Axis bank hikes rates: SBI బాటలో Axis బ్యాంక్, లోన్ కోసం వెళ్తే బాదుడే బాదుడు
వడ్డీ రేట్లను 30 బేసిస్ పాయింట్లు లేదా 0.30 శాతం పెంచింది. ఈ కొత్త రేట్లు డిసెంబర్ 17, 2022 నుంచి అమలులోకి వచ్చాయి.
Axis bank hikes rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India- RBI), ఈ ఏడాదిలో ఐదో సారి, 2022 డిసెంబర్ 7న తన రెపో రేటును పెంచింది. 35 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును సెంట్రల్ బ్యాంక్ పెంచింది. ఈ పెంపు తర్వాత, కొన్ని బ్యాంకులు తమ రుణాలు & ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) మీద వడ్డీ రేట్లను పెంచాయి.
దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India- SBI) కూడా, రుణాల మీద తాను వసూలు చేసే వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు లేదా 0.25 శాతం పెంచింది. 2022 డిసెంబర్ 15 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
స్టేట్ బ్యాంక్ తర్వాత, దేశంలోని పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ (Axis bank) కూడా అదే బాటలో నడిచింది. ఈ బ్యాంక్, తన వడ్డీ రేట్లను 30 బేసిస్ పాయింట్లు లేదా 0.30 శాతం పెంచింది. ఈ కొత్త రేట్లు డిసెంబర్ 17, 2022 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ పెంపు తర్వాత, యాక్సిస్ బ్యాంక్ రుణ వినియోగదారుల మీద భారం పెరిగింది. యాక్సిస్ బ్యాంక్ నుంచి తీసుకున్న హోమ్ లోన్, కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ మొదలైన వాటిపై ఎక్కువ వడ్డీ రేటును చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా, నెలనెలా చెల్లించాల్సిన EMI మొత్తం ఇప్పుడు పెరిగింది.
యాక్సిస్ బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లు
ఇప్పుడు, ఒక సంవత్సరం కాల పరిమితి ఉన్న MCLR (marginal cost of funds-based lending rates) గతంలోని 8.45 శాతం 8.75 శాతానికి పెరిగింది. రెండేళ్లు, మూడేళ్ల కాల పరిమితి రేట్లు వరుసగా 8.85 శాతం, 8.9 శాతానికి చేరాయి. మూడు నెలల MCLR 8.65 శాతానికి చేరుకుంది. 6 నెలల MCLR 8.70 శాతానికి, ఓవర్‌నైట్ లోన్ 8.55 శాతానికి చేరుకుంది.
వడ్డీ రేటు పెంచిన HDFC
దేశంలో అతి పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన HDFC లిమిటెడ్ కూడా, తన రుణ రేటును 35 బేసిస్ పాయింట్లు లేదా 0.35 శాతం పెంచింది. ఈ పెంపుదల ఇవాళ్టి (మంగళవారం, 20 డిసెంబర్ 2022) నుంచి అమల్లోకి కూడా వచ్చింది. గత 8 నెలల్లోనే 8వ సారి వడ్డీ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు, HDFC ఆఫర్ చేస్తున్న గృహ రుణాల మీద వడ్డీ రేట్లు 8.20 శాతం నుంచి ప్రారంభం అయ్యేవి. పెరుగుదల తర్వాత, కనీసం రేటు 8.65 శాతంగా మారింది.
క్రెడిట్ స్కోర్ బాగుంటే తక్కువ వడ్డీ రేటు
800 లేదా ఆ పైన క్రెడిట్ స్కోరు ఉన్న వారికి కనిష్ట రేటుకు (8.65 శాతం) HDFC గృహ రుణం అందిస్తోంది. SBI కూడా, 750 పైన క్రెడిట్ స్కోరు ఉన్నవారికి 8.75 శాతం వడ్డీకి గృహ రుణం ఇస్తోంది. ICICI కూడా పండగ ఆఫర్ కింద 750 పైన క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 8.75 శాతానికి రుణాలిస్తోంది. అయితే, ఇవన్నీ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్లు.