Adani: వివాదాలున్నా వెరవని అదానీ, మరో కొత్త కంపెనీ ఏర్పాటు
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు 100 శాతం అనుబంధ సంస్థ ఇది. ఈ నెల 7వ తేదీన కొత్త కంపెనీ ఏర్పాటైంది.
Adani Enterprises: భారతదేశంలో రెండో అత్యంత సంపన్న వ్యక్తి అయిన గౌతమ్ అదానీ, వివాదాలు ఎన్ని చుట్టుముట్టినా వెరవడం లేదు. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న వివాదాల మధ్యే తన వ్యాపార సామ్రాజ్యాన్ని అదానీ గ్రూప్ విస్తరిస్తోంది. ఇందులో భాగంగా, అదానీ గ్రూప్ ఒక కొత్త కంపెనీని ఏర్పాటు చేసింది. ఇది, కొత్త రంగాల్లో వ్యాపారం చేస్తుంది.
కోల్ వాషరీ (coal washery) వ్యాపారాన్ని చేపట్టేందుకు ఒక కొత్త, పూర్తి స్థాయి యాజమాన్య అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది.
కొత్త కంపెనీ పేరు పెల్మా కాలిరీస్ లిమిటెడ్ (Pelma Collieries Ltd). అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు 100 శాతం అనుబంధ సంస్థ ఇది. ఈ నెల 7వ తేదీన కొత్త కంపెనీ ఏర్పాటైంది. రూ. 10 లక్షల ప్రారంభ అధీకృత మూలధనం, రూ. 5 లక్షల పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌తో పెల్మా కాలరీస్‌ను అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్థాపించింది.
కొత్త కంపెనీ చేసే వ్యాపారం ఏంటి?
పెల్మా కాలిరీస్ బొగ్గు హ్యాండ్లింగ్ సిస్టమ్స్ సహా కోల్ వాషరీలను నిర్మించడం, నిర్వహించడం వంటి వ్యాపారాన్ని చేస్తుంది. ఈ వ్యాపారానికి అవసరమైన అన్ని సంబంధిత పనులనూ చేపడుతుంది. పెల్మా కాలరీస్ కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం అవుతాయని అదానీ ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది.
జనవరి నుంచి మొదలైన సమస్యలు
అదానీ గ్రూప్‌నకు ఈ సంవత్సరం బాగా లేదు. సంవత్సరం మొదటి నెలలో, అమెరికన్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ వివాదాస్పద నివేదికను విడుదల చేయడంతో అదానీ గ్రూప్ సమస్యలు మొదలయ్యాయి. ఆ నివేదిక తర్వాత, అదానీ గ్రూప్ విలువ పరంగా చాలా నష్టపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత, దేశ, విదేశీ మీడియాల్లో ఈ గ్రూప్‌నకు ప్రతికూలంగా వార్తలు వచ్చాయి. దేశీయంగా అదానీ గ్రూపు రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటోంది. హిండెన్‌బర్గ్ వివాదాస్పద నివేదిక మీద దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేసింది.
వ్యూహం మార్చిన అదానీ గ్రూప్
సమస్యలన్నీ కలిసి అష్టదిగ్బంధనం చేయడంతో, అదానీ గ్రూప్ తన వ్యూహాన్ని మార్చింది. కొత్త వ్యాపారాల ప్రారంభానికి విరామం ప్రకటించి, ఇప్పటికే నడుస్తున్న వ్యాపారాలను, ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు కూడా అదానీ గ్రూప్ విద్యుత్‌ను ఎగుమతి చేయడం ప్రారంభించింది.
రాజకీయ ఆరోపణలపైనా అదానీ గ్రూప్ స్పష్టత ఇచ్చింది. డొల్ల కంపెనీల నుంచి రూ. 20,000 కోట్లను అదానీ గ్రూప్ సమీకరించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తే, 2019 నుంచి వచ్చిన నిధులన్నింటికీ ఆ గ్రూపు లెక్కలు అప్పజెప్పింది. ఈ అన్ని పరిణామాల మధ్య, అదానీ గ్రూప్ షేర్లలో ర్యాలీ తిరిగి వచ్చింది,
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.