(Source: ECI | ABP NEWS)
భారీ డిమాండ్‌తో Skoda Octavia RS బుకింగ్స్ క్లోజ్ - లాంచ్‌కి ముందే అమ్ముడైపోయిన కార్లు
భారత మార్కెట్‌లోకి రావడానికి ముందే Skoda Octavia RS కి భారీ డిమాండ్ ఏర్పడింది. కేవలం కొన్ని రోజుల్లోనే అన్ని యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ కారు స్పెక్స్, ఫీచర్లు, ధర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Skoda Octavia RS Launch Date Specs Price: భారత మార్కెట్‌లోకి స్కోడా ఆక్టావియా RS తిరిగి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఇండియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. స్కోడా ఇండియా, ఈ హై-పర్ఫార్మెన్స్ సెడాన్ కోసం బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని రోజుల్లోనే అన్ని యూనిట్లు పూర్తిగా బుక్ అయ్యాయి. రీఎంట్రీలో స్కోడా మొత్తం 100 యూనిట్లను మాత్రమే అందుబాటులో ఉంచింది, అందువల్లే ఈ కారుకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రతి యూనిట్ కోసం ₹2.50 లక్షల అడ్వాన్స్ తీసుకున్నారు. ఇంకా ధర ప్రకటించకముందే ఇంత హైప్ రావడం స్కోడా అభిమానుల క్రేజ్‌ని స్పష్టంగా చూపిస్తోంది.
భారీ ఇంపోర్ట్ సెడాన్ - ధర వివరాలు
ఆక్టావియా RS ని స్కోడా పూర్తిగా నిర్మించిన ఇంపోర్టెడ్ మోడల్‌గా (కంప్లీట్ బిల్డ్ యూనిట్ - CBU) భారత్‌కు తీసుకువస్తోంది. దీని ధర ₹50 లక్షల నుంచి ₹55 లక్షల ఎక్స్-షోరూమ్ మధ్య ఉండే అవకాశం ఉంది. లాంచ్ డేట్ అక్టోబర్ 17గా నిర్ణయించారు. అయితే, కొంతమంది కస్టమర్లు, ధర తెలిసిన తర్వాత క్యాన్సిల్ చేసే అవకాశం ఉండడంతో ఆసక్తి ఉన్నవాళ్లు ఈ కారు లాంచ్ తర్వాత షోరూమ్‌లను సంప్రదించవచ్చు.
పవర్ పంచ్ లాంటి పెర్ఫార్మెన్స్
స్కోడా ఆక్టావియా RS లో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 265 హార్స్‌పవర్, 370Nm టార్క్ ఇస్తుంది. 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో ఈ కారు రోడ్ మీద చిరుతలా పరిగెడుతుంది. 0 నుంచి 100 km/h వేగాన్ని కేవలం 6.4 సెకన్లలో చేరుతుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 250 km. స్పోర్ట్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా స్టాండర్డ్‌గా ఇస్తున్నారు.
ఫీచర్లలో క్లాస్ టచ్
స్కోడా ఆక్టావియా RS లో 12.9 అంగుళాల టచ్ స్క్రీన్, ADAS సూట్, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, LED మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్స్ లాంటి హైఎండ్ ఫీచర్లు ఉన్నాయి. ఇంటీరియర్ పూర్తిగా బ్లాక్ లెదరెట్, సువేద్ కాంబినేషన్‌తో అద్భుతంగా కనిపిస్తుంది. అంతేగాక, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, కాంటన్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, 360-డిగ్రీ కెమెరా, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్‌డ్ సీట్స్ విత్ మసాజ్ ఫంక్షన్, సేఫ్టీ కోసం 10 ఎయిర్‌బ్యాగ్స్ అందిస్తున్నారు.
కలర్ ఆప్షన్లు కూడా స్పెషల్
కొత్త ఆక్టావియా RS మాంబా గ్రీన్, మాజిక్ బ్లాక్, క్యాండీ వైట్, రేస్ బ్లూ, వెల్వెట్ రెడ్ కలర్లలో లభిస్తుంది. స్టైలిష్‌గా, అగ్రెసివ్‌గా కనిపించే ఈ కారు ఇప్పటికే కార్ లవర్స్ కలెక్షన్ లిస్ట్‌లో చేరిపోయింది.
స్కోడా ఆక్టావియా RS అంటే భారతీయ పెట్రోల్ డ్రైవర్లకు ఒక కల. తొలుత, 2020లో వచ్చిన RS 245 కూడా కేవలం నెల రోజుల్లోనే అమ్ముడైపోయింది. ఇప్పుడు వచ్చేది 4వ తరం RS, ఇది కూడా అదే క్రేజ్‌తో మార్కెట్ హీట్ పెంచింది.





















