Budget 2025: ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నారా?
Inciome Tax Budget 2025: ఫిబ్రవరి 01న, ఆర్థికమ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీనిలో, ఆదాయ పన్నుకు సంబంధించిన ప్రకటనలపైనే అందరి దృష్టి ఉంది.

Tax Collections Share in Indian GDP: ద్రవ్యోల్బణం, పన్నుల భారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మధ్య తరగతి ప్రజలు, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం ప్రవేశపెట్టే బడ్జెట్ (Union Budget 2025) నుంచి ఉపశమనాలను ఆశిస్తున్నారు. ప్రస్తుతం, మన దేశంలో పన్నుల విధానంపై చాలా చర్చ జరుగుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ చాలా ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నారని చాలామంది భావిస్తున్నారు.
మన దేశంలో పన్ను విధానం ఎలా ఉంది?
భారతదేశ పన్ను వ్యవస్థ ప్రధానంగా రెండు భాగాలుగా ఉంటుంది. ప్రత్యక్ష పన్నులు & పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులలో.. ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను, సంపద పన్ను వంటివి ఉన్నాయి. పరోక్ష పన్నులలో.. వస్తువులు & సేవల పన్ను (GST), ఎక్సైజ్ సుంకం, కస్టమ్స్ సుంకం వంటివి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఖర్చులలో దాదాపు 80% పన్నుల రాబడిపై ఆధారపడి ఉంటాయి. చైనా (40%), బ్రెజిల్ (50%), మెక్సికో (60%), దక్షిణాఫ్రికా (55%) వంటి అనేక ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే, పన్ను ఆదాయంపై మన దేశంలోనే ఎక్కువగా ఆధారపడుతున్నాం.
GDPలో పన్ను రాబడి వాటా ఎంత?
పన్ను వ్యవస్థను అంచనా వేసే అత్యంత కీలక అంశం 'స్థూల జాతీయోత్పత్తి' (GDP)లో మొత్తం పన్ను ఆదాయం. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, భారతదేశంలో మొత్తం పన్ను ఆదాయాలు చాలా అభివృద్ధి చెందిన దేశాల కంటే తక్కువగా ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లోని ఆదాయాలు GDPలో 30% కంటే ఎక్కువగా ఉన్నాయి, భారతదేశంలో 20% కంటే తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం తన ఆర్థిక అవసరాల కోసం పన్నులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నప్పటికీ, పన్ను ఆదాయాన్ని పెంచుకోవడంలో వెనుకబడి ఉందని ఈ లెక్క నిరూపిస్తుంది.
భారతదేశ GDPలో మొత్తం పన్నుల ఆదాయం 18%
అమెరికా GDPలో మొత్తం పన్నుల ఆదాయం 27%
జర్మనీ GDPలో మొత్తం పన్నుల ఆదాయం 30%
ఫ్రాన్స్ GDPలో మొత్తం పన్నుల ఆదాయం 31%
జపాన్ GDPలో మొత్తం పన్నుల ఆదాయం 25%
ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం స్థానం ఎక్కడ?
పన్నుల ఆదాయంలో ప్రపంచ దేశాలతో భారతదేశాన్ని పోల్చడానికి, తలసరి GDPని చూడాలి. వివిధ దేశాల ఆదాయాలు పెరుగుతున్న కొద్దీ అక్కడి ప్రభుత్వాలు జీడీపీలో ఎక్కువ శాతాన్ని పన్నులు రూపంలో వసూలు చేయగలుగుతున్నాయని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఈ విషయంలో మన దేశం అమెరికా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ వంటి చాలా దేశాల కంటే వెనుకబడి ఉంది.
అధిక పన్నులపై ఎందుకు చర్చ?
భారతదేశ GDPలో మొత్తం పన్నుల రాబడి తక్కువగా ఉన్నప్పటికీ, మన దేశంలో అధిక పన్నులు వసూలు చేస్తున్నారనే భావన భారతీయ పౌరుల్లో, ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల్లో ఎక్కువగా ఉంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
1. అధిక పన్ను రేట్లు: చాలా మంది ప్రజలు తమ ఆదాయ స్థాయితో పోలిస్తే తమపై విధించిన పన్ను రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.
2. పరిమిత ఆదాయం: జీవన వ్యయం పెరగడం & జీతం/ఆదాయం పెరుగుదల ఆగిపోవడం వల్ల కుటుంబ అవసరాలను తీర్చడం కష్టంగా మారింది.
3. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం: ప్రభుత్వం పన్నుల రాబడిని సమర్థవంతంగా ఉపయోగిస్తుందా, లేదా అనే సందేహాలు కూడా తమపై భారం పడుతోందని ప్రజలు నమ్మేలా చేస్తోంది.
ప్రజల అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నప్పటికీ, గణాంకాలను చూడడం ముఖ్యం. మన దేశంలో అధిక పన్ను విధించినట్లు మెజారిటీ వర్గం భావిస్తున్నప్పటికీ, భారతదేశ జీడీపీలో మొత్తం పన్నుల ఆదాయం అనేక అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్న విషయాన్ని గమనించాలి.
మరో ఆసక్తికర కథనం: గ్యాస్ బండ నుంచి UPI వరకు - ఫిబ్రవరి 01 నుంచి దేశంలో 5 కీలక మార్పులు





















