(Source: Poll of Polls)
Budget 2023: కేంద్ర బడ్జెట్‌పై కామన్ డౌట్సా! ఇవిగో జవాబులు!
Budget 2023: సార్వత్రిక ఎన్నికల ముందు మోదీ సర్కారు ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి చివరి బడ్జెట్ ఇదే! ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై వచ్చే సర్వ సాధారణ సందేహాలకు జవాబులు మీకోసం!
Budget 2023: సార్వత్రిక ఎన్నికల ముందు మోదీ సర్కారు ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి చివరి బడ్జెట్ ఇదే! కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మళ్లీ కరోనా వైరస్ భయాలు వెంటాడుతున్న వేళ కేంద్ర పద్దు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది! ఆదాయ పన్ను మినహాయింపులు, శ్లాబుల్లో మార్పులు, పేదలకు మేలు చేసే పథకాలు ప్రవేశ పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై వచ్చే సర్వ సాధారణ సందేహాలకు జవాబులు మీకోసం!
గతంలో బడ్జెట్‌ను బ్రిటన్ సంపద్రాయాలను అనుసరించి ప్రవేశపెట్టేవారు. మోదీ సర్కారు వచ్చాక ఈ పద్ధతి మార్చారు. ఏటా ఫిబ్రవరి ఒకటో తారీకు బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ ఏడాదీ ఫిబ్రవరి 1నే ఉంటుంది.
ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు జనవరి 31న మొదలై ఫిబ్రవరి 8న ముగుస్తాయి.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జనవరి 31న అధికారికంగా బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తారు. ఉభయ సభలను కలిపి 31న ఉదయం 11 గంటలకు ప్రసంగిస్తారు.
బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరుగుతాయి. తొలి దశ జనవరి 31న మొదలై ఫిబ్రవరి 11న ముగుస్తుంది. రెండో దశ మార్చి 14న ఆరంభమై ఏప్రిల్ 8 వరకు జరుగుతుంది.
బడ్జెట్‌కు ఒక రోజు ముందు అంటే జనవరి 31న పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు.
దేశ వార్షిక ఆర్థిక ప్రగతిని ఆర్థిక సర్వే ప్రతిబింబిస్తుంది. ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి సమాధానాలను అన్వేషిస్తుంది. ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ వీ అనంత నాగేశ్వరన్ ఆర్థిక సర్వేను రూపొందిస్తారు.
కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి, రాబడి, ఖర్చులతో కూడిన సమగ్ర ఆర్థిక పత్రమే కేంద్ర బడ్జెట్. ఫ్రెంచ్ పదం బుగెట్టి నుంచి బడ్జెట్ ఆవిర్భవించింది. సంచి అని దీనర్థం. భవిష్యత్తులో రాబడి, ఖర్చుల అంచనాలను బట్టి బడ్జెట్‌ను రూపొందిస్తారు.
కేంద్ర బడ్జెట్ తయారీ ప్రక్రియ 2022, అక్టోబర్ 10న మొదలైంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలో జరుగుతుంది.
ఒక ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆదాయం, ఖర్చుల మధ్య తేడానే ఆర్థిక లోటు అంటారు. ఖర్చులతో పోలిస్తే రాబడి తక్కువగా ఉండటాన్ని లోటుగా చెప్తారు. మొత్తం రాబడిని లెక్కించేటప్పుడు అప్పులను కలపరు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో కేంద్ర ఆర్థిక లోటు రూ.7.58 లక్షల కోట్లుగా ఉంది. అంటే వార్షిక అంచనాల్లో 45.6 శాతం అన్నమాట. గతేడాది ఇది రూ.5.47 లక్షల కోట్లే (36.3 శాతం) కావడం గమనార్హం.