265 Hp, 4WD టెక్నాలజీతో Skoda Kodiaq RS - బుకింగ్స్ ఓపెన్, అమ్మకానికి 50 యూనిట్లు మాత్రమే!
భారత్‌లో Skoda Kodiaq RS బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 265 హెచ్‌పీ ఇంజిన్, 4WD, DCC Plus సస్పెన్షన్, ప్రీమియం ఫీచర్లతో కేవలం 50 యూనిట్లు మాత్రమే అందుబాటులోకి రానున్నాయి.

Skoda Kodiaq RS bookings open: భారత ఆటోమొబైల్ మార్కెట్లో పెర్ఫార్మెన్స్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని స్కోడా ఇండియా మరో ప్రత్యేక మోడల్‌ను తీసుకొస్తోంది. స్కోడా కొడియాక్ RS బుకింగ్స్‌ను అధికారికంగా ప్రారంభించింది. ఈ హై-పెర్ఫార్మెన్స్ 7-సీటర్ SUV కోసం రూ.3 లక్షల టోకెన్ అమౌంట్‌తో బుక్ చేసుకోవచ్చు. అయితే, ఈ కంపెనీ మన మార్కెట్లోకి తొలి దశలో కేవలం 50 యూనిట్లను (కార్లు) మాత్రమే అందుబాటులోకి తీసుకువస్తోంది.
ధర
స్కోడా ఆర్ఎస్ బ్యాడ్జ్‌తో భారత మార్కెట్లోకి వస్తున్న రెండో మోడల్ ఇది. ఇప్పటివరకు ఆక్టావియా ఆర్ఎస్ మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు కొడియాక్ ఆర్ఎస్ రూపంలో కంపెనీ తన పెర్ఫార్మెన్స్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఈ కొత్త SUV ఎక్స్‌షోరూమ్ ధర సుమారు రూ.55 లక్షల నుంచి రూ.60 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కొడియాక్ ఆర్ఎస్‌లో 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ EA888 ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 265 Hp శక్తిని ఉత్పత్తి చేయడంతో పాటు 400 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఆక్టావియా ఆర్ఎస్‌తో పోలిస్తే దీని టార్క్ 30 ఎన్ఎమ్ ఎక్కువగా ఉండటం ప్రత్యేకత. దీనికి 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.
పవర్‌తో పాటు డ్రైవింగ్ అనుభూతిని మరింత మెరుగుపరచేందుకు 4WD సిస్టమ్‌ను అందించారు. దీంతో ఈ SUV కేవలం 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం గంటకు 231 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది.
ప్రత్యేకమైన సస్పెన్షన్ టెక్నాలజీ
ఈ మోడల్‌లో స్కోడా ప్రత్యేకమైన DCC Plus అడాప్టివ్ సస్పెన్షన్ టెక్నాలజీని కూడా అందిస్తోంది. ఇందులో 15 స్థాయిల డ్యాంపింగ్ అడ్జస్ట్‌మెంట్ సదుపాయం ఉండటంతో డ్రైవర్ అవసరానికి అనుగుణంగా వాహన పనితీరును మార్చుకోవచ్చు. ఎకో, కంఫర్ట్, నార్మల్, స్పోర్ట్, ఇండివిడ్యువల్, స్నో & ఆఫ్‌రోడ్ వంటి డ్రైవ్ మోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి.
ఎక్స్‌టీరియర్ & ఇంటీరియర్
డిజైన్ పరంగా చూస్తే సాధారణ కొడియాక్‌తో పోలిస్తే ఆర్ఎస్ వెర్షన్ మరింత స్పోర్టీగా కనిపిస్తుంది. అగ్రెసివ్ బంపర్లు, గ్లోస్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ ఎలిమెంట్స్, ప్రత్యేక ఆర్ఎస్ బ్యాడ్జింగ్, 20 అంగుళాల అలాయ్ వీల్స్, పెద్ద రూఫ్ స్పాయిలర్ & డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్ ఈ ఎస్యూవీకి ప్రత్యేక గుర్తింపును తెస్తున్నాయి. మ్యాజిక్ బ్లాక్, మూన్ వైట్, స్టీల్ గ్రే & వెల్వెట్ రెడ్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది.
ఇంటీరియర్‌లో పూర్తిగా బ్లాక్ థీమ్‌ను ఉపయోగించారు. ఎరుపు రంగు స్టిచింగ్, ఆర్ఎస్ స్పెషల్ త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, స్పోర్ట్స్ సీట్లు క్యాబిన్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. 7-సీటర్ కాన్ఫిగరేషన్‌తో వచ్చే ఈ ఎస్యూవీలో 12.9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పానోరమిక్ సన్‌రూఫ్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
అంతేకాకుండా వెంటిలేటెడ్, హీటెడ్, మసాజ్ ఫంక్షన్ కలిగిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, మెమరీ ఫంక్షన్, థై ఎక్స్‌టెండర్, 360 డిగ్రీ కెమెరా, అడాస్ సేఫ్టీ సూట్, 9 ఎయిర్‌బ్యాగ్స్, 13 స్పీకర్ల కాంటన్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్లతో ఈ ఎస్యూవీ లగ్జరీ & పెర్ఫార్మెన్స్‌ను ఒకే వేదికపై అందించనుంది.
పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులోకి వస్తున్న స్కోడా కొడియాక్ RS, పెర్ఫార్మెన్స్ SUV ప్రియులను ఆకర్షించడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్‌లో ప్రీమియం స్పోర్టీ SUVల విభాగంలో ఈ మోడల్‌కు ప్రత్యేక గుర్తింపు దక్కే అవకాశాలు ఉన్నాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















