Cipla stock: ఎలుగుల పంజాలో సిప్లా షేర్లు విలవిల - 7 నెలల కనిష్టానికి పతనం
ఔషధాల తయారీ నాణ్యతను పరిశీలించడానికి వచ్చిన వచ్చిన US డ్రగ్ రెగ్యులేటర్ బృందం, ఈ ఫెసిలిటీకి 8 పరిశీలనలను జారీ చేయడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బ తీసింది.
Cipla stock: ఔషధ తయారీ సంస్థ సిప్లా షేర్ ధర ఇవాళ (సోమవారం, 20 ఫిబ్రవరి, 2023) కూడా భారీగా పతనమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఈ స్క్రిప్ 7 శాతం పడిపోయి, రూ. 955.25 వద్ద ఇంట్రా డే కనిష్ట స్థాయిని తాకింది. ఇది, ఈ స్టాక్‌కు 7 నెలల కనిష్ట స్థాయి కూడా.
సిప్లా కంపెనీకి మధ్యప్రదేశ్‌లోని పితంపూర్‌లో ఉన్న ఉత్పత్తి కేంద్రంలో, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US FDA) ఇటీవల తనిఖీలు చేసింది. ఆ తనిఖీల తర్వాత జారీ చేసిన పరిశీలనల (observations) కారణంగా సిప్లా షేర్లు ఇవాళ ఒక్కసారిగా కుప్పకూలాయి.
దెబ్బతిన్న ఇన్వెస్టర్ల సెంటిమెంట్
పితంపూర్ యూనిట్ సిప్లా ప్రధాన ఉత్పత్తి యూనిట్లలో ఒకటి. ఈ యూనిట్‌లో తయారవుతున్న కొన్ని ప్రధాన జనరిక్ మెడిసిన్స్‌ను అమెరికాలో మార్కెట్ చేయడానికి, US FDA కు ఈ కంపెనీ దరఖాస్తులు దాఖలు చేసింది. ఆ ఔషధాల తయారీ నాణ్యతను పరిశీలించడానికి వచ్చిన వచ్చిన US డ్రగ్ రెగ్యులేటర్ బృందం, ఈ ఫెసిలిటీకి 8 పరిశీలనలను జారీ చేయడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బ తీసింది.
మార్క్యూ క్యాపిటల్ (Macquarie Capital) లెక్కల ప్రకారం... మొత్తం FY23లో, సిప్లా నిర్వహణ లాభంలో పితంపూర్ యూనిట్ 15%, ఏకీకృత రాబడిలో 5% అందిస్తుందని అంచనా.
పితంపూర్ యూనిట్‌లో కొన్ని కీలక ఉత్పత్తులను సిప్లా తయారు చేస్తుంది. నోటి ద్వారా తీసుకునే ఉత్పత్తులే (oral products) కాకుండా.. ప్రోవెంటిల్, బ్రోవానా, పుల్మికోర్ట్ జనరిక్స్ వెర్షన్లను కూడా ఇక్కడ ఉత్పత్తి చేస్తుంది. ఇవి ఊపిరితిత్తుల సమస్యల కోసం ఉపయోగించే ఔషధాలు.
వీటితో పాటు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సలో ఉపయోగించే కీలకమైన అడ్వైర్ (Advair) డ్రగ్‌ను కూడా మధ్యప్రదేశ్ యూనిట్ నుంచి ఉత్పత్తి చేస్తోంది, US FDAకు పెట్టుకున్న ఔషధ దరఖాస్తుల్లో ఇది కూడా ఒకటి.
JP మోర్గాన్ అంచనా ప్రకారం... Advair డ్రగ్ జెనరిక్ FY24 జూన్ త్రైమాసికంలో లాంచ్ అవుతుంది, EPS లో దీని వాటా 5-6% వరకు ఉంటుంది.
యూఎస్ ఎఫ్‌డీఏ జారీ చేసిన అబ్జర్వేషన్లను మార్కెట్ ఎనలిస్టులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. కాబట్టి, సిప్లా స్టాక్ మీద ఇప్పటికే ఇచ్చిన రేటింగ్స్ లేదా ఆదాయాల అంచనాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయలేదు.
సిప్లా టార్గెట్ ధరలు
JP మోర్గాన్, Macquarie ఈ స్టాక్‌కు వరుసగా రూ. 1,210 & రూ. 1,235 టార్గెట్ ప్రైస్‌లు ఇచ్చాయి, "ఓవర్ వెయిట్" రేటింగ్ కలిగి ఉన్నాయి.
యూఎస్ ఎఫ్‌డీఏ ఇచ్చిన అబ్జర్వేషన్లు చిన్నవి అయితే, పితంపూర్ యూనిట్ నుంచి అమ్మకాలు దెబ్బతినే అవకాశం లేదు. ఒకవేళ, యూఎస్ హెల్త్ రెగ్యులేటర్ ఇచ్చిన అబ్జర్వేషన్లు పెద్దవి అయితే, వాటిని సరిచేసుకోవడానికి ఈ యూనిట్‌కు ఎక్కువ కాలం పడుతుంది. ఫలితంగా, ఈ యూనిట్ నుంచి ప్రొడక్ట్ లాంచ్‌లు ఆలస్యం అవుతాయి. అది ఈ కంపెనీ ఆదాయం మీద, ఫైనల్‌గా స్టాక్ ప్రైస్ మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.