BCCI Media Rights: వయాకామ్ 18, స్టార్‌స్పోర్ట్స్ పర్సుల్లో డబ్బుల్లేవ్! టీమ్‌ఇండియా మ్యాచుల ప్రసారంపై అనాసక్తి!
BCCI Media Rights: మీడియా హక్కులకు బీసీసీఐ ఎప్పుడు బిడ్డింగ్‌కు ఆహ్వానించినా కంపెనీలు ఎగబడేవి. విచిత్రంగా ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.
BCCI Media Rights:
టీమ్‌ఇండియా క్రికెట్ మ్యాచుల ప్రసార హక్కులకు ఉండే క్రేజే వేరు! బీసీసీఐ ఎప్పుడు బిడ్డింగ్‌కు ఆహ్వానించినా కంపెనీలు ఎగబడేవి. హక్కులను సొంతం చేసుకొనేందుకు వ్యూహాలు రచించేవి. సరికొత్త ఎత్తుగడలు వేసేవి! విచిత్రంగా ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. రిలయన్స్ వయాకామ్ 18, స్టార్ స్పోర్ట్స్ ఇండియా, సోనీ వంటి కంపెనీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.
2023 నుంచి 2028 వరకు ఐదేళ్ల కాలానికి టీమ్‌ఇండియా హోమ్ గేమ్స్ కోసం బీసీసీఐ మీడియా హక్కులను వేలం వేయనుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలవ్వాల్సింది. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. టీవీ, డిజిటల్ హక్కుల ద్వారా రూ.6500 కోట్లు, రూ.7500 కోట్లు బోర్డుకు వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే ఒక్కో మ్యాచ్ కనీస ధరను బోర్డు 25 శాతం మేర తగ్గించడం విచిత్రం!
'చివరి సైకిల్‌తో పోలిస్తే మ్యాచుల సంఖ్య 15 శాతం మేర తగ్గింది. దాంతో కనీస ధరపై 1.6 - 1.9 రెట్ల వరకు డబ్బులు వస్తాయని అంచనా. ఇప్పుడు నిర్ణయించిన రూ.45 కోట్ల కనీస ధర చివరిసారి రూ.60 కోట్ల కన్నా 25 శాతం తక్కువే' అని ఎలారా క్యాపిటల్ అనలిస్టు కరన్ టౌరాని అన్నారు. రాబోయే ఐదేళ్లలో టీమ్‌ఇండియా 88 మ్యాచులు ఆడనుంది. టీవీ, డిజిటల్ కలిసి మొత్తం కనీస ధర రూ.3,960 కోట్లుగా ఉంది. ఒక్కో మ్యాచుకు టీవీకి రూ.20 కోట్లు, డిజిటల్ రూ.25 కోట్ల వరకు ఉంటుంది. అయితే బీసీసీఐ రూ.60 కోట్ల వరకు ఆశిస్తోందని తెలిసింది.
టీవీ హక్కుల ద్వారా కనీస ధరపై 30-40 శాతం, డిజిటల్ హక్కులపై 80-90 శాతం వరకు ప్రీమియం వస్తుందని అంచనా వేస్తున్నారు. అప్పుడు రెండు విభాగాలు కలిపి ఒక్కో మ్యాచుకు రూ.80 కోట్ల వరకు బీసీసీఐకి దక్కుతుంది. 'ఈ ధర టెలివిజన్, డిజిటల్ వేదికలకు లాభాలు తెస్తుందని మేం అంచనా వేస్తున్నాం. కొత్త తరం టెక్నాలజీ కంపెనీలు ప్రకటనలు ఇవ్వడం, ద్రవ్యోల్బణం భయాలు తగ్గుతుండటం, మెటా, వెబ్ 3.0, 5జీ ఆవిర్భావంతో బ్రేక్‌ఈవెన్ అవుతుందని అనుకుంటున్నాం' అని కరన్ అంటున్నారు.
చివరిసారి బీసీసీఐ వేలం నిర్వహించినప్పుడు రిలయన్స్, సోనీ కన్నా స్టార్ స్పోర్ట్స్ ఇండియా ఎక్కువగా బిడ్ వేసింది. రూ.6138 కోట్లకు హక్కులను దక్కించుకుంది. అప్పుడు డిజిటల్, టీవీ, ఎస్‌డీ, హెచ్‌డీ, ఆరు భాషాలు, ఆసియాకప్, ఐసీసీ ఈవెంట్లు ఇలా అన్నీ ఉన్నాయి. ఈసారి మాత్రం డిస్నీ స్టార్, వయాకామ్ 18, సోనీ హక్కుల కోసం మళ్లీ పోటీ పడే అవకాశం ఉంది. అయితే మరీ ఎక్కువగా ఖర్చు పెట్టే స్థితిలో లేవు.
స్టార్ స్పోర్ట్స్, రిలయన్స్ జియో కలిపి రూ.48,390 కోట్లకు ఐపీఎల్ టీవీ, డిజిటల్ హక్కులను వేర్వేరుగా దక్కించుకున్నాయి. కంపెనీలు ఎక్కువ ఖర్చు పెట్టేందుకు ఆసక్తి చూపించకపోవడం వల్లే బీసీసీఐ కనీస ధరను తగ్గించిందని తెలిసింది. బిడ్డింగ్‌కు కొన్నే సంస్థలు వస్తుండటం, ప్రకటనల ఆదాయం తగ్గడం, 2023లో ఐపీఎల్ ఆదాయం 20-25 శాతం తగ్గడంతో బోర్డు ఆచితూచి అడుగులు వేస్తోంది.
Also Read: మూడీస్ షాక్! 10 అమెరికా బ్యాంకులకు డౌన్‌గ్రేడింగ్ - పైగా వార్నింగులు!