No Driving License Scooters: ఈ స్కూటర్లు నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు, పెట్రోల్ కూడా అక్కరలేదు
No Driving License Electric Scooters: మనుషులు తొక్కే సైకిళ్లు & రిక్షాలకు తప్ప, మోటారుతో నడిచే అన్ని బండ్లకు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అయితే, ఇక్కడొక చిన్న వెసులుబాటు కూడా ఉంది.

No Driving License Electric Scooters In India 2025: భారతదేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రోత్సహిస్తున్నారు. వీటితో పెట్రోల్ టెన్షన్ ఉండదు, పెట్రోల్ బండి కంటే ఎక్కువ రేంజ్ ఇస్తాయి, నిర్వహణ ఖర్చులు చాలా తక్కువ, తద్వారా డబ్బు ఆదా అవుతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ ఉన్న వ్యక్తి పెట్రోల్ బంక్, మెకానిక్ షాప్ మొహం చూడాల్సిన అవసరమే దాదాపుగా రాదు. ఇన్ని సుగుణాలు ఉన్నాయి కాబట్టి మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ కూడా నిరంతరం పెరుగుతోంది. అయితే, డ్రైవింగ్ లైసెన్స్ (DL) కూడా అవసరం లేని కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఉన్నాయని మీకు తెలుసా?.
నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని స్కూటర్లు
జెలియో లిటిల్ గ్రేసీ (Zelio Little Gracy)
జలియో లిటిల్ గ్రేసీ స్కూటర్ 'తక్కువ వేగం విభాగం' (Low speed segment) లోకి వస్తుంది. దీనిని గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో నడపవచ్చు. ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్ల నుంచి 75 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌ను ఇస్తుంది. ధర విషయానికి వస్తే... ఈ స్కూటర్ ధర కేవలం రూ. 49,500 (ఎక్స్-షోరూమ్).
ఒకినావా R3 (Okinawa R3)
జలియో లిటిల్ గ్రేసీ తర్వాత, ఈ లిస్ట్‌లో, ఒకినావా R30 రెండో స్థానంలో ఉంది. ఇది కూడా తక్కువ వేగం కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 61,998. ఈ ఒకినావా స్కూటర్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకు నడపవచ్చు.
కైనెటిక్ గ్రీన్ జింగ్ (Kinetic Green Zing)
కైనెటిక్ గ్రీన్ జింగ్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం 25 కిలోమీటర్లు. ఫుల్ ఛార్జ్‌తో ఈ స్కూటర్‌ను దాదాపు 100 కిలోమీటర్ల వరకు నడపవచ్చు & దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 75,990.
యులు విన్ (Yulu Wynn )
నాలుగో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను Yulu కంపెనీ అందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం కూడా 25 కిలోమీటర్లు. ఈ స్కూటర్‌లో తొలగించగల బ్యాటరీ ఉంది, దానిని మీరు రీప్లేస్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ స్కూటర్ ధర ఎక్స్-షోరూమ్ ధర 55,555 రూపాయలు.
ఈ స్కూటర్లు నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు అవసరం లేదు?
మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల ప్రకారం, ఏ మోటారు వాహనాన్నైనా 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడిపే అవకాశం ఉంటే, అలాంటి బండిని నడిపే డ్రైవర్ లేదా రైడర్‌కు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. పైన చెప్పిన నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్ల గరిష్ట వేగం 25 కిలోమీటర్లు మాత్రమే కాబట్టి, వాటిని నడపడానికి చట్ట ప్రకారమే లైసెన్స్ అవసరం లేదు. అంటే, మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినప్పటికీ, ఈ బండ్లను నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల ముందు నుంచే దర్జాగా వెళ్లవచ్చు!.
చట్ట ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేనప్పటికీ, ఎలాంటి మోటారు వాహనం నడిపే వ్యక్తికైనా డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం మంచిది. ఎలాంటి వాహనం నడిపేటప్పుడైనా (ముందు, వెనుకు కూర్చున్న ఇద్దరూ) హెల్మెట్ పెట్టుకోవడం మాత్రం మరిచిపోవద్దు.





















