Bike Safety Tips: బైక్ నడుపుతున్నప్పుడు మొదట ఏ బ్రేక్ వేయాలి?, 70-30 బ్రేకింగ్ రూల్ గురించి మీకు తెలుసా?
Bike Braking Tips: బైక్ లేదా స్కూటర్ నడుపుతున్నప్పుడు, ముందుగా ఏ బ్రేక్ వేయాలి - ముందు బ్రేక్ లేదా వెనుక బ్రేక్?. 70-30 బ్రేకింగ్ నియమం & సురక్షితమైన రైడింగ్ కోసం ముఖ్యమైన చిట్కాలను తెలుసుకుందాం.

Front Brake vs Rear Brake Usage In A Bike Or Scooter: ఈ స్టోరీ టైటిల్ చదవగానే, బైక్ నడిపేటప్పుడు మొదట వెనుక బ్రేకేగా వేయాలి, ముందు బ్రేక్ వేస్తే పడిపోతాం కదా!, ఆ మాత్రం మాకు తెలీదా అనుకున్నారా?. మొదట, ఈ కథనం మొత్తం చదవండి, మీ అభిప్రాయం మారిపోతుంది.
బైక్ లేదా స్కూటర్ నడుపుతున్నప్పుడు, ఆ బైక్ మీద ఉన్న వ్యక్తి/వ్యక్తులు అకస్మాత్తుగా పడిపోవడం మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. రోడ్డుపై ట్రాఫిక్ లేకుండా, పూర్తి క్లియర్‌గా, మలుపులు లేకుండా నేరుగా ఉన్నప్పుడు కూడా కొందరు దభీమని పడిపోతారు. దూరం నుంచి చూసినవాళ్లు, ఏ కారణం లేకుండా అలా పడిపోయారేంటి అనుకుంటారు. నిజానికి, ఇటువంటి ప్రమాదాలకు అత్యంత సాధారణ కారణం బ్రేక్‌లను తప్పుగా వేయడం. మీరు, మీకు తెలియకుండానే వెనుక బ్రేక్‌ను మాత్రమే నొక్కితే, మీ బైక్ ఆగడానికి బదులుగా జారిపోవచ్చు లేదా బ్రేక్ లాక్ కావచ్చు. అందుకే బ్రేకింగ్ గురించి సరైన మార్గాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఏ బ్రేక్‌ను ముందుగా వేయాలి - ముందు బ్రేక్ లేదా వెనుక బ్రేక్?
బైక్‌ను వెంటనే ఆపడానికి ముందు బ్రేక్ అత్యంత ప్రభావవంతమైన వ్యవస్థ. మీరు ముందు బ్రేక్ వేసినప్పుడు, బైక్ బరువులో ఎక్కువ భాగం ముందు చక్రంపై పడుతుంది. అందువల్ల, మీరు ముందు బ్రేక్‌ను ఉపయోగిస్తే, బైక్ త్వరగా ఆగిపోతుంది. అయితే, వేగంలో ఉన్న ముందు బ్రేక్ మాత్రమే ఉపయోగించడం సురక్షితం కానేకాదు. ఇప్పుడు వెనుక బ్రేక్ దగ్గరకు వద్దాం. ముందు బ్రేక్ పనితీరుకు విరుద్ధంగా, వెనుక బ్రేక్ బైక్ వేగాన్ని క్రమంగా తగ్గిస్తుంది తప్ప, బండిని వెంటనే ఆపదు. మీరు వెనుక బ్రేక్‌పై మాత్రమే ఆధారపడితే బైక్ ఆలస్యంగా ఆగుతుంది & స్కిడ్డింగ్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
70-30 బ్రేకింగ్ రూల్ అంటే ఏంటి?
బైక్ లేదా స్కూటర్‌ను సురక్షితంగా ఆపడానికి "70-30 బ్రేకింగ్ రూల్" అత్యంత ప్రభావవంతమైనదిగా ఆటో ఎక్స్‌పర్ట్స్ చెబుతారు. ఈ నియమం ప్రకారం, బ్రేక్‌లను వేసేటప్పుడు, ముందు బ్రేక్‌పై 70% ఒత్తిడిని & వెనుక బ్రేక్‌పై 30% ఒత్తిడిని అప్లై చేయాలి. ఇది సమతౌల్య బ్రేకింగ్ విధానం. ఇది, బైక్ లేదా స్కూటర్‌ను స్కిడ్డింగ్ రిస్క్ నుంచి తప్పిస్తుంది & వాహనంపై రైడర్‌కు మెరుగైన నియంత్రణ కూడా ఉంటుంది. ఫలితంగా, బైక్ సరైన సమయంలో ఆగిపోతుంది & ప్రమాదాల అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.
ఇసుక రోడ్లు లేదా కంకర రోడ్లపై బ్రేక్‌లను ఎలా ఉపయోగించాలి?
నిజానికి, బ్రేక్‌లు వేసే పద్ధతి ప్రతి రోడ్డు & పరిస్థితిలో ఒకేలా ఉండదు & ఉండకూడదు కూడా. స్ట్రెయిట్‌గా & చదునుగా ఉన్న రోడ్లపై ఫ్రంట్ బ్రేక్‌ను ఎక్కువగా ఉపయోగించడం సురక్షితం. ఇది, బైక్‌ను త్వరగా & స్థిరంగా ఆపేస్తుంది. కానీ... వంపు తిరిగిన లేదా ఇరుకైన రహదారిలో ఉన్నప్పుడు, ఫ్రంట్ బ్రేక్‌ను నేరుగా వర్తింపజేయడం ప్రమాదకరం కావచ్చు, బైక్/స్కూటర్ జారిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిలో, మొదట వెనుక బ్రేక్‌తో వేగాన్ని తగ్గించండి, తరువాత క్రమంగా ఫ్రంట్ బ్రేక్‌ను ఉపయోగించండి.
రోడ్డుపై ఇసుక, కంకర లేదా నీరు ఉన్నప్పుడు అకస్మాత్తుగా బ్రేక్‌లు వేయడం వల్ల బైక్ స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. అటువంటి ఉపరితలాలపై నెమ్మదిగా & సమతౌల్యతతో బ్రేకులు వేయాలి. తద్వారా, మీతో పాటు, రోడ్డుపై ఉన్న ఇతరులకు కూడా రిస్క్ లేకుండా ఉంటుంది.





















