం కల్లా ట్విట్టర్ కొనుగోలును పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Elon Musk Visits Twitter HQ: అపర కుబేరుడు, టెస్లా (Tesla), స్పేస్‌ఎక్స్ (SpaceX), న్యూరాలింక్ (Neuralink), ది బోరింగ్ కంపెనీ (The Boring Company) ఇత్యాది మల్టీ నేషనల్ కంపెనీల అధిపతి అయిన ఎలాన్ మస్క్ (Elon Musk) ఎట్టకేలకు ట్విట్టర్ వివాదానికి తెర దించబోతున్నారు. ట్విట్టర్-మస్క్ ఒక అవగాహనకు వచ్చి, ఈ ఏడాది అక్టోబరు 28లోగా (శుక్రవారం) ఈ వివాదాన్ని కోర్టు బయటే సెటిల్ చేసుకోవచ్చన్న న్యాయస్థానం సూచన మేరకు వేగంగా పావులు కదుపుతున్నారు. శుక్రవారం కల్లా ట్విట్టర్ కొనుగోలును పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బ్యాంకర్లకు ఎలాన్ మస్క్ హామీ కూడా ఇచ్చినట్లు అంతర్జాతీయ వార్తా పత్రికలు కోడై కూస్తున్నాయి.
ట్విటర్ కోనుగోలు కోసం ఏడు బ్యాంకుల కన్సార్జియం నుంచి ఎలాన్ మస్క్ 13 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంటున్నారు. మోర్గాన్ స్టాన్లీ ఈ కన్సార్టియానికి నేతృత్వం వహిస్తోంది. మస్క్‌కు కావలిసిన డబ్బును 7 బ్యాంకుల బృందం కొన్ని వారాల క్రితమే సిద్ధం చేశాయి. మస్క్ ఖాతాల్లోకి నగదును బదిలీ చేసేయడమే ఇక మిగిలింది. రుణ పత్రాల మీద మస్క్ సంతకం పెట్టిన మరుక్షణమే బటన్ నొక్కి బదిలీ చేస్తాయి.
శుక్రవారం కల్లా ట్విట్టర్ కొనుగోలును పూర్తి చేస్తానన్న మస్క్, దీనికి ఒక రోజు ముందు శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. మామూలుగా వెళ్తే మస్క్ ఎందుకవుతాడు?. ఒక సింక్‌ను చేత బట్టుకుని మరీ ఆఫీసులో అడుగు పెట్టారాయన. పైగా... సింక్‌ను మోస్తూ శాన్ ఫ్రాన్సిస్కో లాబీలో తిరుగుతున్న వీడియోను పోస్ట్ చేశారు. "Entering Twitter HQ – let that sink in!" అన్న క్యాప్షన్‌తో ఆ వీడియోను ట్వీట్ చేశారు.
Entering Twitter HQ – let that sink in! pic.twitter.com/D68z4K2wq7
— Elon Musk (@elonmusk) October 26, 2022
తనను తాను "చీఫ్ ట్విట్" (Chief Twit) అని పేర్కొంటూ తన ట్విట్టర్ ప్రొఫైల్‌ను మస్క్ మార్చారు. అంతేకాదు, తన లొకేషన్‌ను ట్విట్టర్ ప్రధాన కార్యాలయంగా ప్రొఫైల్‌లో పేర్కొన్నారు.
పౌర పాత్రికేయాన్ని ట్విట్టర్ శక్తివంతం చేయడమే ట్విట్టర్‌లో ఉన్న ఒక అందమైన విషయమని, ప్రజలు పక్షపాతం లేకుండా వార్తలను వ్యాప్తి చేయగలరంటూ మరొక ట్వీట్ సంధించారు.
A beautiful thing about Twitter is how it empowers citizen journalism – people are able to disseminate news without an establishment bias
— Elon Musk (@elonmusk) October 26, 2022
ప్రస్తుతం ట్విటర్ షేర్ ధర కూడా మస్క్ కొనుగోలు చేయాలనుకున్న ధర అయిన 54.20 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది. ఈ విషయంలోనూ ఇబ్బంది లేదు కాబట్టి మస్క్ మళ్లీ మెలిక పెట్టరనే బిజినెస్ కమ్యూనిటీ భావిస్తోంది.