దూసుకెళ్తున్న ఆర్థిక ప్రగతి- ప్రత్యక్ష పన్ను వసూళ్లులో 23 శాతం వృద్ధి
సెప్టెంబరు 17, 2022 నాటికి 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.7,00,669 కోట్లుగా ఉన్నాయని ఆర్థిక ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో రూ. 5,68,147 కోట్లు వసూలు అయ్యాయి.
కరోనా తర్వాత అర్థిక ప్రగతి వృద్ధి వేగంగా సాగుతోంది. పన్నుల వసూళ్లు అనుకున్న దాని కంటే స్పీడ్‌గా పుంజుకున్నట్టు ఆర్థిక శాఖ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఇప్పటి వరకు స్పీడ్‌గా పెరుగుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 23 శాతం పెరిగి రూ.7 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
ప్రత్యక్ష పన్నుల సేకరణ గణాంకాలు పరిశీలిస్తే..."ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణకు స్పష్టమైన దిశానిర్దేశం ఉండటంతోపాటు ప్రభుత్వ స్థిరమైన విధానాల ఫలితంగా, ప్రక్రియలను సరళీకృతం చేయడం, క్రమబద్ధీకరించడం, సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా పన్ను లీకేజీని అరికట్టడం జరిగింది" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
సెప్టెంబరు 17, 2022 నాటికి 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.7,00,669 కోట్లుగా ఉన్నాయని ఆర్థిక ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో రూ. 5,68,147 కోట్లు వసూలు అయ్యాయి. అంటే ఆర్థికసంవత్సరం 2021-22తో పోలిస్తే నికర వసూళ్లు 23 శాతం పెరుగుదలను సూచిస్తుంది." అని ఆర్థిక శాఖ తెలిపింది.
రూ. 3,68,484 కోట్ల కార్పొరేషన్ పన్ను, రూ. 3,30,490 కోట్ల సెక్యూరిటీల లావాదేవీల పన్ను (STT), వ్యక్తిగత ఆదాయ పన్నుతో కలిపి రూ. 7,00,669 కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లను సాధించినట్టు ఆర్థిక శాఖ ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల స్థూల వసూళ్లు రూ. 8,36,225 కోట్లుగా ఉంది, ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం 2021-22 సంబంధిత కాలంలో సాధించిన రూ. 6,42,287 కోట్లతో పోలిస్తే 30 వృద్ధిని నమోదు చేసింది.
దేశంలోని రూ.8,36,225 కోట్ల స్థూల వసూళ్లలో రూ.4,36,020 కోట్ల కార్పొరేషన్ పన్ను, రూ. 3,98,440 కోట్ల సెక్యూరిటీల లావాదేవీల పన్ను, వ్యక్తిగత ఆదాయపు పన్ను ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. మిగతా విభాగల వారీగా కలెక్షన్స్ చూస్తే రూ. 2,95,308 కోట్ల అడ్వాన్స్ టాక్స్, మూలధనంపై పన్ను మినహాయింపుతో 4,34,740 కోట్లు, రూ.77,164 కోట్లు సెల్ఫ్ అసిస్‌మెంట్ పన్ను, సాధారణ మదింపు పన్ను రూ. 20,080 కోట్లు, ఇతర విభాగల ద్వారా రూ. 8,933 కోట్ల పన్ను వసూలు అయింది.
2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి, రెండో త్రైమాసికానికి క్యుములేటివ్ ముందస్తు పన్ను వసూళ్లు సెప్టెంబరు 17, 2022 నాటికి రూ. 2,95,308 కోట్లుగా ఉన్నాయి. ఇది గతేడాది నమోదైన రూ. 2,52,077 కోట్ల కంటే ఎక్కువ. అంటే 17 శాతం వృద్ధిని చూపుతోంది. రూ. 2,95,308 కోట్ల అడ్వాన్స్డ్ ట్యాక్స్ వసూళ్లలో కార్పొరేషన్ పన్ను రూ. 2,29,132 కోట్లు ఉంటే వ్యక్తిగత ఆదాయ పన్ను రూ. 66,176 కోట్లు ఉన్నాయి" అని ప్రకటన పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌ల ప్రాసెసింగ్ గణనీయంగా పెరిగిందని, సరిగ్గా ధృవీకరించిన ITRలలో దాదాపు 93 శాతం సెప్టెంబర్ 17, 2022 వరకు ప్రాసెస్ చేసినట్టు ఆర్థిక శాఖ ప్రకటించింది.
ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన రీఫండ్‌ల సంఖ్య దాదాపు 468 శాతం పెరుగుదల ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 17, 2022 వరకు రూ. 1,35,556 కోట్ల రీఫండ్ చేసింది ప్రభుత్వం. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 2021-22లో సంబంధిత కాలంలో జారీ చేసిన రూ. 74,140 కోట్ల రీఫండ్ కంటే 83 శాతం ఎక్కువ వృద్ధిని చూపుతోంది.