Gold Hall mark : మీ దగ్గర హాల్ మార్క్ లేని పాత బంగారం ఉందా ? అయితే ఇది మీ కోసమే
పాత బంగారం ఉన్న మహిళలకు ఇది గుడ్ న్యూస్. తమ బంగారం స్వచ్చతకు సర్టిఫికెట్ తీసుకునే అవకాశం బీఐఎస్ కల్పిస్తోంది.
బంగారం అంటే ఆస్తి. అది తరతరాలుగా తర్వాతి తరాలకు బదిలీ అవుతూనే ఉంటుంది. ఇలాంటి బంగారంలో ( Gold ) ఎక్కువగా హాల్ మార్క్ లేనివే ఉంటాయి. ఎక్కడకు వెళ్లినా ఆ బంగారం స్వచ్చతపై అనుమానాలు సహజంగానే వస్తాయి. అందుకే ఈ ఇబ్బందిని తొలగించడానికి భారతీయ ప్రమాణాల మండలి ( BIS ) కొత్త సౌకర్యాన్ని అందబాటులోకి తెచ్చింది. హాల్ మార్క్ లేని బంగారం స్వచ్ఛతను ధృవీకరించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయిందింది.
బీఐఎస్ ధ్రువీకృత కేంద్రాల్లో హాల్ మార్క్ ( Hallmark ) లేని ఆభరణాలు స్వచ్ఛతను పరీక్షించి సర్టిఫికెట్ ఇస్తారు. దీని కోసం కొంత మొత్తం చార్జి వసూలు చేస్తారు. అయితే అది రెండు వందల లోపులే ఉంటుంది. వినియోగదారులు తమవద్దనున్న హాల్‌మార్క్‌లేని ఆభరణాల స్వచ్ఛతను తెలుసుకునే ఈ సదుపాయాన్ని కల్పించారు. వినియోగదారులు తాము కొనుగోలు చేసిన ఆభరణాలకు సంబంధించి హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్‌ను బీఐఎస్ కేర్ యాప్ నుంచి పరిశీలించుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు.
కస్టమర్ల ప్రయోజనాలు కాపాడేందుకు హాల్ మార్క్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ( Central Governament ) నిర్ణయం తీసుకుంది. దీన్ని అమలుచేయడం ద్వారా కస్టమర్లు స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే లోగో. బిఐఎస్ నిర్వచనం ప్రకారం ‘హాల్ మార్కింగ్’ అంటే బంగారు అభరణాలలో ఎంత మోతాదు బంగారు ఉందో కచ్చితంగా నిర్ధారించి అధికారికంగా ధృవీకరించడం. బంగారు మీద ఉండే హాల్ మార్క్ గుర్తు ప్రభుత్వం అధికారికంగా బంగారు ప్యూరిటీ గురించి ఇచ్చిన సర్టిఫికేట్ అని అర్థం చేసుకోవాలి.
బంగారు మీద హాల్ మార్కింగ్ ఉండటం వల్ల కొనుగోలుదారుడు మోసపోకుండా రక్షణ ఉంటుంది. ఇండియాలో ( India ) బంగారు వెండి వినియోగం చాలా ఎక్కువ. ఈ వ్యాపారం కొన్నివేల కోట్ల రుపాయల విలువయింది. అందువల్ల అక్రమాలు జరిగేందుకు అవకాశం ఉంది. దొంగబంగారం, దొంగ నగలు, దొంగ వ్యాపారులు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు. అందువల్ల కొంటున్న బంగారు నమ్మకమయిందని, నాణ్యమయిందని వినియోగదారులకు హామీ ఇవ్వడమే హాల్ మార్కింగ్ పని. 2021 జూన్ 1 వ తేదీనుంచి దేశంలో ప్రతిబంగారు వ్యాపారస్ధుడు తప్పని సరిగా తమ నగలను హాల్ మార్కింగ్ చేయించి తీరాలి. అంతకు ముందు ఉన్న ఆభరణాలకు మాత్రం ఇప్పుడు స్వచ్చత పరీక్షలు చేయించుకోవచ్చు.