Land Cruiser 300: ఫీచర్లతో ఫీవర్ తెప్పించే కార్ - ఇండియాలో టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 ధర ఎంత?
Toyota Land Cruiser 300: కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 మోడల్‌లో, ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న అత్యాధునిక సాంకేతికతలు, ప్రీమియం ఫీచర్లను వినియోగించారు.

Toyota Land Cruiser 300 Price, Mileage And Features In Telugu: టయోటా మోటార్స్, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో భారత మార్కెట్లో కొత్త మోడల్ ల్యాండ్ క్రూయిజర్ 300ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌ను అడ్వాన్స్‌డ్ & ఫ్రెష్ ఫీచర్లతో ప్యాక్ చేసి మార్కెట్లోకి తీసుకువచ్చారు. పిండి కొద్దీ రొట్టె అన్నట్లు, ఫీచర్ల కొద్దీ రేటు. టయోటా కంపెనీ, ల్యాండ్ క్రూయిజర్ 300 ధరను (Toyota Land Cruiser 300 Price) రూ. 2.31 కోట్ల నుంచి రూ. 2.41 కోట్ల మధ్య నిర్ణయించింది.
టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 కొత్త మోడల్ రేటు దాని మునుపటి వేరియంట్ ధర కంటే రూ. 21 లక్షల వరకు ఎక్కువ. అయితే, గత వేరియంట్‌తో పోలిస్తే కొత్త వేరియంట్‌లో నయా ప్రీమియం ఫీచర్లను టయోటా యాడ్ చేసింది, అందుకే రేటు కూడా పెంచింది. ముఖ్యంగా, కారులోని ప్రయాణీకుల భద్రత కోసం చాలా రక్షణ కవచాలను (ఫీచర్లు) అమర్చింది.
ల్యాండ్ క్రూయిజర్ 300 ప్రీమియం ఫీచర్లు
టయోటా కొత్త మోడల్ ల్యాండ్ క్రూయిజర్ 300లో... 4 జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, సన్‌రూఫ్, రియర్ సీట్ వెంటిలేషన్, మాన్యువల్ లంబార్ అడ్జస్ట్‌తో 8-వే పవర్డ్ డ్రైవర్ సీటు, 10 ఎయిర్ బ్యాగ్‌లు & 360 డిగ్రీల కెమెరా సహా ఇంకా చాలా ఫీచర్లు ఉన్నాయి.
రిమోట్ AC, జియో-లొకేషన్ & ఫెన్సింగ్ వంటి కనెక్టెడ్ కార్ టెక్నాలజీలను ఈ టయోటా కారులో చూడవచ్చు. ఈ వెహికల్‌లో, అనలాగ్ డయల్స్ స్థానంలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. క్రూయిజర్ 300ను ఈ కంపెనీ రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్‌లో లాంచ్ చేసింది, అవి - ప్రెషియస్ వైట్ పెర్ల్ & యాటిట్యూడ్ బ్లాక్ కలర్.
టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 సేఫ్టీ కిట్
టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 కారు రెండు వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. ఈ రెండు వేరియంట్లలోనూ అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు (Toyota Land Cruiser 300 Safety Features) ఉన్నాయి. ఈ రెండు వేరియంట్లలో లెవల్ 2 'అటానమస్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్' (ADAS) ఉంది, ఇందులో అడాప్టివ్ హెడ్‌లైట్లు, లేన్ కీప్ అసిస్ట్, అటానమస్ బ్రేకింగ్ & అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇంజిన్ & పవర్
టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300లోని 3.3-లీటర్ V6 ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ 309 PS & 700 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ & 4WD తో యాడ్ చేశారు. 3.5-లీటర్ ట్విన్-టర్బో V6 & ఎలక్ట్రిక్ మోటారుతో పెట్రోల్-హైబ్రిడ్ ఆప్షన్ కూడా ఉంది, ఇది ఉమ్మడిగా 457 హార్స్‌పవర్‌ను అందిస్తుంది.
ల్యాండ్ క్రూయిజర్ 300 గ్రౌండ్ క్లియరెన్స్ అధికంగా, 230-240 mm ఉంటుంది. ఈ ఇంజనీరింగ్ బాడీ స్ట్రక్చర్ వల్ల అన్ని రకాల రోడ్డు పరిస్థితులలోనూ కారు సజావుగా నడుస్తుంది.





















