Rapido Bike Taxi: 11 తెలంగాణ పట్టణాల్లో ర్యాపిడో బైక్-టాక్సీ రైడ్స్ - ఇప్పుడు మీకు దగ్గరలో, తక్కువ ధరలో!
Rapido new towns Telangana: చిక్కులను అధిగమించి, తాజాగా ముంబై, బెంగళూరులో సర్వీసులను మళ్లీ ప్రారంభించిన Rapido, ఇప్పుడు తెలంగాణలో కూడా తన ప్రస్థానాన్ని బలపరచుకుంటోంది.

Rapido bike taxi in Telangana towns: తెలుగు రాష్ట్రాల్లో ప్రజా రవాణా రంగంలో మరో పెద్ద అడుగు పడింది. ప్రముఖ రైడ్-హైలింగ్ ప్లాట్‌ఫాం Rapido, ఇప్పుడు తెలంగాణలో తన బైక్-టాక్సీ సర్వీసులను వేగంగా విస్తరిస్తోంది. తాజాగా, తెలంగాణలో 11 కొత్త పట్టణాల్లో బైక్-టాక్సీ సర్వీసులు ప్రారంభించబడినట్లు ర్యాపిడో ప్రకటించింది.
ఇకపై మహబూబ్‌నగర్ (Mahbubnagar), సంగారెడ్డి (Sangareddy), సిద్దిపేట (Siddipet), నల్గొండ (Nalgonda), కామారెడ్డి (Kamareddy), రామగుండం (Ramagundam), కొత్తగూడెం (Kothagudem), నిజామాబాద్ (Nizamabad), సూర్యాపేట (Suryapet), ఆదిలాబాద్ (Adilabad), భువనగిరి (Bhuvanagiri) పట్టణాల్లో కూడా Rapido బైక్ రైడ్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ పెద్ద అడుగు.. పట్టణ ప్రజలకు సులభమైన, తక్కువ ఖర్చుతో ప్రయాణ సౌకర్యాన్ని ఇంటి ముందుకే అందుబాటులోకి తీసుకువస్తుంది.
టైర్-2 & టైర్-3 పట్టణాలపై ఫోకస్
Rapido ఇప్పటి వరకు ఎక్కువగా మెట్రో నగరాల్లోనే తన సేవలను అందించింది. ఇప్పుడు, వ్యూహాత్మకంగా tier-2 & tier-3 నగరాలు/పట్టణాలపై దృష్టి పెట్టింది. ఈ నగరాల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల, ప్రజలు ఆటోలు లేదా ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. Rapido వంటి bike-taxi సర్వీసులు ఈ ఖాళీని పూరించబోతున్నాయి.
యువతకు బంపర్ ఆఫర్!
Rapido బైక్ టాక్సీల విస్తరణ అనేది ప్రజా రవాణాలోనే కాదు, స్థానిక యువత ఉపాధి విషయంలోనూ మంచి అవకాశం. యువత, మధ్య వయస్సు వ్యక్తులకు ఫ్లెక్సిబుల్ జాబ్ ఆపర్చునిటీస్ లభిస్తున్నాయి. Rapido Captainగా రిజిస్టర్ అయినవారు తమ బైక్‌తోనే రోజువారీగా అదనపు ఆదాయం సంపాదించవచ్చు. పార్ట్ టైమ్‌గానూ ఈ జాబ్ చేయవచ్చు. ముఖ్యంగా.. విద్యార్థులు, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది ఒక మంచి ఉపాధి మార్గం అవుతోంది.
అందరికీ ప్రయోజనం
ప్రయాణికులకు, Rapido bike-taxiలు ఒక బెస్ట్ లాస్ట్-మైల్ కనెక్టివిటీ ఆప్షన్ అవుతున్నాయి. ఉదాహరణకు, నిజామాబాద్ లేదా ఆదిలాబాద్ వంటి పట్టణాల్లో మెట్రో లేదా పెద్ద బస్సు లైన్లు లేవు. ఈ పరిస్థితిలో, Rapido రైడ్స్ మారుమూల దూరాలు & చిన్న దూర ప్రయాణాలను కూడా చాలా సౌకర్యవంతంగా కవర్ చేస్తాయి. ఆటోలు, క్యాబ్‌లతో పోలిస్తే Rapido రైడ్ ఛార్జీలు తక్కువగా ఉండటం కూడా ఒక పెద్ద ఆకర్షణ అవుతుంది.
సవాళ్లు కూడా ఉన్నాయి
Rapido విస్తరణ లాభదాయకమే అయినప్పటికీ, కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. బైక్ టాక్సీ ప్రయాణంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. హెల్మెట్ వాడకపోతే ప్రమాదాల అవకాశాలున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ ప్రభుత్వ అనుమతులపై స్పష్టత రావాలి.
ఏది ఏమైనా, ఈ కొత్త ట్రెండ్ యువతలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. “నా ఊర్లో కూడా Rapido రైడ్ వచ్చింది. ఇక షాపింగ్‌కి, కాలేజీకి వెళ్ళడం చాలా ఈజీ అవుతుంది” అనే సంతోషం యంగ్‌స్టర్స్‌లో కనిపిస్తోంది.





















