Anil Ambani: హిందూజా గ్రూప్ చేతికి అనిల్ అంబానీ కంపెనీ.. IRDAI ఆమోదం
ఒకప్పుడు బిలియనీర్, అంబానీ సోదరుడు అనిల్ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ హిందుజాల వశం అయింది. తాజాగా ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అనుమతులు రావటంతో దివాలా ప్రక్రియ కింద మెుదలైన కొనుగోలు కొలిక్కి వచ్చింది.
Reliance Capital: దాదాపు దశాబ్దకాలం కిందట దేశంలోని అత్యంత సంపన్నులో ఒకరుగా అంబానీ సోదరుడు అనిల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఓడలు బళ్లు అవుతాయనే సామెత ఆయన నిజజీవితంలో నిజంగానే జరిగింది. అనిల్ కంపెనీలు అప్పుల ఊబిలో కూరుకుపోవటంతో బిలియనీర్ హోదాను ఆయన కోల్పోయారు. ప్రస్తుతం అన్న ముఖేష్ ఆసియాను ఏలుతోంటే మరో పక్క అనిల్ మాత్రం ఒక్కో కంపెనీని అమ్ముకుని అప్పులు సెటిల్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.
తాజాగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ వార్తల్లో నిలిచింది. దీనికి కారణం దివాలా ప్రక్రియలో కంపెనీ సొంతం చేసుకున్న కొత్త యజమాని హిందూజా గ్రూప్ రిలయన్స్ క్యాపిటల్ డీల్ కు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సంస్థ IRDAI ఆమోదం లభించింది. అంబానీ కంపెనీ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకునేందుకు హిందుజూ గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ బిడ్‌కు రెగ్యులేటర్ షరతులతో కూడిన ఆమోదం లభించింది. రెగ్యులేటరీ అనుమతుల కోసం IIHL చాలా కాలం వేచి చూసిన సంగతి తెలిసిందే.
రిలయన్స్ క్యాపిటల్ ఇన్సూరెన్స్ విభాగంలో పూర్తిగా అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, నిప్పాన్ లైఫ్‌తో 51:49 జాయింట్ వెంచర్ అయిన రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం గమనార్హం. దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ నుంచి ఆమోదం పొందటంపై కంపెనీ ప్రతినిధి హర్షం వ్యక్తం చేశారు. ఇది చట్టపరమైన ఆమోదాలకు లోపడి ఉంటుందని వెల్లడించారు. వాస్తవానికి 2021లో రిలయన్స్ క్యాపిటల్ పాలనాపరమైన సమస్యలతో సకాలంలో చెల్లింపులు చేయటంలో విఫలం కావటంతో ఆర్బీఐ కంపెనీ బోర్డును రద్దు చేసింది. 2022లో విక్రయానికి బిడ్ లను ఆహ్వానించింది. కంపెనీ మెుత్తంగా రూ.40 వేల కోట్లకుపైగా రుణ భారాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడైంది.
దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా 2023లో హిందూజా గ్రూప్ సంస్థను రూ.9,661 కోట్ల అడ్వాన్స్ క్యాష్ బిడ్ కోసం కమిటీ ఎంపిక చేసింది. ఈ క్రమంలో రిలయన్స్ క్యాపిటల్‌కు చెందిన రూ.500 కోట్ల నగదు కూడా రుణగ్రహీతలకు చేరుతుంది. వాస్తవానికి ఈ డీల్ ఇప్పటికే అన్ని చట్టపరమైన అనుమతులను పొందింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కి చెందిన రిలయన్స్ క్యాపిటల్ కోసం రూ.9,650 కోట్ల దివాలా పరిష్కార ప్రణాళికను ఆమోదించింది. గతంలో కంపెనీ ప్రకటించిన దాని ప్రకారం IRDAI ఆమోదం పొందిన తర్వాత 48 గంటల్లో రూ.7,500 కోట్లను రుణగ్రహీతలకు చెల్లిస్తామని వెల్లడించింది. అలాగే మిగిలిన రూ.2,000 కోట్లను హిందూజా గ్రూప్‌కు 9.9 శాతం వాటా ఉన్న IIHL నుంచి ఈక్విటల రూపంలో చెల్లిస్తున్నారు. మెుత్తానికి సుదీర్ఘ ప్రక్రియ తర్వాత అనిల్ అంబానికి చెందిన ఫైనాన్స్ కంపెనీ హిందుజాల చేతికి వెళ్లిపోయింది.