Mobile Recharge: అరిచి గీపెట్టినా మొబైల్ రీఛార్జ్ రేట్లు రూపాయి కూడా తగ్గవు - ఒక్క ప్రకటనతో తేల్చేశారు
Mobile Tariff Hike: మన దేశంలోని 3 ప్రైవేట్ మొబైల్ కంపెనీలు ఈ నెల నుంచి రీఛార్జ్ ప్లాన్ రేట్లను 25 శాతం వరకు పెంచాయి. ఈ రేట్లను తగ్గించే చివరి అవకాశం కూడా ఇప్పుడు మూసుకుపోయింది.
Mobile Tariff Hike In India: మూడు ప్రధాన టెలికాం కంపెనీలు - రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా - తమ మొబైల్ టారిఫ్‌లను పెంచిన అంశం రాజకీయంగా రగడ సృష్టించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తీవ్ర విమర్శలకు దిగడంతో, కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై అధికారిక వివరణను జారీ చేసింది. ప్రపంచంలోని ప్రధాన దేశాలతో పోలిస్తే భారతదేశంలో మొబైల్ సేవలు ఇప్పటికీ చౌకగా ఉన్నాయని స్పష్టం చేసింది.
ప్రభుత్వ జోక్యం ఉండదు, మార్కెట్‌ను బట్టి నిర్ణయం
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన టెలికమ్యూనికేషన్స్ (DoT) విభాగం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం దేశీయ విపణిలో 1 ప్రభుత్వ సంస్థ, 3 ప్రైవేట్ టెలికాం కంపెనీలు పని చేస్తున్నాయని DoT ఆ ప్రకటనలో తెలిపింది. మొబైల్ సేవల మార్కెట్ డిమాండ్ - సప్లై సూత్రానికి అనుగుణంగా పని చేస్తుందని వెల్లడించింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) నిర్దేశించిన ఫ్రేమ్‌వర్క్ ప్రకారం టెలికాం కంపెనీలు రేట్లను నిర్ణయిస్తాయని. స్వేచ్ఛా మార్కెట్ నిర్ణయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది.
ఆ ప్రకటన ప్రకారం, టెలికాం కంపెనీలు నిర్ణయించే రేట్లలో పెరుగుదలను TRAI పర్యవేక్షిస్తుంది, ఆ మార్పులు సూచించిన పరిమితుల్లోనే ఉండేలా చూస్తుంది. గత రెండేళ్లుగా, మన దేశంలో, మొబైల్ టారిఫ్‌ల్లో ఎటువంటి మార్పు లేదని, ఆ కాలంలో, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు 5G సేవలను ప్రారంభించడం కోసం భారీగా పెట్టుబడులు పెట్టాయని తెలిపింది. 5G సేవల ఫలితంగా దేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 100 Mbps స్థాయికి పెరిగిందని, ఇంటర్నెట్ వేగం పరంగా భారతదేశ ర్యాంకింగ్ 2022 అక్టోబర్‌లోని 111 నుంచి ఇప్పుడు 15కు మెరుగుపడిందని పేర్కొంది.
ప్రపంచ దేశాల్లో అమల్లో ఉన్న రేట్లు
DoT ప్రకటనలో ఉన్న సమాచారం ప్రకారం... భారతదేశంలో మొబైల్ సేవల రేట్లు ఇప్పటికీ ప్రపంచంలోని చాలా దేశాల కంటే తక్కువగా ఉన్నాయి. డేటా ప్రకారం, చైనాలో వినియోగదార్లు కనీస మొబైల్ సేవల కోసం $8.84 ఖర్చు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో $4.77, భూటాన్‌లో $4.62, బంగ్లాదేశ్‌లో $3.24, నేపాల్‌లో $2.75, పాకిస్థాన్‌లో $1.39 ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అమలవుతున్న రేట్లను పరిశీలిస్తే... అమెరికాలో $49, ఆస్ట్రేలియాలో $20.1, దక్షిణాఫ్రికాలో $15.8, బ్రిటన్‌లో $12.5, రష్యాలో $6.55, బ్రెజిల్‌లో $6.06, ఇండోనేషియాలో $3.29 మరియు ఈజిప్టులో $2.55గా ఉన్నాయి. భారతదేశంలో ఈ రేటు $1.89గా ఉంది. దీనిలోనే యూజర్లు అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు 18 GB డేటా ప్రయోజనాన్ని పొందుతున్నారు.
ఈ నెల ప్రారంభంలో రేట్లు పెంచిన టెలికాం కంపెనీలు
ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న మూడు ప్రధాన టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఈ నెల నుంచి రీఛార్జ్ ప్లాన్‌ల రేట్లు పెంచాయి. మొబైల్ టారిఫ్‌లను 11 శాతం నుంచి 25 శాతం వరకు ఖరీదుగా మార్చాయి. టారిఫ్ పెంపు వల్ల మొబైల్ వినియోగదార్లపై ఏటా వేల కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా. మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజల నడివిరుస్తోందంటూ ప్రతిపక్షాలు దమ్మెత్తిపోస్తున్నాయి.
మరో ఆసక్తికర కథనం: భారీగా పెరిగిన నగల రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి