Adani Group: అదానీ ప్లాన్ అట్టర్ ప్లాఫ్ - మరింత పెరిగిన సంక్షోభం
ఈ రోజు కూడా అదానీ గ్రూప్ షేర్లలో భారీ క్షీణత కనిపిస్తోంది.
Adani Group: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) నివేదిక తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్‌లో (Adani Group Stocks) తుర్కియేను మించిన భూకంపం వచ్చింది. అదానీ గ్రూప్ కొన్ని నష్ట నివారణ చర్యలు చేపట్టినా షేర్ల పతనం మాత్రం ఆగలేదు. తాజాగా, అదానీ గ్రూప్ మరో ఉపాయంతో ముందుకు వచ్చింది. గ్రూప్ కంపెనీల వ్యాపార, ఆర్థిక పరిస్థితులను ఒక స్వతంత్ర సంస్థ ద్వారా మదింపు చేయించాలని నిర్ణయించుకుంది.
గ్రూప్‌లోని కొన్ని కంపెనీల లెక్కలను ఆడిట్ చేయమని స్వతంత్ర అకౌంటింగ్ ఏజెన్సీ అయిన గ్రాంట్ థోర్న్‌టన్‌ను (Grant Thornton) అదానీ గ్రూప్ కోరింది. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత, ఈ రోజు (మంగళవారం, 14 ఫిబ్రవరి 2023) గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల షేర్ ధరలు పెరుగుతాయని అదానీ గ్రూప్ భావించింది. అయితే, ఈ రోజు కూడా అదానీ గ్రూప్ షేర్లలో భారీ క్షీణత కనిపిస్తోంది.
కొత్త వార్త ఎక్కడ నుండి వచ్చింది?
ఎకనమిక్ టైమ్స్ ఈ వార్తను ప్రచురించింది. ఆ రిపోర్ట్ ప్రకారం... తమ గ్రూప్‌లోని కొన్ని కంపెనీలను ఆడిట్ చేయమని గ్రాంట్ థార్న్‌టన్‌ను అదానీ గ్రూప్ కోరిందని, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుందని ఎకనమిక్ టైమ్స్ నివేదించింది. ఇది కూడా అనధికార సమాచారం అని చెబుతూ వార్తను ప్రచురించింది.
అదానీ గ్రూప్ కంపెనీలు చేపడుతున్న ఆర్థిక లావాదేవీలు కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాల ప్రకారం ఉన్నాయా, లేదా అనే అంశంపైనా గ్రాంట్ థోర్న్‌టన్ ఆడిట్ చేస్తుందని సమాచారం. అయితే, అటు గ్రాంట్ థోర్న్‌టన్ గానీ, ఇటు అదానీ గ్రూప్ గానీ దీని గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
భారీగా నష్టపోయిన అదానీ గ్రూప్
2023 జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక బయటకు వచ్చింది. ఈ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలను పెంచడానికి అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందని తన నివేదికలో హిండెన్‌బర్గ్ ఆరోపించింది. దీని తర్వాత, అదానీ గ్రూప్‌ను వరుస కష్టాలు చుట్టుముట్టాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన రిపోర్టును అదానీ గ్రూప్ ఖండించింది. హిండెన్‌బర్గ్ ప్రశ్నలకు సమాధానంగా 400 పైగా పేజీలతో ప్రత్యుత్తరం జారీ చేసింది. అయితే ఈ గ్రూప్ ఇన్వెస్టర్లు ఇప్పటికీ ఆందోళనలో ఉన్నారు.
అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీలు గత మూడు వారాల్లో దాదాపు 120 బిలియన్ డాలర్లు నష్టపోయాయి, గ్రూప్ మార్కెట్ విలువ సగానికి సగం పడిపోయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.