RBI: ఆర్‌బీఐ ప్రెస్‌ల నుంచి ₹500 నోట్లు మాయం!? సెంట్రల్ బ్యాంక్ క్లారిఫికేషన్
కొత్త డిజైన్‌తో ఉన్న రూ. 500 నోట్లు మాయమయ్యాయని, వాటి విలువ రూ. 88,032.5 కోట్లు అని నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
RBI Clarification on 500 Rupees Notes: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి 88 వేల కోట్ల రూపాయల విలువైన 500 నోట్లు మాయమయ్యాయన్న వార్తలు దేశవ్యాప్తంగా షికార్లు చేస్తున్నాయి. ఇది నిజమా, అబద్ధమా అన్న విషయంపై జనంలో క్యూరియాసిటీ పెరిగింది. ఓ నలుగురు మనుషులు ఒకచోట చేరితే దీని గురించే మాట్లాడుకోవడం కనిపిస్తోంది.
సెంట్రల్ బ్యాంక్ క్లారిఫికేషన్
ఈ వార్తలపై భారతదేశ సెంట్రల్ బ్యాంక్ ఓ క్లారిటీ ఇచ్చింది. రూ. 88,032.5 కోట్ల విలువైన 500 నోట్లు తమ సిస్టమ్ నుంచి తప్పిపోయినట్లు వార్తలు అబద్ధమంటూ నిన్న (శనివారం, 17 జూన్ 2023) ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది. RTI (Right to Information) నుంచి అందిన సమాచారాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఇది జరిగిందని వెల్లడించింది. దేశంలోని మూడు ప్రింటింగ్ ప్రెస్‌ల్లోని 500 రూపాయల నోట్ల గురించి ఆర్‌టీఐ కింద ఇచ్చిన సమాచారాన్ని తప్పుగా అన్వయించారంటూ తన ప్రకటనలో తెలిపింది.
రూ. 500 నోట్లు మాయమైనట్లు ఎలా తెలిసింది?
మనోరంజన్ రాయ్ అనే వ్యక్తి సమాచార హక్కు కింద కొన్ని ప్రశ్నలు అడిగారని, దానికి వచ్చిన సమాధానాల్లో, కొత్త డిజైన్‌తో ఉన్న రూ. 500 నోట్లు మాయమయ్యాయని, వాటి విలువ రూ. 88,032.5 కోట్లు అని నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. మనోరంజన్ రాయ్‌కి అందిన సమాచారం ప్రకారం, దేశంలోని మూడు ప్రింటింగ్ ప్రెస్‌లు కలిసి రూ. 8810.65 కోట్ల (ఇది విలువ కాదు, నంబర్) 500 రూపాయల నోట్లను కొత్త డిజైన్‌తో ముద్రించగా, రిజర్వ్ బ్యాంక్‌కు కేవలం 726 కోట్ల నోట్లు మాత్రమే అందాయి. మొత్తంగా, 1760.65 నోట్లు మాయమయ్యాయి. వాటి విలువ రూ. 88,032.5 కోట్లు అని కొన్ని మీడియా ఛానెళ్లు రిపోర్ట్ చేశాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పత్రిక ప్రకటనతో పాటు ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కూడా దీనిపై క్లారిటీ ఇచ్చింది. రూ. 500 నోట్లు మాయమయ్యాయన్న వార్తలు కరెక్ట్ కాదంటూ ట్వీట్ చేసింది. ప్రింటింగ్ ప్రెస్‌ల్లో ముద్రించిన 500 రూపాయల నోట్లు పూర్తిగా భద్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఆ బ్యాంకు నోట్ల ముద్రణ, నిల్వ, పంపిణీని RBI పూర్తి ప్రోటోకాల్‌తో పర్యవేక్షిస్తుందని, దీని కోసం ఒక బలమైన వ్యవస్థలు అమల్లో ఉన్నాయని ట్వీట్‌లో పేర్కొంది.
Clarification on Banknote pic.twitter.com/PsATVk1hxw
— ReserveBankOfIndia (@RBI) June 17, 2023
ఈ తరహా సమాచారం కోసం, RBI అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మమని, వదంతులు నమ్మొద్దని బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ యోగేశ్వర్ దయాల్ పేరిట RBI ప్రెస్ నోట్ రిలీజ్ అయింది.
మరో ఆసక్తికర కథనం: రూ.30 వేలకు మించి డిపాజిట్ చేస్తే అకౌంట్ ఫ్రీజ్ చేస్తారా?