Bank Locker New Rulesమారిన బ్యాంక్ లాకర్ రూల్స్, ప్రాధాన్యత వివరాలు తప్పనిసరి.. నవంబర్ 1 నుంచి అమలు
Bank Locker Rules from November 2025 | నవంబర్ 1 నుండి బ్యాంకింగ్ నిబంధనలలో మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ లాకర్ నియమాల గురించి తెలుసుకోండి.

Bank Locker New Rules: మీ విలువైన వస్తువులను భద్రపరిచేందుకు బ్యాంక్ లాకర్ ఉపయోగిస్తున్నారా.. బ్యాంక్ లాకర్ విషయంలో బ్యాంకులు ఇప్పుడు ఒక మార్పును తీసుకురాబోతున్నాయి. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ నవంబర్ 1, 2025 నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలో పలు మార్పులను ప్రకటించింది. ఇందులో బ్యాంక్ లాకర్ ఉంచుకోవడం నియమాలలో మార్పులు చేయడంతో పాటు కొత్త నిబంధనలు రూపొందించారు.
ఈ సమయంలో మొత్తం 5 చట్టాలలో ఆర్థిక శాఖ మార్పులు చేసింది. ఇందులో బ్యాంక్ ఖాతా నుండి మీ బ్యాంక్ లాకర్ వరకు చట్టాలు మార్చారు. కనుక బ్యాంక్ కొత్త నియమాలు ఏంటి, బ్యాంక్ లాకర్ నిబంధనలలో ఏం మార్పులు జరిగాయో ఇక్కడ తెలుసుకుందాం.
లాకర్ సంబంధిత రూల్స్
బ్యాంకింగ్ వ్యవస్థలో చేసిన మార్పులు ప్రజలకు చాలా సహాయపడతాయని ఆర్థికశాఖ భావిస్తోంది. అదే సమయంలో, బ్యాంక్ లాకర్లకు సంబంధించిన నిబంధనలు మారుతున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, ఇప్పుడు లాకర్ యజమాని ఒక ప్రాధాన్యతా జాబితాను సమర్పించాలి. తద్వారా లాకర్ హోల్డర్ మరణానంతరం ఎవరు ఆ లాకర్ తెరవాలో ఇది క్లారిటీ ఇస్తుంది. లాకర్ కోసం ప్రజలు ఒకరి తర్వాత ఒకరు నామినీలుగా ఉండవచ్చు. అంటే లాకర్లో ఉంచిన విలువైన వస్తువులైన ఆభరణాలు, డాక్యుమెంట్లకు నలుగురు పేర్లను మాత్రమే లాకర్ ఓనర్ నమోదు చేయవచ్చు.
కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ నాలుగు పేర్లు ఒకరి తర్వాత ఒకరు ప్రాధాన్యతా క్రమంలో ఉంటాయి. అంటే ఒకరు లేనప్పుడు మాత్రమే రెండవ వ్యక్తి పేరు జాబితాలో ప్రాధాన్యత వస్తుంది. వారు మాత్రమే లాకర్ తెరవగలరు. దీనికి కారణం ఏమిటంటే, వివాదాలను పరిష్కరించడం, లాకర్ ఓపెన్ చేసే ప్రక్రియను సులభతరం చేయడం. ఎందుకంటే ఇప్పుడు ఒక సమయంలో ఒక వ్యక్తి మాత్రమే లాకర్ తెరిచే అవకాశం ఉంటుంది. లాకర్ ఓపెన్ చేయడానికి నామినీల ప్రాధాన్యత నెంబర్లు ఇవ్వడంతో ఎలాంటి ఆలస్యం ఉండదు.
మార్పులు ఎందుకు చేశారు?
బ్యాంక్ నిబంధనలలో చేసిన మార్పులకు చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కస్టమర్ ప్రతి నామినీకి తన పొదుపులో స్థిరమైన శాతాన్ని సులభంగా ఇవ్వవచ్చు. ఇలా మొత్తం వాటా 100 శాతం ఉంటుంది. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది, సులభంగా జరుగుతుంది. దీనితో పాటు బ్యాంకింగ్ కంపెనీ రూల్స్ 2025 త్వరలో విడుదల చేస్తారు. ఈ నిబంధనల ప్రకారం, అన్ని బ్యాంకులలో నామినీ వివరాలు సమర్పించడం, దీని కోసం ఫారమ్ సమాచారం వంటి ఇతర విషయాలు ప్రకటిస్తారు. అన్ని బ్యాంకులలో ఈ ప్రక్రియ ఒకే విధంగా ఉంటుంది. దీని ప్రధాన లక్ష్యం బ్యాంకింగ్‌ను బలోపేతం చేయడం, లాకర్ల విషయంలో భద్రతను పెంచడం, నాణ్యమైన బ్యాంకింగ్ సేవలను అందించడం అని ఆర్థికశాఖ స్పష్టం చేసింది.






















