BSE Charges: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ షాక్- బీఎస్ఈ ఛార్జీల బాదుడు వివరాలివే
Bombay Stock Exchange బీఎస్ఈ తాజాగా పెద్ద షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆప్షన్స్ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్ ఛార్జీలను భారీగానే పెంచాలని నిర్ణయించింది. దీనికి ముందు సెబీ తీసుకున్న చర్యలే కారణం.
Transaction Charges: భారత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ప్రస్తుతం సేవలు అందిస్తున్నాయి. అయితే దేశంలో అత్యంత పురాతన స్టాక్ మార్కెట్‌గా బీఎస్ఈ కొనసాగుతోంది. ఇటీవల మార్కెట్ రెగ్యులేటర్ చర్యలతో స్టాక్ సింగిల్ డే 18 శాతానికి పైగా భారీ పతనం నమోదు చేసింది.
ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ ఆపరేటర్ బీఎస్ఈ మంగళవారం కీలక ప్రకటన చేసింది. త్వరలో తాను ట్రాన్సాక్షన్ ఛార్జీలను పెంచనున్నట్లు పేర్కొనటం దేశీయ స్టాక్ మార్కెట్లోని పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేసింది. మే 13 నుంచి సెన్సెక్స్, బ్యాంక్‌ఎక్స్ ట్రేడింగ్ ఛార్జీలను పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న ఛార్జీలను వివిధ టర్నోవర్ బ్రాకెట్లలో 24 నుంచి 32 శాతం వరకు పెంచాలని నిర్ణయించింది. సెబీ రెండు రోజుల కిందట బీఎస్ఈని రెగ్యులేటరీ ఫీజును వార్షిక ఆప్షన్స్ కాంట్రాక్ట్ టర్నోవర్ ఆధారంగా చెల్లించాలని ఆదేశించటంతో ఛార్జీల మోత మెుదలైంది.
ఈ లెక్కన బీఎస్ఈ సెబీకి చెల్లించాల్సిన డిమాండ్ దాదాపు రూ.165 కోట్లకు అదనంగా జీఎస్టీ కూడా ఉంటుందని అంచనా వేయబడింది. ప్రస్తుతం ఉన్న పాత ట్రాన్సాక్షన్ ఛార్జీలు S&P BSE Sensex, S&P BSE Bankexలకు మే 1 నుంచి మే 10 వరకు వర్తిస్తాయి. అయితే మే 13 నుంచి మే 31 మధ్య పెరుగుతున్న టర్నోవర్ ఆధారంగా లెక్కించబడిన స్లాబ్ ప్రకారం లావాదేవీ ఛార్జీలు విధించబడతాయని వెల్లడైంది. జూన్ నుంచి ప్రీమియం టర్నోవర్ ఆదారంగా ప్రతి నెల ఏనెలకు ఆ నెల నిర్ణయించబడతాయని తెలుస్తోంది.
వాస్తవానికి బీఎస్ఈ ఇండెక్స్ ఆప్షన్స్ వ్యాపారంలోకి మే 2023న తిరిగి ప్రవేశించినప్పటి నుంచి ఆప్షన్స్ ట్రేడింగ్ వాల్యూమ్స్ అనూహ్యంగా పెరిగాయి. ప్రస్తుతం బీఎస్ఈ ప్రీమియం టర్నోవర్ కేవలం 8 శాతంగా ఉంది.