Aditya Birla Group: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్‌లోకి వారసుల ఎంట్రీ, వీళ్ల అర్హతలేంటి?
ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా (Kumar Mangalam Birla) కుమార్తె అనన్య బిర్లా, కుమారుడు ఆర్యమన్ విక్రమ్ బిర్లా.
Aditya Birla Group: ఆదిత్య బిర్లా గ్రూప్‌లోకి (Aditya Birla Group) వారసులు చురుగ్గా చొచ్చుకుపోతున్నారు. గ్రూప్‌లోని కొన్ని కంపెనీలకు ఇప్పటికే ప్రాతినిథ్యం వహిస్తున్న అనన్య బిర్లా (Ananya Birla), ఆర్యమన్ విక్రమ్ బిర్లా (Aryaman Vikram Birla), తాజాగా, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (Aditya Birla Fashion & Retail) డైరెక్టర్లుగా చేరారు.
ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా (Kumar Mangalam Birla) కుమార్తె అనన్య బిర్లా, కుమారుడు ఆర్యమన్ విక్రమ్ బిర్లా.
స్టాక్ ఎక్స్ఛేంజీలకు దాఖలు చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో... "అనన్య బిర్లా, ఆర్యమన్ విక్రమ్ బిర్లా తమతో కలిసి కంపెనీ వ్యవస్థాపకత, వ్యాపార నిర్మాణంలో గొప్ప, విభిన్న అనుభవాన్ని తీసుకువస్తారని; వారి కొత్త తరపు ఆలోచనలు, వ్యాపార నైపుణ్యంతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ & రిటైల్‌కు ప్రయోజనం చేకూరుతుందని డైరెక్టర్ల బోర్డు విశ్వసిస్తోందని" బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ పేర్కొంది. కంపెనీ నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ ఇద్దరి నియామకాలను డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించిందని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ కంపెనీ వెల్లడించింది.
అదనపు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్‌లో అదనపు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అనన్య బిర్లా, ఆర్యమన్ విక్రమ్ బిర్లా వ్యవహరిస్తారు. వీళ్ల నియామకానికి కంపెనీ వాటాదార్ల ఆమోదం కూడా లభించాల్సి ఉంటుంది. అయితే, ఈ విషయంలో వాటాదార్ల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురు కాకపోవచ్చు. కేవలం ఫార్మాలిటీ కోసమే వాటాదార్ల సమావేశాన్ని నిర్వహిస్తారు.
ప్రస్తుతం.. ఆదిత్య బిర్లా గ్రూప్ యువ తరానికి అనన్య & ఆర్యమన్ నాయకత్వం వహిస్తున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ వ్యాపారాలకు వ్యూహాత్మక దిశను అందించే బాధ్యతతో పని చేస్తున్న ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్‌లో ఇటీవలే డైరెక్టర్లుగా నియమితులయ్యారు.
ఇప్పటికే సామర్థ్యాల నిరూపణ
ఎంచుకున్న రంగాల్లో తన వారసులు వ్యక్తిగతంగా సాధించిన అద్భుత విజయాల వారిని మరింత గొప్ప బాధ్యతలకు సిద్ధం చేశాయయని కుమార మంగళం బిర్లా చెప్పారు. వినియోగదారుల ఆలోచనల్లో వస్తున్న మార్పులను లోతుగా అర్ధం చేసుకుని, కొత్త తరం వ్యాపార వ్యూహాలతో ఫ్యాషన్ & రిటైల్ బోర్డ్‌కు కొత్త శక్తిని వారు తెస్తారని అన్నారు.
అనన్య బిర్లా, ఆర్యమన్ విక్రమ్ బిర్లా ఇప్పటికే తాము ఎంచుకున్న రంగాల్లో తమ సామర్థ్యాలను నిరూపించుకున్నారు. అనన్య బిర్లా ఇప్పటికే కొన్ని కంపెనీలను స్థాపించి విజయవంతంగా నపుడుతున్నాపు, 17 సంవత్సరాల వయస్సులో, తన మొదటి కంపెనీ స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్‌ను (Svatantra Microfin Pvt Ltd) స్థాపించారామె. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మైక్రో ఫైనాన్స్ కంపెనీల్లో ఇది ఒకటి. ఈ కంపెనీ నిర్వహణలో ఉన్న ఒక ఆస్తులు (AUM) ఒక బిలియన్ డాలర్ల విలువను అధిగమించాయి. 2015-2022 మధ్య 120% CAGR వద్ద వృద్ధి చెందాయి. ఈ కంపెనీలో 7000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. గృహాలంకరణ బ్రాండ్ ఐకై అసై (Ikai Asai) వ్యవస్థాపకురాలు కూడా.
ఆర్యమాన్ బిర్లా ఫస్ట్ క్లాస్ క్రికెటర్. వ్యవస్థాపకత, VC పెట్టుబడి సహా అనేక రకాల అనుభవం ఉంది. కొత్త యుగం వ్యాపారాల్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించడంలో ఇప్పటికే భాగమయ్యారు. ఆదిత్య బిర్లా గ్రూప్ వెంచర్ క్యాపిటల్ ఫండ్, ఆదిత్య బిర్లా వెంచర్స్‌కు కూడా ఆర్యమన్ నాయకత్వం వహిస్తున్నారు.