Central Bank of India Shares: 15% పెరిగిన సెంట్రల్ బ్యాంక్ షేర్లు, PCA పంజరం నుంచి బయటపడ్డాయ్ మరి!
PCA పారామీటర్లను ఈ బ్యాంక్ ఉల్లంఘించలేదు కాబట్టి ఫ్రేమ్‌వర్క్ నుంచి తప్పిస్తున్నట్లు RBI ప్రకటించింది.
Central Bank of India Shares: ఇవాళ్టి (బుధవారం) రోలర్ కోస్టర్ ట్రేడ్‌లోనూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) షేర్లు BSEలో 15 శాతం పెరిగి రూ.23.50కి చేరుకున్నాయి.
ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ను ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (PCA) నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తప్పించడంతో, ఒక్క బ్యాంక్‌కే కాక, షేరు ధరకు కూడా రెక్కలు వచ్చాయి. భారీ వాల్యూమ్స్ మద్దతుతో ఈ స్టాక్ రివ్వున ఎగిరింది.
BSE. NSEలో కలిపి దాదాపు 35 మిలియన్ల ఈక్విటీ షేర్లు చేతులు మారాయి, ట్రేడింగ్ వాల్యూమ్‌లు మూడు రెట్లు పెరిగాయి.
మధ్యాహ్నం 2.35 గంటల సమయానికి 7 శాతం లాభంతో రూ.21.80 దగ్గర షేర్లు కదులుతున్నాయి. దీని 52 వారాల గరిష్ట స్థాయి రూ.25.15. గతేడాది సెప్టెంబర్ 30న ఈ రికార్డ్ నమోదైంది. మళ్లీ ఆ స్థాయికి ఈ స్క్రిప్ ఎదుగుతోంది.
2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటి గణాంకాల ప్రకారం, PCA పారామీటర్లను ఈ బ్యాంక్ ఉల్లంఘించలేదు కాబట్టి ఫ్రేమ్‌వర్క్ నుంచి తప్పిస్తున్నట్లు RBI ప్రకటించింది.
నాలుగేళ్ల క్రితం, 2017 జూన్‌లో సెంట్రల్ బ్యాంక్‌ను PCA కిందకు RBI తీసుకువచ్చింది. భారీగా పెరిగిన నికర నిరర్ధక ఆస్తులు (నెట్ NPAలు), ప్రతికూల 'ఆస్తులపై రాబడి' (నెగెటివ్ RoA) కారణంగా RBI ఈ నిర్ణయం తీసుకుంది. అప్పట్నుంచి బ్యాంక్ నిర్వహణ RBI కనుసన్నల్లోనే జరిగింది. అప్పులు ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా, పెద్ద స్థాయి నిర్ణయాలు తీసుకోవాలన్నా PCA ఫ్రేమ్‌వర్క్ ప్రకారమే వెళ్లాల్సివచ్చింది, బ్యాంక్ చేతులు కట్టేసినట్లయింది. ఆ చర్యల వల్ల, ఈ నాలుగేళ్లలో బ్యాంక్ ఆర్థిక గణాంకాలు మెరుగయ్యాయి, ఆస్తుల నాణ్యత పెరిగింది.
గత నెల రోజుల్లో ఈ కౌంటర్ 19 శాతం లాభపడగా, గత ఆరు నెలల కాలంలో 15 శాతం పెరిగింది. గత ఏడాది కాలంలో చూస్తే మాత్రం కేవలం 2 శాతం వృద్ధే కనిపిస్తుంది. సెంట్రల్ బ్యాంక్‌ను PCA ఫ్రేమ్ వర్క్ నుంచి RBI తప్పిస్తుందని కొన్ని నెలలుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అప్పట్నుంచి ఈ స్టాక్ పాజిటివ్‌గా రియాక్ట్ అవుతోంది.
దీర్ఘకాలిక ఒత్తిడి తర్వాత, సెంట్రల్ బ్యాంక్ సహా PSU బ్యాంకుల ఆస్తుల నాణ్యత క్రమంగా మెరుగుపడుతోందని బ్రోకరేజ్ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ (ICICI Securities) చెబుతోంది. తక్కువ ఫ్రెష్ స్లిప్పేజ్‌లు, రిజల్యూషన్, రైట్ ఆఫ్‌లు, రీక్యాపిటలైజేషన్, నిరర్ధక ఆస్తులను ARCలకు విక్రయించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని PSU బ్యాంకుల మీద పాజిటివ్‌గా ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.