Union Budget 2022 Telangana : ప్రతీ సారి నిరాశే.. ఈ సారైనా కనికరిస్తారా ? కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ఎన్నో ఆశలు !
కేంద్ర బడ్జెట్‌లో తమకు ఏమేమి కావాలో కేటీఆర్, హరీష్ రావు, బోయిన్ పల్లి వినోద్ కుమార్ వరుసగా లేఖలు రాసి తెలియచేశారు. అడిగిన వాటిలో కొన్ని అయినా ఇస్తారని ఒకటో తేదీన బడ్జెట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. నిర్మలా సీతారామన్ తెలంగాణ ఆశల్ని తీరుస్తారా?
ప్రతి ఏడాది కేంద్ర బడ్జెట్‌కు సమయం ముంచుకు వస్తోందంటే తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అవుతుంది. తమకు ఏం కావాలో చెబుతూ విభాగాల వారీగా లేఖలు రాసి విజ్ఞప్తులు చేస్తూ ఉంటుంది. అంతిమంగా బడ్జెట్ ప్రకటించిన తర్వాత అంతా చూసుకుని దేనికీ నిధులు కేటాయించలేదే అని అసంతృప్తికి గురవుతూ ఉంటుంది. ఈ సారి కూడా తమకు కేంద్ర బడ్జెట్‌లో ఏమేం కావాలో లేఖల ద్వారా కేంద్రానికి తెలియచేశారు. బడ్జెట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుల కోసం విజ్ఞప్తి !
ప్రతి రాష్ట్రానికి ఓ జాతీయ ప్రాజెక్టు ఇవ్వడం ఆనవాయితీ. కానీ తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు కూడా లేదు. కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా, మిషన్ కాకతీయకు ఆర్థిక సాయం చేయాలని ప్రతీ సారి కోరుతున్నారు. మెట్రోరైలు ప్రాజెక్టు, జాతీయ రహదారులకు నిధులివ్వాలని కోరుతున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల అమల్లో స్వేచ్ఛ, పింఛన్ పెంపు కింద నిధుల పెంపు ఐటీఐఆర్‌తో పాటు బయ్యారం స్టీల్‌ఫ్యాక్టరీ, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ ఏర్పాటు లాంటి విభజన హామీలు అమలు చేయాలని కోరుతున్నారు. కానీ ఎక్కడా పెద్దగా కదలిక కనిపించడం లేదు.
వరుస లేఖల ద్వారా జాబితా ఇచ్చిన మంత్రి కేటీఆర్ !
ఇటీవల మంత్రి కేటీఆర్ బడ్జెట్‌లో కేటాయింపుల కోసం వరుసగా లేఖలు రాశారు. ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరించాలని నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. సీసీఐ నిర్వహణకు అన్ని వసతులు ఉన్నాయని, కేంద్ర ముందుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. పునః ప్రారంభిస్తే వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అలాగే మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో చేపడుతున్న మాస్ రోడ్ ట్రాన్సిట్ సిస్టంకు రూ.450కోట్లు, ఎస్సారెస్పీ రెండోదశకు రూ.3450కోట్లు, మెట్రో నియో ప్రాజెక్టు వరంగల్ కు రూ.184కోట్లు, ఎస్టీపీ పనుల కోసం రూ.2895కోట్లు, మిస్సింగ్ లింక్ రోడ్ల నిర్మాణం కోసం రూ.800కోట్లు మొత్తం రూ.7800కోట్లు ఇవ్వాలని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖలో విజ్ఞప్తి చేశారు. చేనేత జౌళి రంగానికి సంబంధించి కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు రూ.897.92కోట్లు, సిరిసిల్లలో మెగా పవర్ లూం క్లస్టర్ మంజూరు చేసి కేంద్రం 49.84కోట్లు, 5 క్లస్టర్ల ఏర్పాటుకు రూ.20.82కోట్లు, మరో 8 కస్లర్టర్లకు 7.20కోట్లు, పవర్ లూమ్ అప్ గ్రేడ్ కోసం 13.88కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఈ అలాగే తెలంగాణ ఫార్మాసిటీ, పారిశ్రామిక కారిడార్లకు రూ.14000కోట్లు ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ కు లేఖరాశారు.
విభజన హామీల పరిష్కారానికి హరీష్ రావు విజ్ఞప్తులు !
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014 ప్రకారం తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల విషయాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు. రూ. 730 కోట్ల స్పెషల్ గ్రాంటుతోపాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 2019 నుంచి ఇవ్వాల్సిన రూ.900 కోట్లు, నీతి ఆయోగ్ మిషన్ భగీరథకు సిఫారసు చేసిన మేరకు రూ.24,205కోట్లు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఆర్థిక మంత్రి హరీష్ రావు ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ కు లేఖరాశారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు స్థానిక సంస్థలకు 817.61కోట్లు ఇవ్వాల్సి ఉన్నదన్నారు. ప్రత్యేక గ్రాంటు కింద 723కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థికసంఘం సూచనమేరకు ఇవ్వాలని కోరారు. ఏపీ పునర్ విభజన చట్టం 13వ సెక్షన్ ప్రకారం.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరుతోంది. పెండింగ్ లో రైల్వే లైన్లతో పాటు మరో 25 లైన్ల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ సారి గుడ్ న్యూస్‌లు ఉంటాయా?
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా బడ్జెట్ లో ఆ ఏడాది రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎన్నికలు జరగనున్నాయో ఆయా రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ ఉంటారు. కర్ణాటకలో.. కేరళలో ఎన్నికలున్నప్పుడు అక్కడి మెట్రోలకు రూ. వేల కోట్లు కేటాయించారు. లేకపోతే కేంద్ర ప్రాజెక్టులు ప్రకటిస్తూ ఉంటారు. ఈ లెక్కన తెలంగాణలో ఈ ఏడాది ముందస్తుఎన్నికలు వస్తాయనీ బీజేపీ గట్టిగా నమ్ముతోంది. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు ఉంటాయని సిద్ధం కావాలని స్వయంగా అమిత్ షా కూడా చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో పట్టు సాధించడానికి స్కోప్ ఉందన్న ఉద్దేశంతో బీజేపీ హైకమాండ్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉందన్న అంచనా ఉంది. ఈ కోణంలో విశ్లేషిస్తే ఈ సారి కేంద్ర బడ్జెట్‌లో గతంలో ఎప్పుడూ లభించనంత ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది.