UPI New Rule 2025: ఆగస్టు 1 నుంచి UPI వినియోగదారులకు కొత్త నిబంధనలు! మీపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి!
UPI Regulation 2025: Google Pay, PhonePe లేదా Paytm వినియోగదారులందరికీ ఈ నియమాలు వర్తిస్తాయి. సిస్టమ్ డౌన్ కారణంగా చాలా మంది ఇబ్బంది పడ్డారు.

UPI New Rule 2025: UPI అంటే Unified Payment Interface వినియోగం దేశంలో వేగంగా పెరిగింది. అయితే, ఆగస్టు 1 నుంచి దీని నిబంధనలలో మార్పులు రాబోతున్నాయి. మీరు దీన్ని ఉపయోగిస్తుంటే, ఈ వార్తను తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. వాస్తవానికి, ఆగస్టు 1 తర్వాత, మీరు ఒక రోజులో UPI యాప్ ద్వారా యాభై కంటే ఎక్కువ సార్లు మీ బ్యాలెన్స్‌ను చెక్ చేయలేరు. వ్యాపారుల నుంచి బ్యాంకులు, వినియోగదారుల వరకు, ఈ మార్పు నియమం అందరికీ వర్తిస్తుంది.
UPIలో చాలా నియమాలు మారాయి
UPIపై ఆటో-పే లావాదేవీలు (బిల్ చెల్లింపులు, EMIలు, సభ్యత్వాలు వంటివి) ఇప్పుడు నిర్దిష్ట సమయ స్లాట్‌లలో మాత్రమే జరుగుతాయి. నివేదికల ప్రకారం, ఈ సమయం ఉదయం 10 గంటల ముందు లేదా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఉంటుంది. దీనితో పాటు, రాత్రి తొమ్మిదిన్నర గంటల తర్వాత కూడా స్లాట్‌ను ఫిక్స్ చేయవచ్చు. లావాదేవీలు వేగంగా జరిగేలా, సిస్టమ్స్‌పై భారం తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఏదైనా లావాదేవీ విఫలమైతే, మీరు రోజుకు మూడు సార్లు మాత్రమే దాని స్థితిని చూడవచ్చు. దీని కోసం ప్రతిసారీ కనీసం 90 సెకన్ల వ్యవధి ఉండాలి.
UPI వినియోగదారులందరికీ ఈ నియమం వర్తిస్తుంది, వారు Google Pay, PhonePe లేదా Paytm వినియోగదారులైనా సరే అందరికీ ఈ సూత్రం వర్తిస్తుంది. ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లో సిస్టమ్ డౌన్ కావడానికి రెండు పెద్ద ఘటనలు జరిగాయి. దీని కారణంగా లక్షల మంది వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.
ఏమి ప్రభావం ఉంటుంది?
వాస్తవానికి, UPI నిబంధనలలో మార్పులు సాధారణ వినియోగదారులపై ఎటువంటి ప్రభావం చూపవు. వారు మునుపటిలాగే రోజువారీ బిల్లు చెల్లింపుల నుంచి ఇతర చెల్లింపులు లేదా ట్రాన్స్‌ఫర్స్‌లు చేస్తూనే ఉంటారు. మునుపటిలాగే, వారు ఒక రోజులో లక్ష రూపాయల వరకు లావాదేవీలు చేయగలరు. అలాగే, విద్య లేదా ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన చెల్లింపులకు ఐదు లక్షల రూపాయల వరకు పరిమితి ఉంది. అయితే, ఆగస్టు 1 తర్వాత, ఏ UPI వినియోగదారుడైనా ఒక రోజులో యాభై కంటే ఎక్కువ సార్లు బ్యాలెన్స్ చెక్ చేయలేరు.






















