Delhivery Shares: బిజినెస్‌లో అంత సీన్ లేదని చెప్పింది, షేర్ ప్రైస్ రెండ్రోజుల్లోనే 35% ఆవిరి
ప్రస్తుతం IPO ఇష్యూ ధర రూ. 487 కంటే 22 శాతం దిగువన షేర్లు ట్రేడవుతున్నాయి.
Delhivery Shares: లాజిస్టిక్స్ & సప్లై చైన్ కంపెనీ డెలివెరీ షేర్లు గత రెండు ట్రేడింగ్ సెషన్లుగా భారీ పతనంలో ఉన్నాయి. ఈ రెండు రోజుల్లో (గురువారం, శుక్రవారం) 35 శాతం పడిపోయాయి. ఇవాళ (శుక్రవారం) ఒక్కరోజే 20 శాతం నష్టపోయి రూ. 377.05 స్థాయికి దిగిపోయాయి. ఇది ఈ స్క్రిప్ కొత్త 52 వారాల కనిష్ట స్థాయి.
మధ్యాహ్నం 2:10 గంటలకు, ఈ స్క్రిప్ దాని గత రోజు క్లోజింగ్ ప్రైస్ రూ. 471తో పోలిస్తే 19.63 శాతం తగ్గి రూ. 378.80 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం IPO ఇష్యూ ధర రూ. 487 కంటే 22 శాతం దిగువన షేర్లు ట్రేడవుతున్నాయి.
కడుపు చించుకుంటే కాళ్ల మీద పడింది
2023 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలం ఆశాజనకంగా లేదని ఈ కంపెనీ బుధవారం తెలిపింది. షిప్‌మెంట్ వాల్యూమ్స్ పెద్దగా పెరక్కపోవచ్చని BSE ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ ఫైలింగ్ వివరాలు మార్కెట్‌కు వెల్లడైన క్షణం నుంచి షేర్ల పతనం షురూ అయింది.
కంపెనీకి చెందిన సప్లై చైన్ సర్వీసెస్ (SCS), ట్రక్‌లోడ్ (TL) వ్యాపారాల వాల్యూమ్స్ కూడా Q1FY23 కంటే Q2FY23లో క్షీణించాయి. సీజన్స్‌తో ముడిపడిన కంపెనీ కస్టమర్ల వ్యాపారాలు Q2లో తగ్గాయి. ఆ ప్రభావం డెలివెరీ వ్యాపారం మీదా పడింది. అయితే, Q2FY22తో పోలిస్తే ఈ రెండు వ్యాపారాలు (SCS & TL) గణనీయమైన రెండంకెల వృద్ధిని సాధించినట్లు కంపెనీ తెలిపింది.
మార్కెట్ సెంటిమెంట్‌ను గమనిస్తూ ముందుకు వెళ్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుత వృద్ధి రేటును కొనసాగించడానికి FY22లో, FY23 ప్రారంభంలో తగినన్ని పెట్టుబడులు పెట్టామని, FY24 ప్రారంభంలో వాటి ఫలితాలను ఆశిస్తున్నట్లు BSE ఫైలింగ్‌లో పేర్కొంది.
బయ్ ఆర్ సెల్?
ఈ ఏడాదిలో స్టాక్ పనితీరు ఏమీ బాగాలేదు. ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటివరకు (YTD) ఇది 30 శాతం నష్టపోయింది. బుధవారం వరకు ఉన్న కొద్దిపాటి లాభాలు కూడా ఈ రెండు రోజుల పతనంలో అవిరయ్యాయి. గత ఆరు నెలల కాలంలో చూసినా, గత ఏడాది కాల ప్రాతిపదికన లెక్కేసినా 30 శాతం పైగా నష్టాలే కనిపిస్తాయి.
ఈ స్టాక్‌ను కవర్ చేస్తున్న 14 మంది ఎక్స్‌పర్ట్‌ల్లో.. నలుగురు 'స్ట్రాంగ్ సెల్', 'సెల్' రేటింగ్స్ ఇచ్చారు. ఏడుగురు 'స్ట్రాంగ్ బయ్', 'బయ్' రేటింగ్స్ ఇచ్చారు. మిగిలిన ముగ్గురు 'హోల్డ్' రేటింగ్స్‌తో ఉన్నారు.
ట్రెండ్‌లైన్ (Trendlyne) డేటా ప్రకారం, ఈ స్టాక్‌కు ఎక్స్‌పర్ట్‌లు ఇచ్చిన గరిష్ట లక్ష్యం రూ.775. అంచనాల సగటు ధర లక్ష్యం రూ.623. ప్రస్తుత ధర నుంచి ఇది దాదాపు 34% పెరుగుదలను ఈ యావరేజ్ ప్రైస్ టార్గెట్ సూచిస్తోంది. వ్యాపారంలో సీన్ తగ్గిందని కంపెనీయే స్వయంగా చెప్పాక, ఇంతేసి టార్గెట్లను ఈ షేర్ చేరుతుందా?, ఆలోచించండి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.