BCCI Media Rights: ద్వైపాక్షిక సిరీసులపై అనాసక్తి! మీడియా రైట్స్ వేలంలో పాల్గొనాలని అమెజాన్, గూగుల్ బీసీసీఐ రిక్వెస్ట్!
BCCI Media Rights: టీమ్‌ఇండియా క్రికెట్ మ్యాచుల ప్రసార హక్కుల వేలానికి ఉండే క్రేజే వేరు! ఎంత ఖర్చు పెట్టైనా సరే మీడియా హక్కులను దక్కించుకోవాలని తపన పడేవి! కానీ ఇప్పుడా పరిస్థితి లేదని సమాచారం!
BCCI Media Rights:
టీమ్‌ఇండియా క్రికెట్ మ్యాచుల ప్రసార హక్కుల వేలానికి ఉండే క్రేజే వేరు! బీసీసీఐ ఎప్పుడు బిడ్డింగ్ నిర్వహించినా బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతుంటాయి. ఎంత ఖర్చు పెట్టైనా సరే మీడియా హక్కులను దక్కించుకోవాలని తపన పడేవి! కానీ ఇప్పుడా పరిస్థితి లేదని సమాచారం!
రాబోయే ఐదేళ్లకు టీమ్‌ఇండియా ద్వైపాక్షిక సిరీసుల ప్రత్యక్ష్య ప్రసార హక్కులకు వేలం నిర్వహణకు బీసీసీఐ సిద్ధమైంది. చివరి వేలంతో పోలిస్తే మరిన్ని డబ్బులు వస్తాయని ఆశించింది. కానీ అలాంటి పరిస్థితేమీ కనిపించడం లేదు. బ్రాడ్‌కాస్టర్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదట! దాంతో వేలంలో పాల్గొనాల్సిందిగా అమెజాన్, గూగుల్ వంటి అంతర్జాతీయ కంపెనీలను బీసీసీఐ కోరినట్టు తెలిసింది.
ఒకప్పటితో పోలిస్తే ద్వైపాక్షిక సిరీసులకు విలువ తగ్గింది! ఈ మ్యాచులను వీక్షించేందుకు అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో పోలిస్తే పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం కొనసాగడం మరో కారణం. కాస్ట్ కటింగ్ నేపథ్యంలో కంపెనీలు ప్రకటనలు ఇవ్వడానికి సిద్ధంగా లేవు. ఒకవేళ ఇచ్చినా ఎక్కువ డబ్బు చెల్లించలేమని మొహమాటం లేకుండా చెబుతున్నాయి.
బ్రాడ్‌కాస్టర్లు ఆసక్తి చూపించకపోవడంతో ద్వైపాక్షిక సిరీసుల ప్రసార హక్కుల వేలం ప్రక్రియను బీసీసీఐ రెండు వారాలు వెనక్కి జరిపింది. మరిన్ని కంపెనీలు పోటీపడేలా ఆసక్తి పెంచేందుకు బోర్డు ప్రయత్నిస్తోందని తెలిసింది. దాంతో సలహాదారు ఎర్నెస్ట్ అండ్ యంగ్ సూచన మేరకు వేలం ప్రక్రియను ఆగస్టు చివరికి జరిగింది. టీమ్‌ఇండియా ఐదేళ్ల పాటు ఆడే 102 మ్యాచులకు 750 మిలియన్ డాలర్ల మేర డబ్బులు వస్తాయని ఎర్నెస్ట్ అంచనా వేస్తోంది. చివరిసారీ బీసీసీఐకి ఇంతే మొత్తం వచ్చినట్టు తెలిసింది.
ఏదేమైనా రిలయన్స్ నేతృత్వంలోని వయాకామ్ 18 తగ్గేదేలే అంటోంది! ద్వైపాక్షిక సిరీసుల హక్కులను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు డిస్నీ మాత్రం ఆచితూచి వ్యవరిస్తోందని తెలిసింది. అంతర్జాతీయంగా కాస్ట్ కటింగ్ చేస్తుండటమే ఇందుకు కారణం. 2019లో స్టార్ ఇండియా ఐదేళ్ల కాలానికి 741 మిలియన్ డాలర్లు లేదా రూ.61,00 కోట్లతో ఈ హక్కులను దక్కించుకుంది. అభిమానులకు ఆసక్తి లేకపోవడంతో వారికి దాదాపుగా రూ. 1000 కోట్ల మేర నష్టం వచ్చినట్టు సమాచారం.