Cement Price Hike: ఇల్లు కడుతున్నారా? మీకో చేదు వార్త - ఎక్కువ డబ్బు దగ్గర పెట్టుకోండి!
Increase In House Construction Costs: ఇప్పటికే నిర్మాణ వ్యయాల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న హౌసింగ్ రంగంపై సిమెంట్ ధరల పెంపుతో మరింత భారం పడింది.
Real Estate Sector: ఇల్లు కట్టడం ఇప్పుడు మరింత భారంగా మారింది. సిమెంట్ ధరలు పెరగడమే దీనికి కారణం. దేశవ్యాప్తంగా సిమెంట్ రేట్లు పెరిగాయి. 50 కిలోల బస్తాకు 5 రూపాయల నుంచి 40 రూపాయల వరకు పెరుగుదల కనిపిస్తోంది. వర్షాకాలం ముగిసిన నేపథ్యంలో నిర్మాణాలు ఊపందుకుని, సిమెంట్‌కు డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు దేశవ్యాప్తంగా సిమెంట్ డీలర్లు ధరలు పెంచారు.
గత 4-5 నెలలుగా సిమెంట్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో సిమెంట్ డీలర్ల మార్జిన్లు (లాభాలు) తగ్గుముఖం పట్టాయి. దీంతో పాటు, సిమెంట్ కంపెనీల లాభాలపైనా ప్రభావం పడింది. ET రిపోర్ట్ ప్రకారం, వర్షాకాలం ముగిసిన నేపథ్యంలో, డిసెంబర్ ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా సిమెంట్ డీలర్లు రేట్లను పెంచారు. రియల్ ఎస్టేట్ రంగంలో, ముఖ్యంగా గృహ నిర్మాణాల విభాగం (Housing Sector) ఊపందుకోవడంతో సిమెంట్ డిమాండ్‌లో బలమైన పెరుగుదల కనిపిస్తోంది. పండుగల సీజన్ ముగిసిన తర్వాత కూలీల లభ్యత కూడా పెరిగింది. మౌలిక సదుపాయాలు (రోడ్లు, వంతెనలు, కార్యాలయ భవనాలు, ఫ్యాక్టరీ భవనాలు వంటివి) & రియల్ ఎస్టేట్ రంగాలలో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో సిమెంట్‌కు డిమాండ్ పెరిగింది.
దేశంలోని పశ్చిమ ప్రాంతంలో, డీలర్లు సిమెంట్ ధరలను బస్తాకు 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పెంచారు. ఆ ప్రాంతంలో సిమెంట్ ధరలు బస్తాకు 350 రూపాయల నుంచి 400 రూపాయలకు చేరాయి. తూర్పు రాష్ట్రాల్లో సిమెంట్ బస్తా రేటు 30 రూపాయల వరకు పెరిగింది. దిల్లీలోని సిమెంట్ డీలర్లు సిమెంట్ ధరలను బస్తాకు 20 రూపాయల చొప్పున పెంచారు. దక్షిణాది రాష్ట్రాల్లో బస్తాకు 40 వరకు రేట్లు పెరిగాయి.
ఇన్‌క్రెడ్ ఈక్విటీస్ రిపోర్ట్ ప్రకారం, డిసెంబర్‌లో అన్ని ప్రాంతాలలో సిమెంట్ ధరలు సగటున బస్తాకు రూ. 10-15 పెరిగాయి. ఎన్నికలు & వర్షాకాలం కారణంగా నిర్మాణ అంతరాయాన్ని చూసిన తర్వాత, ఇప్పుడు మౌలిక సదుపాయాల పనులు వేగవంతం అయ్యాయి, మున్ముందు ఇంకా స్పీడ్ అందుకుంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ప్రభుత్వం మూలధన వ్యయం కూడా పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకుని డీలర్లు సిమెంట్ ధరలు పెంచారు.
సిమెంట్ ధరల పెంపుతో గృహ నిర్మాణ రంగంలో నిర్మాణ వ్యయం పెరగడం ఖాయం, దీని భారాన్ని కొనుగోలుదారులే భరించాల్సి వస్తోంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కంపెనీ కొలియర్స్ ఇండియా (Colliers India), ఇటీవల విడుదల చేసిన నివేదికలో, ఖరీదైన నిర్మాణ సామగ్రి & లేబర్ ఖర్చుల కారణంగా గృహ ప్రాజెక్టుల సగటు నిర్మాణ వ్యయం గత నాలుగేళ్లలో 39 శాతం పెరిగిందని వెల్లడించింది. ఆ సంస్థ డేటా ప్రకారం, 2020 అక్టోబర్‌లో ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్ట్‌లలో సగటు నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ. 2000 ఉంది, ఇది 2024 అక్టోబర్‌లో చదరపు అడుగుకు రూ. 2780 కు చేరింది. అంటే, గత నాలుగేళ్లలో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ. 780 పెరిగింది.
డేటా ప్రకారం, గత ఏడాది కాలంలో, గృహ నిర్మాణ ప్రాజెక్టుల సగటు వ్యయం 11 శాతం పెరిగింది. ఇసుక, ఇటుక, గాజు, కలప వంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో పాటు కూలీల ఖర్చు భారీగా పెరగడం వల్ల ఇళ్ల నిర్మాణం మోయలేని భారంగా మారింది. సిమెంట్, స్టీల్, కాపర్, అల్యూమినియం ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. కానీ, కూలీల ఖర్చు 25 శాతం పెరిగింది.
మరో ఆసక్తికర కథనం: పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?