Indian Banks Profits: ఇది బ్యాంకుల టైమ్ బాబూ, Q3లోనూ లాభాల పండగే!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోనూ (Q2FY23) బ్యాంకులు చక్కటి పనితీరు కనబరిచాయి.
Indian Banks Profits: 2022-23 ఆర్థిక సంవత్సరం (FY23) మూడో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం) జరిగిన వ్యాపారానికి సంబంధించిన తాత్కాలిక సమాచారాన్ని బ్యాంకులు అప్‌డేట్ చేయడం మొదలు పెట్టాయి. ఆ గణాంకాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి, భారతీయ బ్యాంకులకు గుడ్ టైమ్ నడుస్తోందని అర్ధం అవుతోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోనూ (Q2FY23) బ్యాంకులు చక్కటి పనితీరు కనబరిచాయి. అదే ట్రెండ్‌ను మూడో త్రైమాసికంలోనూ (Q3FY23) బ్యాంకులు కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి.
బాటమ్ లైన్ మీద ప్రభావం ఎలా ఉంటుంది?
ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ ఏడాది ఐదు సార్లు వడ్డీ రేట్లను పెంచింది. రెపో రేటు 4.00 శాతం నుంచి 6.25 శాతానికి తీసుకెళ్లింది. 2022 డిసెంబర్ 7న జరిగిన ద్రవ్య పరపతి సమీక్షలో పెంచిన రేటుతో, మొత్తం రెపో రేటు 6.25 శాతానికి చేరింది. దీనికి అనుగుణంగా బ్యాంకులు కూడా రుణాల మీద వడ్డీ రేట్లను పెంచాయి. ఈ రూపంలో బ్యాంకులకు ఆదాయం పెరుగుతుంది.
దీనికి తోడు, భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఆరోగ్యవంతంగా పని చేస్తోంది. వినియోగదార్ల నుంచి డిమాండ్ పెరగడంతో, ఉత్పత్తులు పెంచడానికి పెద్ద కంపెనీలన్నీ రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్నాయి. దీంతో, బ్యాంకులు ఇచ్చే రుణాల సంఖ్య, రుణాల మొత్తం భారీగా పెరిగింది. అప్పులు ఇవ్వడానికి తమ దగ్గరున్న డబ్బులు సరిపోక, బాండ్ల జారీ ద్వారా బ్యాంకులు నిధులు సమీకరిస్తున్నాయంటే, రుణాలకు డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇవన్నీ కలిసి, మూడో త్రైమాసికంలో బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని పటిష్టం చేశాయి.
పెరిగిన లెండింగ్ రేట్లు, రుణాల సంఖ్య, రుణాల విలువ వంటివి బ్యాంకుల బాటమ్ లైన్‌కు (ప్రాఫిట్) బాగా తోడ్పడవచ్చు. ప్రముఖ బ్యాంక్‌ల నికర వడ్డీ మార్జిన్లు (net interest margins - NIM) లేదా ప్రధాన లాభదాయకత దాదాపు ఆరో వంతు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో (Kotak Mahindra Bank) దాదాపు 53% అడ్వాన్స్‌లు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్‌తో లింక్ అయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) 41% చొప్పున, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 34% వద్ద ఉన్నాయి. SBI జారీ చేసిన రుణాల్లో 41% రుణాలు MCLRతో అనుసంధానమై ఉన్నాయి, మొత్తం అడ్వాన్సుల్లో అధిక నిష్పత్తి వీటిదే.
ఆర్‌బీఐ రెపో రేట్లకు అనుగుణంగా లెండింగ్ రేట్లను పెంచిన బ్యాంకులు, డిపాజిట్ రేట్లను కూడా పెంచాయి. అవి తక్షణమే బ్యాంకుల లాభదాయకత మీద ప్రభావం చూపకపోయినా, మీడియం టర్మ్‌లో మార్జిన్ల మీద ఒత్తిడి పెంచుతాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడించింది. కాబట్టి, బ్యాంకుల డిపాజిట్ ఖర్చుల్లో పెరగుదలను కూడా ఇన్వెస్టర్లు గమనించాలని సూచించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.