Commercial LPG Cylinder: కమర్షియల్ గ్యాస్ బండ రేటు తగ్గే సూచనలు, మరో 10 రోజుల్లో సాధారణ స్థాయికి!
మరో 10 రోజుల్లో రేట్లు సాధారణ స్థాయికి చేరుకుంటాయని తెలంగాణ LPG డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ చెబుతోంది.
Commercial LPG Cylinder: 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ (Commercial LPG) సిలిండర్ ధరలు మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మరో 10 రోజుల్లో రేట్లు సాధారణ స్థాయికి చేరుకుంటాయని తెలంగాణ LPG డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ చెబుతోంది.
తెలంగాణ LPG డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ విలేకరుల సమావేశం నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారులు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు వంటి వివిధ వ్యాపార సంస్థలకు ప్రతి నెలా 8 లక్షల వాణిజ్య సిలిండర్లను అమ్ముతున్నట్లు అసోయేషన్ వెల్లడించింది. బకాయిలు ఉన్న సంస్థలు వెంటనే డబ్బులు చెల్లించమని కోరింది.
వాణిజ్య సిలిండర్ల ధరల్లో మార్పులు
అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా... మన దేశంలో ప్రతి నెలా గృహ అవసరాల, వాణిజ్య LPG సిలిండర్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మారుస్తుంటాయి. ఈ నెల (నవంబర్ 2022) 1వ తేదీ నుంచి కూడా కొత్త ధరలను అమల్లోకి తెచ్చాయి. వాస్తవానికి, ఈ నెలలో 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గాయి. అక్టోబర్ 31వ తేదీ వరకు రూ. 1859 గా ఉన్న 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు నవంబర్ 1వ తేదీ నుంచి రూ. 115.50 తగ్గింది. రూ. 1744 కు గ్యాస్ బండ అందుబాటులోకి వచ్చింది. వాణిజ్య గ్యాస్ ధర తగ్గడం వరుసగా ఇది ఆరో నెల. అక్టోబర్ 1న కూడా, వాణిజ్య గ్యాస్ సిలిండర్ రేటు రూ. 25.5 వరకు గ్యాస్ కంపెనీలు తగ్గించాయి.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ రేట్లు ఇంకా తగ్గుతాయని తెలంగాణ LPG డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ వివరించింది. ఎందుకంటే.. కేంద్రం ఆదేశాల మేరకు PSU ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) వాణిజ్య LPG మీద ఇచ్చే రాయితీలను ఉపసంహరించుకున్నాయి. ఈ ఉపసంహరణ ఈ నెల 8 నుంచి అమలులోకి వచ్చింది. రాయితీ రద్దు కావడంతో, వాణిజ్య గ్యాస్ బండ రేటు మళ్లీ పెరుగుతుంది. దీంతో, వాణిజ్య గ్యాస్ సిలిండర్లను వినియోగించే కస్టమర్లలో ఆందోళన నెలకొంది.
పంపిణీదారులకు లేదా వినియోగదారులకు ముందస్తుగా ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రాయితీలను రద్దు చేశాయి. దీంతో, వివిధ రాష్ట్రాల LPG డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నాయి. ఇదే బాటలో తెలంగాణ LPG డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ కూడా ఆయా కంపెనీలతో మాట్లాడుతోంది. వాణిజ్యాన్ని పునర్వ్యవస్థీకరించడానికి, ధరలను సర్దుబాటు చేయడానికి కొంత సమయాన్ని అసోసియేషన్ ప్రతినిధులు అడుగుతున్నారు. మరో 10 రోజుల్లో రేట్లు సాధారణ స్థాయికి చేరుకుంటాయని ఆశిస్తోంది.
సామాన్యులకు మొండిచెయ్యి
ఆరు నెలలుగా వాణిజ్య LPG సిలిండర్ ధరలు తగ్గిస్తూ వచ్చిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సామాన్యులకు మాత్రం మొండి చెయ్యి చూపుతూనే ఉన్నాయి. 14.2 కిలోల గృహ అవసర వంట గ్యాస్ (Domestic LPG) సిలిండర్ రేటును పైసా కూడా తగ్గించట్లేదు. ఈ ఏడాది జులై నుంచి డొమెస్టిక్ సిలిండర్ల రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.