Airtel and Bajaj Finance: ఎయిర్‌టెల్ యాప్‌లో బజాజ్ ఫైనాన్స్ లోన్లు - రుణం తీసుకోవడం ఇంకా ఈజీ
Bajaj Finance Airtel Partnership: బజాజ్ ఫైనాన్స్ & భారతీ ఎయిర్‌టెల్ ఒప్పందం ప్రకారం, ప్రజలకు ఆర్థిక ఉత్పత్తులు అందించేందుకు ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఈ రెండు కంపెనీలు కలిసి పని చేస్తాయి.

Bharti Airtel and Bajaj Finance Signs A Big Deal: ప్రముఖ టెలికాం కంపెనీ (Telecom Company) భారతి ఎయిర్‌టెల్ & నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) బజాజ్ ఫైనాన్స్ మధ్య ఒక పెద్ద ఒప్పందం కుదిరింది. లోన్లు సహా విభిన్న రకాల ఆర్థిక సేవలను అందించడానికి ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించేందుకు ఈ రెండు కంపెనీలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ ఒప్పందం వల్ల 37.5 కోట్ల మంది ఎయిర్‌టెల్ యూజర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని రెండు కంపెనీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
12 ప్రొడక్ట్ లైన్లతో కూడిన వైవిధ్యభరితమైన పోర్ట్‌ఫోలియో, 5,000కు పైగా బ్రాంచ్‌లు, దాదాపు 70,000 మంది ఫీల్డ్ ఏజెంట్ల పంపిణీ నెట్‌వర్క్, 12 లక్షలకు పైగా డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ బజాజ్ ఫైనాన్స్ సొంతం. ఎయిర్‌టెల్ కస్టమర్లు సహా ప్రజలు త్వరలోనే ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని రకాల ఫైనాన్స్ సంబంధిత సేవలను పొందవచ్చు.
ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌తో ప్రారంభం
ఒప్పందం ప్రకారం, ఈ రెండు పెద్ద కంపెనీలు కలిసి, అన్ని ఆర్థిక సేవలు (లోన్లు సహా ఇతర ఆర్థిక ఉత్పత్తులు) అందుబాటులో ఉండే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను సృష్టిస్తాయి. మొదట, ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ (Airtel Thanks App)తో దీనిని ప్రారంభించేందుకు అంగీకారం కుదిరింది. అంటే, ఎయిర్‌టెల్ సిమ్ వినియోగదార్లు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా బజాజ్ ఫైనాన్స్ లోన్లు తీసుకోవచ్చు.
"ఎయిర్‌టెల్‌తో మా భాగస్వామ్యం భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా, ఈ ఒప్పందం ద్వారా దేశంలోని రెండు పెద్ద & విశ్వసనీయ బ్రాండ్‌ల సేవలు మరింత ఎక్కువ మందికి చేరతాయి. మార్చి నాటికి బజాజ్ ఫైనాన్స్ నాలుగు ఉత్పత్తులు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి" అని పేర్కొంటూ బజాజ్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ జైన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
వన్ స్టాప్ షాప్‌గా మారనున్న ఎయిర్‌టెల్ ఫైనాన్స్
“మాపై కోటి మందికి పైగా కస్టమర్ల విశ్వాసం ఉంది. ఎయిర్‌టెల్ ఫైనాన్స్‌ను ఆర్థిక సేవలన్నీ ఒకే చోట అందించేలా చేయడమే మా లక్ష్యం" అని భారతి ఎయిర్‌టెల్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ చెప్పారు.
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన బజాజ్ ఫైనాన్స్, కన్జ్యూమర్ గూడ్స్ & వెహికల్ ఫైనాన్స్ కోసం రుణాలను అందిస్తుంది. బజాజ్ గ్రూప్‌లోని ఈ కంపెనీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది.
జియో ఫైనాన్స్‌కు గట్టి పోటీ
భారతి ఎయిర్‌టెల్ - బజాజ్ ఫైనాన్స్ మధ్య కుదిరిన ఒప్పందం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు (Jio Financial Services Ltd) పోటీగా మారతుందని మార్కెట్ పండితులు చెబుతున్నారు. రిలయన్స్ జియో (Reliance Jio) కస్టమర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకుని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తన ఉత్పత్తులను క్రాస్ సెల్లింగ్ చేస్తోంది. ఇప్పుడు, ఎయిర్‌టెల్ కస్టమర్ బేస్‌ను ఉపయోగించుకుని బజాజ్ ఫైనాన్స్ కూడా బిజినెస్ పెంచుకునే అవకాశం ఉంది, జియో ఫైనాన్స్‌కు పోటీగా మారుతుంది.
మరో ఆసక్తికర కథనం: డబ్బుతో సిద్ధంగా ఉండండి, త్వరలో 6 కొత్త IPOలు ప్రారంభం





















