Spec Comparison: రూ. 6.29 లక్షల కొత్త రెనాల్ట్ కిగర్ SUV - బ్రెజ్జా, నెక్సాన్, సోనెట్, వెన్యూ, మ్యాగ్నైట్, కైలాక్‌తో పోలిస్తే ఎలా ఉంది?
Renault Kiger Facelift 2025: కొత్త రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ రూ. 6.29 లక్షలకే లాంచ్ అయింది. దీనిని బ్రెజ్జా, నెక్సాన్, సోనెట్, వెన్యూ, మ్యాగ్నైట్, కైలాక్‌తో పోలిస్తే ఏం తెలుస్తుంది?

Renault Kiger Facelift 2025 Spec Comparison: భారత కాంపాక్ట్ SUV మార్కెట్‌లో పోటీ రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ రూ. 6.29 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్‌లోకి వచ్చింది. దీనిలో శక్తిమంతమైన టర్బో వేరియంట్ ధర రూ. 9.99 లక్షల నుంచి మొదలవుతుంది. ఇప్పుడు ఈ కొత్త కిగర్, తన పోటీ SUVలు అయిన - మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మ్యాగ్నైట్, స్కోడా కైలాక్ తో పోటీ పడాలి, కస్టమర్లను తన వైపు ఆకర్షించాలి.
రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్
ఈ SUVలో 1.0 లీటర్ నేచురల్ పెట్రోల్ ఇంజిన్ (72 hp), 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (100 hp) ఆప్షన్లు ఉన్నాయి. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ స్టాండర్డ్‌గా వస్తుంది. నేచురల్ వేరియంట్ AMT తో కూడా లభిస్తుండగా, టర్బో వేరియంట్‌కు CVT ఆప్షన్ అందుబాటులో ఉంది.
మారుతి సుజుకి బ్రెజ్జా
బ్రెజ్జా 1.5 లీటర్ నేచురల్ పెట్రోల్ ఇంజిన్‌తో (100 hp, 137 Nm) వస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లు ఉన్నాయి. అదనంగా CNG వేరియంట్ కూడా ఉంది, ఇది 88 hp పవర్, 121.5 Nm టార్క్ ఇస్తుంది.
టాటా నెక్సాన్
నెక్సాన్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ (118 hp), 1.5 లీటర్ టర్బో డీజిల్ (113 hp) ఇంజిన్ ఆప్షన్లలతో అందుబాటులో ఉంది. కొత్తగా CNG వెర్షన్ (99 hp) కూడా అందుబాటులో ఉంది. దీనిలో విస్త్రతమైన ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి: 5-స్పీడ్ MT, 6-స్పీడ్ MT, 6-AMT, DCT. డీజిల్ ఇంజిన్‌కు 6-స్పీడ్ MT & AMT ఎంపికలు ఉన్నాయి.
కియా సోనెట్
సోనెట్ మూడు ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది - 1.0 లీటర్ టర్బో పెట్రోల్ (120 hp, 172 Nm), 1.5 లీటర్ డీజిల్ (113 hp, 250 Nm), 1.2 లీటర్ నేచురల్ పెట్రోల్ (82 hp, 115 Nm). ఈ వేరియంట్‌లు ధర & ఫీచర్లలో విభిన్న అవసరాలు ఉన్న కస్టమర్లకు అనుగుణంగా ఉంటాయి.
హ్యుందాయ్ వెన్యూ
వెన్యూ మూడు ఇంజిన్ ఆప్షన్లు ఇస్తుంది - 1.2 లీటర్ నేచురల్ పెట్రోల్ (83 hp, 113.8 Nm), 1.0 లీటర్ టర్బో పెట్రోల్ (120 hp, 172 Nm), 1.5 లీటర్ డీజిల్ (116 hp, 250 Nm). ట్రాన్స్‌మిషన్‌లో 5-స్పీడ్ MT, 6-స్పీడ్ MT, 7-స్పీడ్ DCT ఎంపికలు ఉన్నాయి.
నిస్సాన్ మ్యాగ్నైట్
మ్యాగ్నైట్ 1.0 లీటర్ నేచురల్ పెట్రోల్ (72 hp, 96 Nm), 1.0 లీటర్ టర్బో పెట్రోల్ (99 hp, 160 Nm) ఆప్షన్లతో వస్తుంది. నేచురల్ ఇంజిన్‌కు 5-స్పీడ్ MT, AMT ఆప్షన్లు ఉంటే, టర్బో వేరియంట్‌కు 5-స్పీడ్ MT, CVT లభిస్తాయి.
స్కోడా కైలాక్
కైలాక్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో (115 hp, 178 Nm) వస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ధర ఒక్కటే చూసినప్పుడు రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ; ఇంజిన్ శక్తి, ట్రాన్స్‌మిషన్ ఎంపికలు, అదనపు ఫీచర్లలో ఇతర SUVలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ విభిన్న ఇంజిన్ ఆప్షన్లు, ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అయినప్పటికీ, ధర పరంగా కిగర్, మ్యాగ్నైట్ వినియోగదారులకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్లు కావచ్చు. కాబట్టి ఎవరు ఏ SUVను ఎంచుకోవాలో వారి అవసరాలు, బడ్జెట్, ఇంధన ఆప్షన్లపై ఆధారపడి ఉంటుంది.





















