Royal Enfield Himalayan 450 vs KTM 390 Adventure X - కొత్త GST తర్వాత ధరలు ఎలా ఉన్నాయి, ఏ బైక్ తీసుకోవాలి?
GST 2.0 తర్వాత 350cc పైబడిన బైక్‌ల ధరలు పెరిగాయి. Royal Enfield Himalayan 450 పెరిగిన ధరతో వస్తుండగా, KTM 390 Adventure X మాత్రం అదే ధరలో అందుబాటులో ఉంది.

Himalayan vs KTM Bikes Comparison 2025: GST 2.0 రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత 350cc కంటే ఎక్కువ ఇంజిన్ ఉన్న బైక్‌ల ధరలు పెరిగాయి. 350cc కంటే తక్కువ ఇంజిన్ బైక్‌ల రేట్లు మాత్రం తగ్గి, మరింత చకగా మారాయి. ఈ మార్పు వల్ల అడ్వెంచర్ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 & KTM 390 అడ్వెంచర్ X మధ్య మంచి పోటీ మొదలైంది. ఇప్పుడు వీటి ధరలలో ఎంత మార్పు వచ్చిందో పరిశీలిద్దాం.
GST 2.0 తర్వాత Royal Enfield Himalayan 450 ధర
హిమాలయన్ 450 ధరలు ఇప్పుడు పెరిగాయి. GST 2.0 కు ముందు ఈ బైక్ ధర రూ. 2.85 లక్షల నుంచి రూ. 2.98 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండేది. కొత్త GST 2.0 రేట్లు వర్తించడంతో ఇప్పుడు ఈ బైక్ ధరలు రూ. 3.06 లక్షల నుంచి రూ. 3.20 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ధర) పెరిగాయి. హన్లే బ్లాక్ కలర్ వేరియంట్ అత్యధిక ధర కలిగి ఉంది.
హిమాలయన్ 450లో 452cc లిక్విడ్-కూల్డ్ “షెర్పా” ఇంజిన్ ఉంది, ఇది 40hp పవర్, 40Nm టార్క్ ఇస్తుంది. ఈ ఇంజిన్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ అయి ఉంది. ఆఫ్-రోడ్ రైడింగ్ కోసం ఇది సాలిడ్‌గా ఉంటుంది. కానీ కొత్త GST ప్రభావంతో ధర పెరగడం రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు కొంచెం షాక్.
GST 2.0 తర్వాత KTM 390 Adventure X ధర
KTM మాత్రం, తన ప్రియమైన కస్టమర్లకు గుడ్ న్యూస్ ప్రకటించింది. 390 అడ్వెంచర్ X ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. GST 2.0 కు ముందు ఇది రూ. 2.90 లక్షలకు (ఎక్స్-షోరూమ్) లాంచ్ అయింది. ఆ తరువాత కొన్ని ప్రీమియం ఫీచర్లు - క్రూయిజ్ కంట్రోల్, రైడింగ్ మోడ్స్ (స్ట్రీట్, రైన్, ఆఫ్-రోడ్), కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ వంటివి జత చేయడంతో ధర రూ. 3.03 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పెరిగింది. ఇప్పుడు, GST 2.0 తర్వాత కూడా అదే ధర కొనసాగుతోంది. అదనపు GST ఖర్చును KTM కంపెనీయే భరించింది, కస్టమర్‌పై వేయలేదు. అందుకే ఈ బైక్ విలువకు తగ్గ బెస్ట్ ప్యాకేజ్‌గా మారింది.
ప్రధాన ఫీచర్లు & పోలిక
ఈ రెండు బైక్‌లు 400సీసీ రేంజ్‌లో ఉన్నప్పటికీ, ఫీచర్ల పరంగా KTM ముందంజలో ఉంది. KTMలో అలాయ్ వీల్స్ (19-ఇంచ్ ముందు, 17-ఇంచ్ వెనుక) వస్తాయి, ట్యూబ్‌లెస్ టైర్లు ఉంటాయి. హిమాలయన్ 450లో అయితే స్పోక్ వీల్స్ ఉంటాయి, ట్యూబ్‌లెస్ టైర్లు కావాలంటే అదనపు చెల్లింపు చేయాలి.
ఏ బైక్ ముందంజలో ఉంది?
GST 2.0 కి ముందు హిమాలయన్ 450 కొంచెం అందుబాటులో ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. KTM 390 అడ్వెంచర్ X ను హిమాలయన్ 450 టాప్ వేరియంట్‌తో పోలిస్తే దాదాపు రూ. 17,000 తక్కువ ధరలో లభిస్తోంది.
ఫీచర్లు, టెక్నాలజీ పరంగా KTM ముందుంది. అయితే, హిమాలయన్ ఆఫ్-రోడ్ ప్రదర్శనలో మెరుగ్గా ఉంటుంది. కాబట్టి మీ రైడింగ్ అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు - ఫీచర్ లవర్స్‌కు KTM బెస్ట్, అడ్వెంచర్ స్పిరిట్ ఉన్నవారికి హిమాలయన్ పర్ఫెక్ట్.





















